ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో జాగ్రత్త | be care ful to the process foods | Sakshi
Sakshi News home page

ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో జాగ్రత్త

Published Fri, Jun 19 2015 10:24 AM | Last Updated on Sun, Sep 3 2017 4:01 AM

ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో జాగ్రత్త

ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో జాగ్రత్త

మనలో చాలా మంది రోజూ బేకరీలు, సూపర్ మార్కెట్లు, కిరాణా కొట్లలో సులభంగా లభించే ప్రాసెస్డ్ ఫుడ్‌ని ఇష్టపడతాం. ముఖ్యంగా బిస్కెట్లు, చిప్స్, కేకులు, చాక్లెట్లు, పేస్ట్రీలు, పాప్‌కార్న్, పిజ్జా, బర్గర్లు, పఫ్స్, శాండ్‌విచ్‌లాంటివి ఎక్కువగా తీసుకుంటుంటాం. ఇవి శరీరానికి చాలా హానికరం. ఎందుకంటే వీటిలో పరిమితికి మించి అసంతృప్త కొవ్వు పదార్థాలుంటాయి. వీటికి దూరంగా ఉండాలని నిపుణులు ఎంతగా హెచ్చరిస్తున్నా లెక్కచేయం. వినియోగదారులు వాటిని వదలలేక పోయినా ప్రభుత్వాలైనా చొరవ చూపాలి. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న ఇలాంటి ఆహార పదార్థాలపై ప్రభుత్వం నియంత్రణ విధించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ విషయంలో అమెరికా చాలా ముందుంది. 2018లోగా తమ దేశంలో తయారయ్యే ఆహారోత్పత్తుల్లో అసంతృప్త కొవ్వు శాతాన్ని తగ్గించాలని తయారీదారులను అక్కడి ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈ కొవ్వు ఉండే ఆహార పదార్థాలు, వాటి తయారీ, వీటిని తీసుకోవడం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలేంటో తెలుసు కుందాం.
 
అసంతృప్త కొవ్వు అంటే..
రసాయనికంగా కొవ్వుల్లో మూడు రకాల ఫ్యాటీ ఆమ్లాలుంటాయి. మూడు కర్బన అణువులు ఇక గ్లిసరిన్ కలవడం వల్ల అసంతృప్త కొవ్వులు ఏర్పడతాయి. ఇవి శరీరంపై త్వరగా ప్రభావం చూపిస్తాయి. వీటిని అనేక ఆహార ఉత్పత్తుల తయారీలో వాడతారు. ఇతర నూనె పదార్థాలతో పోల్చితే ఇవి చాలా తక్కువ ధరలోనే లభిస్తాయి. ఈ కొవ్వు పదార్థాలతో ఆహార పదార్థాలను తయారు చేయడం చాలా సులభం. పైగా వీటితో తయారైన ఆహారం ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అలాగే మంచి రుచిని కూడా కలిగి స్తాయి. పైగా వీటిని ఎక్కువ సార్లు వినియోగించే వీలుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్యాకేజ్డ్ ఫుడ్ తయారీదారులు ఇతర నూనెలకు బదులుగా వీటిని వాడతారు.

ఏయే పదార్థాలు తయారు చేస్తారు
వీటితో ఆహారాన్ని తయారు చేయడానికి తక్కువ సమయం పడుతుంది. చిప్స్, పాప్‌కార్న్, బిస్కెట్లు, చాక్లెట్లు, పిజ్జాలు, బర్గర్స్, డోనట్స్, పఫ్స్, ఫ్రెంచ్‌ఫ్రైస్, గార్లిక్ బ్రెడ్, ఆనియన్ రింగ్స్, ఐస్‌క్రీమ్స్‌సహా అనేక ఆహార పదార్థాల్లో ఈ కొవ్వు నూనెలను వాడతారు.

స్థూలకాయానికి కారణం..
ఈ కొవ్వులతో తయారైన ఆహార పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. ఈ ఆహార పదార్థాల్లో సోడియం, లవణాలు, చక్కెరలు మోతాదుకు మించి ఉంటాయి. ఈ పదార్థాల్ని అధికంగా తీసుకుంటే టైప్-2 మధుమేహం, గుండె జబ్బులు, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. శరీరంలో కొవ్వులు పెరిగిపోయి స్థూల కాయం బారిన పడే వీలుంది. వీటిలో కేలరీలు అధికంగా ఉండడం వల్ల కూడా హాని కలుగుతుంది. ఇతర ఆరోగ్య సమస్యలు  కూడా తలెత్తుతాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండండి. అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంట్లో తయారయ్యే ఆహారం కన్నా బయటి పదార్థాలే ఎక్కువ తీసుకుంటుంటారు. అమెరికాలో గుండె జబ్బులకు కారణమయ్యే పదార్థాల్లో వీటిదే అగ్రస్థానం. అందువల్లే ప్రజల ఆరోగ్యం కోసం ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది.

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement