శనివారం బీసీ సామాజిక వర్గాల ప్రతినిధులు, మంత్రులతో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: బీసీల్లో ప్రతి కులానికీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా వారి సంక్షేమానికి భరోసా కల్పించాలని వైఎస్సార్ సీపీ బీసీ అధ్యయన కమిటీ సభ్యులు, బీసీ సామాజిక వర్గాల ప్రతినిధులు, మంత్రులు ప్రతిపాదించారు. బీసీలకు కొత్త కార్పొరేషన్ల ఏర్పాటులో జాప్యం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించిన అనంతరం వారంతా శనివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అధ్యయన కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. బీసీల్లో జనాభాను అనుసరించి మూడు కేటగిరీలుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావిస్తున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.
పది వేల జనాభాకు కార్పొరేషన్!
బీసీల్లో సుమారు పది వేల జనాభా ఉన్న కులాలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అంతకంటే తక్కువ జనాభా ఉన్న బీసీ కులాలను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి కార్పొరేషన్ నియమిస్తే బాగుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. బీసీ వర్గాల అభ్యున్నతి కోసం ఈ కార్పొరేషన్ల ద్వారా విస్తృతంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ‘బీసీల్లో 2,000 లోపు జనాభా ఉన్న కులాలు 81 వరకు ఉన్నాయి. జనాభా 500కి మించని బీసీ కులాలు కూడా ఉన్నందున మరీ తక్కువ జనాభా ఉన్న వారికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుతో అనుకున్న ప్రయోజనం నెరవేరదు.
కార్పొరేషన్ ప్రభుత్వానికి భారంగా మారే అవకాశం ఉంది’ అని సమావేశంలో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. పది వేల లోపు జనాభా ఉన్న సంచార జాతులు, గుర్తింపునకు నోచుకోని వర్గాలకు సరైన ప్రాతినిథ్యం కల్పించి సమాజంలో నిలదొక్కుకునేలా ప్రభుత్వ పరంగా చేయూతనివ్వటం కూడా చర్చకు వచ్చింది. బీసీ వర్గాలకు గృహ æనిర్మాణం, పెన్షన్లు, రేషన్ కార్డులతోపాటు కుల వృత్తులు చేపట్టేందుకు వీలుగా ఆర్థిక వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు. బీసీలకు నామినేటెడ్ పనులు, పదవుల్లో సగం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే చట్టం చేసిన విషయం తెలిసిందే.
త్వరలో విస్తృత సమావేశం
బీసీల్లో అన్ని వర్గాల వారితో త్వరలోనే విస్తృత సమావేశం నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, బీసీ సామాజిక వర్గాల ప్రతినిధులు దీనికి హాజరు కానున్నారు. బీసీల అభ్యున్నతి కోసం తీసుకోవాల్సిన ఇతర చర్యలపై సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. సమావేశంలో మంత్రులు బొత్స సత్యన్నారాయణ, మోపిదేవి వెంకటరమణ, అనిల్‌కుమార్, ధర్మాన కృష్ణదాస్, శంకర నారాయణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, బీసీ వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు.
సీఎం హామీ మేరకు కార్యాచరణ మొదలైంది: ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి
బీసీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. పాదయాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు కార్యాచరణ ప్రారంభమైందని తెలిపారు. బీసీల సంక్షేమానికి సీఎం కట్టుబడి ఉన్నారని చెప్పారు. బీసీల అభ్యున్నతి కోసం 136 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయని, సాధ్యాసాధ్యాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. బీసీ కార్పొరేషన్లకు సంబంధించి త్వరలోనే మరోసారి విస్తృత సమావేశం జరుగుతుందని తెలిపారు.
ప్రతిపాదనలు ఇవీ
- బీసీల్లో 10,000 – 1,00,000 జనాభా ఉన్న కులాలను ఒక కేటగిరీగా పరిగణించాలి.
- లక్ష నుంచి 10 లక్షల వరకు జనాభా ఉన్న బీసీ వర్గాలను రెండో కేటగిరీగా గుర్తించాలి.
- 10 లక్షలు, ఆపైన జనాభా ఉన్న బీసీ వర్గాలను మూడో కేటగిరీగా విభజించి కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment