‘వికారి’లో సంక్షేమ షికారు | BC Declaration Is Move On The Vikari Year | Sakshi
Sakshi News home page

‘వికారి’లో సంక్షేమ షికారు

Published Sat, Apr 6 2019 3:13 PM | Last Updated on Sat, Apr 6 2019 3:13 PM

BC Declaration Is Move On The Vikari Year - Sakshi

సాక్షి నెట్‌వర్క్, శ్రీకాకుళం: వికారిలో సంక్షేమం షికారు చేయనుంది. వైఎస్‌ జగన్‌ బీసీ డిక్లరేషన్‌తో నూతన ఏడాదిలో అంతా మంచే జరుగుతుందని బడుగులు ఆశ పడుతున్నారు. ఆర్థికంగా చేయూతనిస్తూ, గౌరవాన్ని పెంచుతూ, హోదాను మరో ఎత్తుకు తీసుకెళ్తూ జగన్‌ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌పై అన్ని వర్గాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు పెడతామని చెప్పడంతో పాటు, నామినేటెడ్‌ పోస్టుల్లో తగు ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పడం, దేవాలయాల్లోని బోర్డుల్లో ఇప్పటివరకు చోటు లేని వారికి సముచిత స్థానమిస్తామని చెప్పడం వంటివి సామాన్యులకు చేరువయ్యాయి. నూతన ఏడాదిలో మంచి జరగాలంటే ఈ డిక్లరేషన్‌ కచ్చితంగా అమలు జరిగి తీరాలని సిక్కోలు వాసులు కోరుతున్నారు.

ఎనభై నాలుగు శాతం మందికి ప్రయోజనం
జిల్లాలో బీసీల కులాల వారు 84 శాతం మంది ఉన్నారు. ప్రస్తుత జనాభాలో బీసీలు దాదాపు పాతిక లక్షల మందికిపైనే ఉన్నారు. బీసీ కులాల్లో ఎక్కువగా తూర్పుకాపు, కళింగ, వెలమ కులస్తులు ఉన్నారు. తర్వాత మత్స్యకార, యాదవ కులస్తులు ఉన్నారు. జిల్లాను దశాబ్ధాలుగా టీడీపీ ఏలుతోంది. కానీ ఈ కులాలను ఓట్లు వేయించుకోవడానికి తప్ప ఇంకెందులోనూ పట్టించుకోలేదు. అన్ని కులాలకు ఎదిగే అవకాశం ఉన్నా, ఆ దిశగా ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బీసీ డిక్లరేషన్‌తో అన్ని కులాల్లో ఉన్న వారికి ప్రాణమొచ్చింది. తమకోసం ఓ నాయకుడు పని చేస్తున్నాడనే ధైర్యమిచ్చింది. బీసీ సబ్‌ప్లాన్‌ అమలైతే ఇక ఏ కులంలోనూ వెనుకబాటు అన్నదే ఉండదు.

ఎప్పుడూ ఓటు బ్యాంకుగానేనా..?
చంద్రబాబు బీసీలను ఎప్పుడూ ఓటు బ్యాంకుగానే చూశారన్నది జగమెరిగిన సత్యం. అందుకు సిక్కోలు జిల్లా కూడా ఓ సాక్ష్యం. ఎన్నికలు వస్తున్నాయంటే గానీ బాబుకు కులాల సంక్షేమం గుర్తురాదు. బీసీలకు శాశ్వత ప్రయోజనం కలిగించే ఏ ఒక్క పనినీ ఆయన చేయలేదన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. గడిచిన ఎన్నికల్లో బీసీ ఓట్లకు గాలం వేసేందుకు వందలాదిగా హామీలు కురిపించారు. అధికారం దక్కాక మాటలన్నీ మర్చిపోయారు. అవి గుర్తు చేసినందుకే మత్స్యకారులపై ఆగ్రహోదగ్రులయ్యారు. ఇచ్చిన హామీ నెరవేర్చకుండా, ఆ హామీని గుర్తు చేసినందుకే చంద్రబాబు తిట్టిన విషయాన్ని మత్స్యకారులెవ్వరూ అంత తొందరగా మర్చిపోలేరు.

మభ్య పెట్టడమే పని..
జనాలు చూస్తున్నట్లు ఓ పని మొదలుపెట్టడం, జనం కనిపెట్టడం లేదని తెలిసి ఆ పనిని ఆపెయ్యడం. ఇదీ టీడీపీ తీరు. జనాలు సైతం మభ్యపడేంతలా ఆయన ప్రచార తీరు ఉంటుంది. బీసీ సబ్‌ప్లాన్‌ విషయంలోనూ ఆయన చేసినది ఇదే. రాష్ట్ర బడ్జెట్‌లో 25 శాతం బీసీలకు కేటాయిస్తామని ఎప్పుడో హామీనిచ్చారు. కేంద్ర నిధుల్లోనూ పాతిక శాతం బీసీ సంక్షేమానికి వినియోగిస్తామని చెప్పారు. కానీ ఆ హామీలు నిలబెట్టుకోలేదు. జిల్లాలో ఎంతో మంది చేతివృత్తులు, కుల వృత్తుల వారు ఉన్నారు. నాలు గేళ్ల కాలంలో వారి సాధకబాధకాలు పట్టించుకోని చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్నాయనగా.. ఆదరణ పేరుతో మళ్లీ దగా చేసేందుకు సిద్ధపడ్డారు. నాలుగేళ్ల నిర్లక్ష్యాన్ని మర్చిపోయేందుకు తాయిలాలు ఇచ్చినట్లు పరికరాలు అందించారు. అందులోనూ జన్మభూమి కమిటీ సభ్యులు అక్రమాలకు పాల్పడ్డారు.

బీసీలకు ఎనలేని మేలు..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఏటా రూ.15వేల కోట్ల వంతున ఐదేళ్లకు రూ.75 వేల కోట్లు ఇస్తామని జగన్‌ ప్రకటించారు. బీసీ సబ్‌ప్లాన్‌కు తొలి శాసనసభలోనే చట్టభద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రకారం మన జిల్లాకు ఏటా వెయ్యికోట్ల నుంచి రూ.1500 కోట్ల వరకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ నిధులు గానీ వస్తే జిల్లాలో సామాన్యుల బతుకులన్నీ బాగుపడతాయి. అర్హత ఉంటే చాలు ఎలాంటి వివక్ష చూపకుండా రుణం అందుతుంది. నిధులు ఆ మేరకు ఉంటే బీసీ ప్రాంతాల రూపురేఖలే మారిపోతాయి.

జనానికి ప్రయోజనమిది..

♦ చిరువ్యాపారులకు వడ్డీ లేకుండా రూ.10 వేల వరకు రుణం.
♦ నాయీ బ్రాహ్మణులకు షాపునకు ఏటా రూ.10 వేల సాయం. ప్రధాన ఆలయాల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం. బోర్డు మెంబర్లలో వారికి చోటు.
♦ సంచార జాతుల వారికి స్థిర నివాసం
♦ మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ.10వేలు భృతి. ప్రమాదానికి గురై చనిపోతే రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా. కొత్త బోట్లకు రిజిస్ట్రేషన్‌. డీజిల్‌ సబ్సిడీ.
♦ యాదవులకు గొర్రెలు, మేకలు చనిపోతే రూ.6వేలు నష్ట పరిహారం. తిరుమల ఆలయాన్ని తెరిచే హక్కు సన్నిధి గొల్లలకే ఇచ్చి, వంశపారంపర్య హక్కులు కల్పించడం.
♦ ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో సగం పనులు బీసీలకే. నామినేటెడ్‌ పదవుల్లోనూ వాటా.
♦ అన్ని కులాలకు కార్పొరేషన్లు.
♦ 45–60 ఏళ్ల మధ్య వయసు గల మహిళలకు రూ.75వేల సాయం.
♦ మూడో వంతు నిధులు బీసీల అభివృద్ధికే.
♦ వైఎస్సార్‌ బీమా సాయం రూ.7లక్షలు   

యాదవుల కష్టాల తీరుతాయి
వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తే యాదవుల సంక్షేమానికి పాటుపడతామని జగన్‌ ప్రకటించారు. యాదవులు అన్నివిధాలా ఇబ్బందులు పడుతున్నారు. వ్యాధులు, ప్రమాదాలు వల్ల గొర్రెలు, మేకలు చనిపోతే ఒక దానికి రూ.5 వేలు, ప్రమాదవశాత్తు యాదవులు చనిపోతే రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని జగన్‌ ప్రకటించడం సంతోషంగా ఉంది.
– పిన్నింటి సింహాద్రి, యాదవ కులస్తుడు, మురపాక గ్రామం, లావేరు మండలం.

జగన్‌ ప్రకటన చాలా బాగుంది
జగనన్న సీఎం అయితే యాదవ కుటుంబా లకు బీసీ కార్పొరేషన్‌ ద్వారా రాయితీపై రుణాలు, అర్హులైన వారికి పార్టీలతో సంబం ధం లేకుండా పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. ప్రస్తుతం యాదవులు వృత్తి గిట్టుబా టు కాక ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. యాదవుల కోసం జగన్‌ చేసిన ప్రకటన చాలా బాగుంది.
 – కోరాడ వల్లప్పడు, యాదవ కులస్తుడు, తామాడ గ్రామం, లావేరు మండలం

మేలు జరుగుతుంది
ప్రకృతి వైపరీత్యాల వల్ల పశువులు చనిపో యి యాదవ కుటుంబాలు ఎక్కువగా నష్టపోతున్నాయి. వారిని ఎవరూ ఆదుకోవడం లేదు. జగన్‌ మాత్రమే మా గురించి ఆలోచించారు. జగన్‌ వల్ల యాదవులకు మేలు జరుగుతుందని భావిస్తున్నాం.
– పి.బాలకృష్ణ, యాదవ సంఘం నాయకుడు, ఎనభై నాలుగు శాతం మందికి ప్రయోజనం

బీసీ డిక్లరేషన్‌తో ఉపాధి
వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌తో ఉద్యోగ అవకాశాలు పెరిగి యువతకు ఉపాధి దొరుకుతుం ది. అలాగే రుణాలు కూడా సులువుగా పొందవచ్చు. చట్టసభల్లో బీసీలకు సముచిత స్థానం దొరుకుతుంది. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న జగన్‌కు ఓ అవకాశం ఇవ్వాలి.
- కలిపిల్లి సింహాచలం, వీరఘట్టం

మంగళసూత్రాల నిర్ణయం హర్షణీయం 
విశ్వబ్రాహ్మణులకు ఎమ్మెల్సీ సీటు కేటా యిస్తామనడం, ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం, తిరుపతి తిరుమల దేవస్థానానికి మంగళసూత్రాలు విశ్వబ్రాహ్మణులు చేసేలా చట్టం తీసుకువస్తాననడం సంతోషం. ఇవి అమలైతే చాలా బాగుంటుంది.
– దేవరకొండ షణ్ముఖాచారి, పలాస నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, పలాస మండలం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement