ఒంగోలు: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డి రైతు భరోసా యాత్రకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక మంత్రులు విమర్శిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాలపై ప్రజా తిరుగుబాటును గమనించిన మంత్రులు ఏ చేయాలో తెలియక జగన్‌పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు.
జగన్‌పై విమర్శలు చేసే మంత్రులు ఎవరైనా దమ్ముంటే రాజీనామా చేసి, మళ్లీ పోటీ చేసి గెలవగలరా అని పశ్నించారు. 44 శాతం ఓట్లతో ఒక కోటీ 30 లక్షల మంది ప్రజల మద్దతు పొందిన జగన్ ఉనికిని ప్రశ్నించే సాహసం మీకెక్కడిదని ఆయన నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలన్నింటిని తుంగలో తొక్కి రాజధాని పేరుతో రియల్‌ఎస్టేట్ వ్యాపారానికి విలువ ఇచ్చే మీరు, ఏ ముఖం పెట్టుకుని జగన్‌ను విమర్శిస్తారని ఆయన ప్రశ్నించారు.
దేశంలోనే గొప్ప పరిపాలన అందించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి, ఆయన పాలనలో 20 వేల మంది రైతులు చనిపోయినట్లు మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు విమర్శించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. మంత్రులు, తెలుగుదేశం నాయకులు జగన్‌పై చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే జగనంటే వారు ఎంత భయపడుతున్నారో అర్ధం అవుతుందన్నారు. మంత్రులు ఇప్పటికైనా పిచ్చి విమర్శలు మాని జగన్ మద్దతు తీసుకుని కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి పొందేందుకు పోరాటం చేయాలన్నారు.