'ఆది' నుంచి లక్కీనే
సాక్షి ప్రతినిధి, కడప: ఒకటికాదు.. రెండు కాదు.. మూడు సార్లు.. ఆ ఎమ్మెల్యే సమక్షంలో అధికారులు లాటరీ తీశారు. మూడు చోట్ల వైఎస్సార్‌సీపీకే విజయం దక్కింది. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆ ఎమ్మెల్యేది లక్కీహ్యాండ్‌గా పేర్కొంటున్నారు. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హాట్రిక్ సాధించిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి..
జిల్లాలోని ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో 18 కౌన్సిలర్ స్థానాలను వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. టీడీపీకి కేవలం రెండు స్థానాలే దక్కాయి. అనూహ్యంగా 8 మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు టీడీపీ ప్రలోభాలకు లొంగారు. ఇరువర్గాల బలం సమానమైంది. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లలో ఎమ్మెల్యే ఆది మనోధైర్యాన్ని నింపారు. తన స్వగ్రామమైన దేవగుడిలో శిబిరం ఏర్పాటు చేయించారు. అధికారులు లాటరీ వేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలు వైఎస్సార్‌సీపీకే దక్కాయి.
జమ్మలమడుగులో 9 స్థానాలను వైఎస్సార్‌సీపీ, 11స్థానాలను టీడీపీ దక్కించుకుంది. ఎమ్మెల్యే, కడప ఎంపీ ఓటుతో వైఎస్సార్‌సీపీ బలం 11కు పెరిగింది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ కూడా లాటరీ అనివార్యమైంది. చైర్మన్ స్థానం వైఎస్సార్‌సీపీకే దక్కింది.
నెల్లూరు జెడ్పీ విషయం హైకోర్టు వరకు వెళ్లింది. ఈనెల 20వ తేదీన ఎన్నిక నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల పరిశీలకునిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని నియమించారు. ఇక్కడ కూడా లాటరీ అనివార్యమైంది. చైర్మన్‌తో పాటు వైస్ చైర్మన్ స్థానం కూడా వైఎస్సార్‌సీపీకే దక్కింది..
ఎమ్మెల్యేగా హాట్రిక్
ఒకప్పుడు జమ్మలమడుగులో పొన్నపురెడ్డి శివారెడ్డి ఆధిపత్యానికి ఎదురులేకుండా ఉండేది. 1983నుంచి 1989 వరకూ వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన మరణానంతరం అన్న కుమారుడు రామసుబ్బారెడ్డి సైతం 1994, 1999 ఎన్నికల్లో విజయం సాధించారు. ఇలా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న గుండ్లకుంట శివారెడ్డి కుటుంబచరిత్రకు ఆదినారాయణరెడ్డి పుల్‌స్టాప్ పెట్టారు. 2004, 2009.2014 ఎన్నికల్లో వరుసగా గెలుపొంది హాట్రిక్ సాధించారు. హాట్రిక్ సాధించిన ఆదినారాయణరెడ్డికి లక్కీహ్యాండ్ కూడా తోడు కావడం గమనార్హం.