ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరు పట్టణ శివారుతోపాటు గ్రామాల్లో విచ్చల విడిగా బెల్ట్ షాపులు వెలిశాయి. నిన్న మొన్నటి వరకూ చాటు మాటుగా విక్రయాలు చేస్తున్న బెల్ట్ నిర్వాహకులు గత వారం రోజుల నుంచి పబ్లిక్‌గా మద్యం విక్రయాలు జరుపుతున్నారు. ప్రొద్దుటూరు ఎక్సైజ్ పరిధిలో 22 మద్యం షాపులు, 8 బార్‌లు ఉన్నాయి. వాటిలో రాజుపాళెం మండలంలో ఒకటి, చాపాడులో రెండు, ప్రొద్దుటూరులో 19 షాపులు ఉన్నాయి. వాటిలో రెండు ప్రభుత్వ మద్యం షాపులు ఉన్నాయి.
నిన్న దొంగ చాటుగా.. నేడు బాహాటంగా
ఈ నెల 1 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ ప్రారంభమైంది. గతంలో మాదిరి కాకుండా ఈ సారి ప్రవేశపెట్టే మద్యం పాలసీ ద్వారా వైన్ షాపుల నిర్వహణలో పారదర్శకతను పాటిస్తామని ప్రభుత్వం పదే పదే చెబుతూ వచ్చింది. అయితే గతంలో లాగానే ఈ సారి కూడా విచ్చల విడిగా బెల్ట్ షాపులను నిర్వహిస్తున్నారు. గ్రామాల్లోనూ, పట్టణ శివారులోనూ రెండు వారాలపాటు చాటు మాటుగా అనధికార విక్రయాలు జరిపిన వ్యాపారులు ఇప్పుడు బాహాటంగా విక్రయిస్తున్నారు. కొందరైతే బెల్ట్ షాపుల కోసం బంకులు ఏర్పాటు చేసుకున్నారు. పట్టణ శివారుతో పాటు ప్రొద్దుటూరు, రాజుపాళెం, చాపాడు మండలాల్లోని ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాపులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బెల్ట్ నిర్వాహకుల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లను కూడా ప్రధాన మద్యం షాపుల యజమానులు వసూలు చేస్తున్నారు. పోలీసులకు, ఎక్సైజ్ అధికారులకు డబ్బులు ఇచ్చాం.. వాళ్లు మీ గురించి పట్టించుకోరని మద్యం వ్యాపారులు బెల్ట్ షాపు నిర్వాహకులకు భరోసా ఇస్తున్నారు.
దాడులు చేయడానికి సిబ్బంది లేరట..
సిబ్బంది తక్కువగా ఉండటం వల్లనే దాడులు చేయడం లేదని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ప్రొద్దుటూరులో ఈ సారి కొత్తగా రెండు ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. ఈ షాపుల నిర్వహణకు గాను ప్రభుత్వం ఇంకా సిబ్బందిని నియమించలేదు. అందువల్లనే ఇక్కడ పని చేస్తున్న సిబ్బందే మద్యం షాపులను నిర్వహిస్తున్నారు. ప్రొద్దుటూరు స్టేషన్‌లో సీఐ, ఎస్‌ఐలు మినహా 8 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో ఒక మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు. అయితే రెండు మద్యం షాపుల్లో ఇద్దరు చొప్పున కానిస్టేబుళ్లు పని చేస్తున్నారు. ఒకరు ప్రతి రోజూ చలనా కట్టడానికి బ్యాంక్‌కు వెళ్తుంటారు. ఇలా ఐదు మంది సిబ్బంది షాపుల నిర్వహణ చూసుకోవాల్సి వస్తోంది. అందువల్లనే దాడులు చేయలేకపోతున్నామని అధికారులు సాకు చెబుతున్నారు. ఎక్సైజ్ అధికారులు పట్టించుకోక పోవడంతో పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ఇటీవల వెంకటేశ్వరకొట్టాలలో నిర్వహిస్తున్న బెల్ట్ షాపుపై దాడి చేసి పెద్ద ఎత్తున మద్యం సీసాలను త్రీ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం సీసాలపై ఉన్న హోలోగ్రాంల ఆధారంగా వీటిని ఏ షాపు నుంచి తెచ్చి విక్రయిస్తున్నారో సులభంగా గుర్తించవచ్చు. ఈ విధంగా చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు ఎందుకో మరి ఆ దిశగా దృష్టి సారించడం లేదు.
బాహాటంగా బెల్ట్‌షాపులు
Published Sun, Aug 2 2015 1:49 AM | Last Updated on Tue, Oct 16 2018 7:27 PM
Advertisement