సాక్షి, కొత్తగూడెం: పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదించేవరకు అప్రమత్తంగా ఉండాలని, తెలంగాణ ప్రాంత డిమాండ్లను ఢిల్లీవరకు వినిపించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. రుద్రంపూర్ జేఏసీ ఆధ్వర్యంలో రూద్రంపూర్‌లో ఏర్పాటుచేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు, అమరవీరుల స్మారక స్థూపాన్ని కోదండరాం బుధవారం రాత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంజి ప్రాంగణంలో టీజేఏసీ కొత్తగూడెం మండల కన్వీనర్ గూడెల్లి యాకయ్య అధ్యక్షతన ఏర్పాటుచేసిన సభలో కోదండరాం ప్రసంగిస్తూ తెలంగాణలోని వనరులపై అధికారం ఇక్కడి ప్రభుత్వానికే ఉండాలన్నారు. 56 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు సమన్యాయం కోసం ఉద్యమిస్తున్నారన్నారు. ఇప్పుడు సమన్యాయం అంటున్నవాళ్లు అది ఎలా ఉంటుందో ఒక్కమాట చెప్పాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణను అడ్డుకునే కుట్రలను తిప్పికొడుతూ రాష్ట్రం అధికారికంగా ఏర్పాటయ్యేంతవరకు ఉద్యమం కొనసాగించాలని ఆయన అన్నారు. ఈ ప్రాంత ప్రజలంతా కడవరకు అప్రమత్తంగా ఉండాలన్నారు.
సింగరేణిపై తెలంగాణకే హక్కుండాలి
తెలంగాణ బిడ్డల ఆశాజ్యోతిగా ఉన్న సింగరేణి సంస్థపై పూర్తి హక్కులు తెలంగాణ ప్రభుత్వానికే
ఉండాలని సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు డిమాండ్ చేశారు. కేంద్రం పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తున్నామని ప్రకటించిందని, భద్రాచలం కూడా ఇందులో అంతర్భాగమని, బయ్యారంలో ఉక్కు కర్మాగారం నెలకొల్పాలని ఆయన అన్నారు. ఈ మూడు డిమాండ్లపై కేంద్ర మంత్రివర్గానికి టీఆర్‌ఎస్ నివేదించిందన్నారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటామన్నా ఆమోదిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఇప్పుడు మాట మార్చారని ఆయన విమర్శించారు. సమన్యాయమంటున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అసలు సమన్యాయం అంటే ఏమిటో చెప్పడంలేదని, ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని తేల్చారు. కాంగ్రెస్ జైత్రయాత్రలు చేయడం కాదని, జిల్లాలో ఉన్న మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డితోపాటు తెలంగాణ మంత్రులంతా సమైక్యవాదం విన్పిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డిపై దండయాత్ర చేయాలని ఆయన అన్నారు.
కొత్తగూడెం జిల్లా కేంద్రం చేయాలి..
ఎన్నో ఉద్యమాలకు వేదికైన రుద్రంపూర్ పోరాటాల పురిటిగడ్డ అని, సింగరేణి కార్మికుల శ్వేదం చిందిన గడ్డ తెలంగాణ ఉద్యమానికి జిల్లాలో బాసటగా నిలిచిందని ఈ సభలో ప్రసంగించిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణ ఏర్పాటైన వెంటనే జిల్లాలను అభివృద్ధి చేసుకునే దశలో.. కొత్త జిల్లాల ఏర్పాటులో కొత్తగూడెంకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్, కేసీఆర్, కోదండరాంల పాత్ర చిరస్థాయిగా లిఖించబడుతుందని కొనియాడారు. ఇప్పుడు తెలంగాణను తెస్తున్నది మేమే అని కాంగ్రెస్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఎందరో విద్యార్థులు, యువకుల బలిదానం పాత్ర, ప్రజలపాత్ర తెలంగాణ ఉద్యమంలో లేదా..? అని ఆయన ప్రశ్నించారు.
ఇది తెలియకుండానే కాంగ్రెస్ మేమే తెస్తున్నామని చెప్పుకోవడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. ఈ సభలో టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి వెంకటేశ్వరరావు, జిల్లా కన్వీనర్ దిండిగాల రాజేందర్, జిల్లా ఇన్‌చార్జి నూకల నరేష్‌రెడ్డి, టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, నియోజకవర్గ ఇన్‌చార్జి కంచర్ల చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర నాయకులు జె.వి.ఎస్.చౌదరి, హెచ్‌ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, సింగరేణి కొత్తగూడెం ఏరియా సీజీఎం మాదాసి మల్లేష్, జేఏసీ కో-కన్వీనర్ కత్తి రామస్వామి, నాయకులు జి.వి.కె.మనోహర్, తిరుమలరావు, డాక్టర్ శంకర్‌నాయక్, కనకరాజు, బీఎంఎస్ రాష్ర్ట కార్యదర్శి లట్టి జగన్‌మోహన్‌రావు, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు మల్లెల రామనాధం తదితరులు పాల్గొన్నారు.
డిమాండ్లు ఢిల్లీకి వినిపించాలి
Published Thu, Nov 7 2013 5:16 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement
Advertisement