తీరంలో అప్రమత్తం
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: జిల్లాలోని సముద్ర తీరంలో హై అలెర్ట్ ప్రకటించారు. తీరప్రాంతాల్లో మైరెన్ పోలీసులు నిఘా పెట్టి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 26న జరుగనున్న గణతంత్ర వేడుకల్లో తమ ఉనికిని చాటుకునేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్టు రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారి చేశాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం సముద్ర తీరంపై నిఘా పెడుతున్నట్టు మెరైన్ ఐజీ
ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 192 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సముద్ర తీరం వెంబడి మెరైన్ పోలీసులు పూర్తి నిఘా పెట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు, అనుమానితులు తారసపడితే వారిని అదుపులోకి తీసుకొని విచారించనున్నారు. సముద్రమార్గం గుండా బోట్లలో ఎవరైనా జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలున్నాయన్నది ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. ఇలా జిల్లాలోకి చేరుకుని ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో గమ్యస్థానాలకు చేరుకుని విధ్వంసానికి పాల్పడే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గస్తీని మరింత ముమ్మరం చేశారు.
తీర ప్రాంత గ్రామాల్లోని ప్రజలకు ఉగ్రవాదులు చోరబడే అవకాశాలున్న మార్గాలను వివరించి, ఎవరైనా అనుమానితులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని మెరైన్ పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు జిల్లా పోలీసు యంత్రంగం కూడ అప్రమత్తమైంది. ప్రధాన మార్గాల్లో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాలకు అనుకుని ఉన్న రోడ్డు మార్గాల పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఈ మేరకు సముద్రతీర ప్రాంతాల్లో ఉన్న పోలీసు స్టేషన్లకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది.