ఎలుగుబంటిని తరిమికొడుతున్న గ్రామస్తులు
సాక్షి, బద్వేలు(కడప) : బద్వేలు సమీపంలో ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. జనావాసాల్లోకి ప్రవేశించిన ఎలుగుబంటి ఎటువెళ్లాలో తెలియక పొలాల వెంట పరుగులు తీస్తూ జనాన్ని భయబ్రాంతులకు గురి చేసింది. విషయం తెలుసుకున్న అటవీ సిబ్బంది ఎలుగుబంటిని అడవిలోకి పంపించేందుకు 7 గంటల పాటు శ్రమించారు. ఒకానొక దశలో జనం పై దాడికి యత్నించడంతో ఓ విలేకరికి గాయాలయ్యాయి. చివరకు అటవీ సిబ్బంది వల్లెరవారిపల్లెబీట్‌లోని అటవీ ప్రాంతంలోకి ఎలుగుబంటిని తరిమి వేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
సోమవారం బద్వేలు సమీపంలోని బయనపల్లెలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే ... మండల పరిధిలోని చింతలచెరువు పంచాయతీలో గల శ్రీనివాసపురం గ్రామ సమీపంలోకి సోమవారం తెల్లవారుజామున ఎలుగుబంటి ప్రవేశించినట్లు గుర్తించిన గ్రామస్తులు అక్కడి నుంచి తరిమివేశారు. అనంతరం అక్కడి నుంచి బయనపల్లె ఎస్సీకాలనీ సమీపంలోని ముళ్లపొదల్లో దాగి ఉండగా గ్రామస్తులు గుర్తించి అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఎఫ్‌ఆర్‌ఓ సుభాష్, సిబ్బంది ఎలుగుబంటిని అటవీ ప్రాంతంలోకి పంపేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.
పొలాల్లో సంచరిస్తున్న ఎలుగుబంటి
ఈ సమయంలో ముళ్లపొదల్లో దాక్కుని ఉన్న ఎలుగుబంటి జనం పై దాడికి యత్నించింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న ఓ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరికి గాయాలయ్యాయి. ప్రజలు, అటవీ సిబ్బంది ఎలుగుబంటిని అటవీ ప్రాంతంలోకి పంపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయగా అక్కడి నుంచి చింతలచెరువు, గొడుగునూరు గ్రామాల మీదుగా కమలకూరు సమీపంలోని వల్లెరవారిపల్లెబీట్ అటవీ ప్రాంతంలోకి వెళ్లడంతో అటవీ అధికారులు, సంబంధిత గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పరిస్థితి పై ప్రొద్దుటూరు డీఎఫ్‌ఓ గురుప్రభాకర్ ఆరా తీసీ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment