బీసీ హాస్టల్‌లో కలకలం | BC caused a sensation in the hostel | Sakshi
Sakshi News home page

బీసీ హాస్టల్‌లో కలకలం

Published Tue, Jul 7 2015 1:09 AM | Last Updated on Fri, Oct 5 2018 6:48 PM

బీసీ హాస్టల్‌లో కలకలం - Sakshi

బీసీ హాస్టల్‌లో కలకలం

కలుషితాహారం తిని 27 మంది విద్యార్థినులకు అస్వస్థత
గూడూరు పీహెచ్‌సీలో అత్యవసర వైద్యసేవలు
నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్ సస్పెన్షన్
కోలుకుంటున్న విద్యార్థినులు
 

గూడూరు : గూడూరులోని బీసీ బాలికల వసతి గృహంలో కలుషితాహారం తిన్న కారణంగా 27 మంది విద్యార్థినులు అస్వస్ధతకు గురయ్యారు.  వివరాలిలా ఉన్నాయి.. సోమవారం ఉదయం  9.30 కు హాస్టల్‌లో అల్పాహారం తీసుకున్న విద్యార్థినులు పాఠశాలలకు వెళ్లారు. 10.15 సమయంలో పలువురు విద్యార్థినులకు కడుపునొప్పిగా ఉందని, కాళ్లు, చేతులు లాగుతున్నాయని, వికారంగా ఉందని చెప్పడంతో పాఠశాల హెచ్‌ఎం లక్ష్మీనాంచారమ్మ, గ్రామసర్పంచి ఈశ్వరరావు (నాని) కలిసి గూడూరు పీహెచ్‌సీకి వారిని తరలించారు. హాస్టల్‌లో 87 మంది విద్యార్థినులు ఉండగా వీరిలో 27 మంది అస్వస్థతకు గురయ్యారు. వైద్యాధికారి పి శేషుకుమార్ నేతృత్వంలో గైనకాలజిస్టు జ్ఞానరత్నం, పీహెచ్‌ఎన్ వెంకటేశ్వరమ్మ, ఎంపీహెచ్‌వోలు రాజకుమార్,  వైద్యసిబ్బంది సత్వర వైద్యసేవలు అందించటంతో పెనుప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న తహశీల్దార్ బి.ఎల్.ఎన్. రాజకుమారి, ఎంపీడీవో పద్మ, ఎంఈవో వెన్నా వెంకటసుబ్బయ్య, ఎంపీపీ కాసగాని శ్రీనివాసరావు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
 
కలుషిత ఆహారం వల్లే అస్వస్థత

 కలుషిత ఆహారం వల్లే విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు వైద్యాధికారి ప్రాథమిక నివేదికలో తేలింది. అందిన సమాచారం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం ఎగ్ బిర్యాని, సాయం త్రం తోటకూర పప్పు, సాంబారు, గుడ్డులను మెనూ కింద విద్యార్థినులకు వడ్డించారు. అర్థరాత్రి వేళ ఇద్దరు స్వల్ప అస్వస్థతకు గురికాగా  ట్యాబ్లెట్లు వేయించారు. సోమవారం ఉదయం అల్పాహారం కింద ఉప్మా పెట్టగా అందరూ తిన్నారు. అయితే కొద్ది సేపటికే 27 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికావడం గమనార్హం. కాగా విద్యార్థుల తల్లిదండ్రులు తెచ్చిన ఆహార పదార్థాలు తినడం వల్లే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని వార్డెన్ నాగలక్ష్మి, వంటమనిషి వాదించారు. గుల్లమోదకు చెందిన విద్యార్థినుల తల్లిదండ్రులు ఆదివారం తమ పిల్లలను చూసేందుకు వస్తూ  కోడి, రొయ్యకూరలను తీసుకువచ్చారని, దాన్ని తినటం వల్లే అస్వస్థతకు గురయ్యారని వార్డెన్ వాదించడంపై తహశీల్దార్, ఎంపీడీవోలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
వార్డెన్ సస్పెన్షన్

 విద్యార్థుల పర్యవేక్షణలో నిర్లక్ష్య వైఖరి అవలంభించిన కారణంగా వార్డెన్ నాగలక్ష్మి, నైట్‌వాచ్‌మెన్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ జేడీ మధుసూదనరావు తెలిపారు. ఫుడ్ శాంపిల్స్‌ను కూడా సేకరించాలని ఆదేశించామన్నారు.
 
కోలుకున్న విద్యార్థినులు
 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్యాధికారులు సేవలందించటంతో  బాధిత విద్యార్థినులు కోలుకుంటున్నారు. అస్వస్థతకు గురైన వారిలో పి.లీలావతి, పి. రమ్య, ప్రత్యూష, కావ్య, నాగమణి, రేవతి, యామిని, రామానుజమ్మ, ఆశ, నందిని, శ్రీలక్ష్మి, ప్రతిష్ట, ముక్తేశ్వరి, రూపావతి, ఆదిలక్ష్మితో పాటు మరో 12 మంది ఉన్నారు.
 
సమగ్ర విచారణకు ఆదేశం మంత్రులు దేవినేని, కొల్లు

 గూడూరు : బీసీ బాలికల హాస్టల్‌లో 27 మంది విద్యార్థినుల అస్వస్థతకు గల కారణాలపై సమగ్ర విచారణ చేయించి దోషులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బీసీ సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సోమవారం గూడూరు పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను మంత్రులు వేర్వేరుగా పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వైద్యం అందుతున్న విధానంపై ఆరా తీశారు.  అనంతరం విలేకరులతో మంత్రి కొల్లు మాట్లాడుతూ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నామన్నారు. వార్డెన్ నాగలక్ష్మిని పిలిచి విధుల పట్ల అలసత్వంపై మందలించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కొనకళ్ల జగన్నాధం (బుల్లయ్య), సర్పంచి పెదపూడి ఈశ్వరరావు, మండల ప్రత్యేకాధికారి శరత్‌బాబు, వైద్యాధికారి ప్రసాదరావు, శేషుకుమార్‌లు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement