ఎన్నాళ్లీ ‘వెనుకబాటు’? | BC unemployment Applications Credit Distribution | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ ‘వెనుకబాటు’?

Published Mon, Mar 30 2015 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 11:33 PM

BC unemployment Applications Credit Distribution

విజయనగరం కంటోన్మెంట్: బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరవుతాయని, ఉద్యోగం దొరక్కపోయినా ఏదో చిన్న ఉపాధి చూసుకుని జీవితంలో స్థిర పడదామని  ఆశ పడుతున్న నిరుద్యోగుల ఆశలు ఏ ఏడాదికాఏడాది  అడుగంటుతూనే ఉన్నాయి. రుణాలు మంజూరవుతాయని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యం వారి పాలిట శాపంగా మారుతోంది. రుణాల మంజూరుకు నిధులు రాక పోవడం ఒక కారణమైతే, దీనికి సంబంధించిన దరఖాస్తులను మండలాల నుంచి పంపించకపోవడం మరో శాపంగా పరిణమించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలు, ఫెడరేషన్లు, నిరుద్యోగుల స్వయం సమృద్ధికి కేటాయించిన రుణాలు విడుదల కావడం లేదు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు 9393 యూనిట్లు మంజూరయ్యాయి.
 
 ఈ యూనిట్లకు సుమారు రూ.25.70కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో పాటు బ్యాంకు లింకేజీగా మరో రూ.25.70కోట్లు  కేటాయించారు. ఈ మొత్తం రూ.50కోట్లతో బీసీ స్వయం సంఘాలు, వ్యక్తిగత రుణాలతో ఉపాధి మార్గాలకు అవకాశముంటుందని భావించారు. కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచిందన్న చందాన అటు నిధులు విడుదల కాక ముందే ఆర్థిక సంవత్సరం ముగుస్తుంటే..మరో పక్క మండలాల్లోని జన్మభూమి కమిటీలు తమ వారికి దరఖాస్తులు ఇవ్వలేదని అట్టేపెట్టుకున్నాయి. దీనికి సంబంధించి జనవరి 18 గడువు తేదీగా నిర్ణయించినప్పటికీ ఇప్పటివరకూ కేవలం 1200 దరఖాస్తులు మాత్రమే కొన్ని మండలాలనుంచి వచ్చాయి. 9393 యూనిట్లకు సుమారు 20వేల మంది దరఖాస్తు చేసుకోగా వీరంతా జన్మభూమి క మిటీ తమకు అనుమతులు ఇస్తుందనిఎదురు చూస్తున్నారు.
 
  కానీ  కమిటీ అనుమతులు ఇవ్వకుండా మండలాల్లోనే దరఖాస్తులను అట్టిపెట్టుకుంది. మార్చి నెల ముగుస్తుండడంతో వీటికి సంబంధించి కేటాయించిన నిధులు వెనక్కి వెళ్లిపోతాయనే అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే కేటాయించిన నిధులకు సంబంధించి యూనిట్లను మంజూరు చేస్తే గనుక నిధులు ఎప్పుడు విడుదలైనా యూనిట్లు  ఏర్పాటు చేసుకునే వెసులు బాటు ఉంది. కానీ ఈ విషయాన్ని మాత్రం జన్మభూమి కమిటీలు పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా పలు సంఘాలు నిధుల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ అటు ప్రభుత్వం కానీ, ఇటు ప్రజా ప్రతినిధులు కానీ పట్టించుకోక పోవడంతో దరఖాస్తు దారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.   
 
 గత ఏడాది రూ.3కోట్లు పెండింగ్
 జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చేందుకు గత ఏడాది మంజూరైన రూ.6.53 కోట్ల నిధులు ఇప్పటికీ విడుదల కాలేదు. ఈ నిధులకు సంబంధించి 900 మందికి రుణాలు మంజూరయ్యాయి.  గత ఏడాది రుణాలు మంజూరయి గ్రౌండింగ్ అయ్యే సమయంలో ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది.అప్పటినుంచి ఈ నిధులకు మోక్షం కలగలేదు. డబ్బులు, కాలం ఖర్చు చేసి అభ్యర్థులు పెట్టుకున్న దరఖాస్తులు బుట్టదాఖలయ్యాయి. అయితే ఈ నిధులకు సంబంధించి గతంలో మంజూరు  జరిగిపోవడంతో వీటికి సంబంధించిన నిధులు మరికొద్ది రోజుల్లో విడుదల చేసే అవకాశముందని అంటున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement