విశాఖ జిల్లాలో.. బాక్సైట్‌ మైనింగ్‌ లీజు రద్దు | Bauxite Mining Lease Cancelled In Visakhapatnam District | Sakshi
Sakshi News home page

విశాఖ జిల్లాలో.. బాక్సైట్‌ మైనింగ్‌ లీజు రద్దు

Published Fri, Sep 20 2019 4:50 AM | Last Updated on Fri, Sep 20 2019 8:57 AM

Bauxite Mining Lease Cancelled In Visakhapatnam District - Sakshi

సాక్షి, అమరావతి : విశాఖ జిల్లాలో 3,030 ఎకరాల బాక్సైట్‌ మైనింగ్‌ లీజును రద్దుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సంతకం చేశారు. దీంతో బాక్సైట్‌ మైనింగ్‌ లీజు ఉత్తర్వులు శుక్రవారం జారీకానున్నాయి. తమ ప్రభుత్వం వస్తే బాక్సైట్‌ తవ్వకాలు జరపబోమని, గతంలో సర్కారు ఇచ్చిన మైనింగ్‌ లీజు రద్దుచేస్తామని విపక్ష నేత హోదాలో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పుడు బాక్సైట్‌ లీజు రద్దుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ‘సర్కారుకు ఆదాయం ఒక్కటే ముఖ్యం కాదు.. గిరిజనుల సెంటిమెంటును కూడా గౌరవించాల్సిందే. ప్రజల విశ్వాసాలకు, అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వంపై ఉంది. అందుకే బాక్సైట్‌ మైనింగ్‌ లీజు రద్దుచేస్తున్నాం’.. అని వైఎస్‌ జగన్‌ ఈ ఫైలుపై సంతకం చేసిన సందర్భంగా పేర్కొన్నారు. కాగా, ఈ నిర్ణయంతో సీఎం మాట తప్పని, మడమ తిప్పని నేతగా నిరూపించుకున్నారని ఒక ఉన్నతాధికారి ‘సాక్షి’తో అన్నారు. 

మాట మార్చిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి విశాఖ జిల్లా చింతపల్లి, జెర్రిల్లా అటవీ బ్లాకుల్లో 3030 (1212 హెక్టార్లలో) ఎకరాల బాక్సైట్‌ నిక్షేపాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం కేటాయించింది. బాక్సైట్‌ తవ్వకాలు జరపొద్దని గిరిజనులు డిమాండు చేయడంతో అప్పట్లో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు.. తాము అధికారంలోకి వస్తే వీటి లీజులు రద్దుచేస్తామని ప్రకటించడమే కాక.. అక్కడ బాక్సైట్‌ వ్యతిరేక ఆందోళనలో సైతం పాల్గొన్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట గాలికొదిలేశారు. బాక్సైట్‌ తవ్వకాలతోనే గిరిజనుల ప్రగతి సాధ్యమంటూ మాట మార్చారు. బాక్సైట్‌ తవ్వకాలకు అటవీ, పర్యావరణ తుదిదశ అనుమతులను ఆఘమేఘాలపై కేంద్రాన్ని ఒప్పించి తెచ్చుకున్నారు.

అనంతరం.. రాత్రికి రాత్రే బాబు సర్కారు 2015 నవంబరు 5న విశాఖ జిల్లాలోని చింతపల్లి, జెర్రిల్లా అటవీ ప్రాంతంలో 3030 ఎకరాల్లో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతిస్తూ జీవో నంబరు 97 జారీచేసింది. దీనిని నిరసిస్తూ అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గిరిజనులతో ఆందోళన చేపట్టింది. దీంతో.. తమకు తెలియకుండానే జీవో జారీచేశారంటూ చంద్రబాబు అధికారులపై నెపం నెట్టే ప్రయత్నం చేశారు. పర్యావరణ అనుమతి ఇవ్వాలంటూ టీడీపీ సర్కారు కేంద్రానికి నాలుగుసార్లు లేఖలు రాసిన విషయాన్ని ‘సాక్షి’ ఆధారాలతో బట్టబయలు చేయడంతో నాలుక కరుచుకున్న చంద్రబాబు.. ఇక సమాధానం చెప్పలేక ఈ జీవోను అబయెన్సులో పెడతామని ప్రకటించి చేతులు దులుపుకున్నారు. 



చెప్పిన మాటకు కట్టుబడి..
ఈ నేపథ్యంలో.. అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌.. చెప్పిన మాటకు కట్టుబడి అధికారుల నుంచి అందుకు సంబంధించిన ఫైలు ఇటీవల తెప్పించుకున్నారు. బాక్సైట్‌ మైనింగ్‌ లీజును రద్దుచేయాలని సంతకం చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) పేరుతో ఉన్న 3030 ఎకరాల మైనింగ్‌ లీజు రద్దుచేస్తూ భూగర్భ గనుల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేయనుంది. కాగా, బాక్సైట్‌ అనేది మేజర్‌ మినరల్‌ అయినందున మైనింగ్‌ లీజు జారీచేసే, రద్దుచేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే రాష్ట్ర ప్రభుత్వాలు లీజులు ఇవ్వడం లేదా రద్దుచేయడం లాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మైనింగ్‌ లీజు గడువు ముగిస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే రద్దుచేయవచ్చు. కానీ, లీజు గడువు ముగియక ముందే రద్దుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున ఈ విషయాన్ని వివరిస్తూ అందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా కోరనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement