ఐక్యంగా సాగుదాం.. అన్ని సీట్లూ గెలుద్దాం
సాక్షి, రంగారెడ్డి జిల్లా:
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందనుకోలేదు.. ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందడం ఇప్పటికీ కలగానే ఉంది. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను సాఫీగా పూర్తి చేసినందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించి ఆమెకు బహుమతిగా ఇద్దాం.’ అని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం గాంధీభవన్‌లో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ అధ్యక్షతన జరిగిన జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిం చారు. తెలంగాణ బిల్లును పార్లమెంటు ఉభయసభల్లో ప్రవేశపెట్టినప్పుడు అన్ని పార్టీలు నాటకాలాడాయని, కాంగ్రెస్ ధృడసంకల్పంతో ముందుకు సాగిందన్నారు. పార్టీలో అన్నివిధాలా పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీతోనే మహిళలకు, మైనార్టీలకు ప్రత్యేక స్థానం దక్కిందన్నారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ మాట్లాడుతూ.. సీమాంధ్రలో కొందరు నేతలు పదవులు అనుభవించి పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు వదిలి వెళ్లిపోవడం సరికాదన్నారు. నేతలు, కార్యకర్తలంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలని సూచించారు. పార్టీ ఎవరి సొంతం కాదని, వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని అన్నారు. డీసీసీ సమావేశాలకు గైర్హాజరయ్యే కొందరు నేతలు.. సొంత ప్రాంతంలో తామే బలవంతులమని చెప్పుకుంటున్నారంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పార్టీ సమావేశాలకు హాజరుకాని మండల బాధ్యులపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. దేశంలో మతోన్మాద శక్తులు రాజ్యమేలేందుకు కుట్ర పన్నుతున్నాయని, ప్రజల్లో ఈ అంశాన్ని వివరించి వాటికి అడ్డుకట్ట వేయాలని పిలుపుని చ్చారు. సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు నాగయ్య, కార్యదర్శులు టీ.రామ్మోహన్‌రెడ్డి, ఆదిత్యరెడ్డి, పార్టీ నేతలు కాలె యాద య్య, రమేష్, కార్తీక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డుమ్మా ఎందుకు?
విస్తృతస్థాయి సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. మంత్రి ప్రసాద్‌తోపాటు కె.లకా్ష్మరెడ్డి, ఆకుల రాజేందర్ మినహా మిగతా ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం చర్చనీ యాంశమైంది. తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో అధినేత్రికి కృతజ్ఞతలు చెప్పేందుకే మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు దూరంగా ఉండడంపై కార్యకర్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.