ఇసుక మాటున అక్రమాల మేట
సాక్షి, రాజమండ్రి :ఇసుక ర్యాంపుల కేటాయింపుల్లో ప్రభుత్వం చెబుతున్న పారదర్శకత నేతి బీరకాయలో నెయ్యి చందాన తయారైంది. పేరుకు మహిళా సంఘాలకు అప్పగించామని చెబుతున్నా అక్కడి పెత్తనం అంతా అధికార తెలుగుదేశం పార్టీ స్థానిక నేతలే నెరపుతున్నారు. ర్యాంపుల్లో ఆ పార్టీ కార్యకర్తలు మకాం వేసి తమ నేత చెప్పిన వారికే సరుకు పంపుతున్నారు. అంతా తామై పెత్తనం చలాయిస్తున్నారు. రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం వద్ద ఉన్న గాయత్రీ ర్యాంపు విషయంలో అయితే చెప్పనక్కర లేదు. ఆ ర్యాంపు రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ కీలకనేత సొంత జాగీరులా మారిందని వ్యక్తిగత అవసరాలకోసం ఇసుక తెచ్చుకుందామని వెళ్లినవారు వాపోతున్నారు. ఇక్కడ ర్యాంపును పూర్తిగా నిర్వహించాల్సిన డ్వాక్రా సంఘాల మహిళలు కేవలం డీడీలు తీసుకోవడానికి, జమాఖర్చులకు పరిమితమవుతుండగా ఎవరికి ఇసుక పంపాలి, ఏ ధర వసూలు చేయాలని అనేది ఆ నేత అనుచరులే నిర్ణయిస్తున్నారు. ఉదయం సరుకు తోలిన పర్మిట్లతోనే రాత్రిళ్లు మళ్లీ లోడు చేయిస్తున్నారు. తమవారైతే డీడీలతో నిమిత్తం లేకుండా నేరుగా డబ్బులు తీసుకుని ఇసుక ఎగుమతి చేస్తున్నారు.
రేట్లు వారి ఇష్టారాజ్యం...
ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం.. వ్యక్తిగత అవసరాలకు ఇసుక కావలసిన వారు యూనిట్‌కు రూ.రెండువేలు డీడీ తీసి, ఇసుకను పొందాలి. అయితే టీడీపీ నేత అనుచరులు ఇసుక ర్యాంపును గుప్పెట్లో పెట్టుకుని ఇసుకకు ఇష్టారాజ్యంగా రేట్లు నిర్ణయించి సొమ్ము దండుకుంటున్నారు. ఉదయం 10 గంటల నుంచి పది పదిహేను పర్మిట్లపై ఇసుక తోలిన లారీలు మళ్లీ రాత్రి అవే పర్మిట్లను చూపుతూ రెండు మూడు లోడులు తరలించేస్తున్నాయి. ఈ లోడంతా తమకు అనుయాయులైన కాంట్రాక్టర్లకు సదరు నేత అనుమతితోనే తరలిస్తున్నట్టు సమాచారం. అంతే కాకుండా రేవులో వ్యవహారాలు చూసే కార్యకర్తలు భవన నిర్మాణాలకు యూనిట్‌కు రూ.4000 వంతున చార్జి చేస్తున్నారు. దీనికి అదనంగా ఐదు కిలోమీటర్లలోపు లారీ రవాణాకు రూ.1000, అంతకు మించి పది కిలోమీటర్ల లోపు అయితే రూ. 2,000 కిరాయి రూపంలో పిండుకుంటున్నారు. వ్యక్తిగతంగా డీడీలు తీసి ఇసుక కోసం వెళ్లే వారికి లోడు దక్కాలంటే రోజుల సమయం పడుతోందని వాపోతున్నారు. ఈ లోగా లారీ వెయిటింగ్ చార్జీలకు అదనపు సొమ్ములు ఇచ్చే కన్నా అనధికారికంగా ఇసుక దందాను నిర్వహిస్తున్న కీలకనేత అనుచరులను పట్టుకుని సమర్పించుకుంటేనే ఇసుక తేలికగా లభిస్తోందంటున్నారు.
ఫిర్యాదులున్నా చర్యలు లేవు..
గాయత్రీ ర్యాంపు నుంచి రోజుకు సగటున సుమారు 60 నుంచి 75 లారీల ఇసుక పర్మిట్లపై రవాణా అవుతోంది. కానీ సాయంత్రం ఆరు గ ంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ 80కు పైగా లారీలను కొన్ని పాత పర్మిట్లతో, మరికొన్ని నేరుగా తరలించేస్తున్నారని తెలుస్తోంది. రోజుకు సుమారు రూ.మూడున్నర లక్షలకు పైగా విలువైన ఇసుక ఈ ఒక్క ర్యాంపు ద్వారానే అక్రమంగా తరలిపోతున్నట్టు అంచనా. ఈ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదులందుతున్నా అక్రమాల వెనుక ఉన్నది అధికార పార్టీ సీనియర్ నేత కావడంతో చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. ఇసుక ధరలను అవసరమైన సామాన్యులకూ సరసమైన ధరలకు అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం అంటే.. దానికి అధికార పార్టీ వారే అడ్డంకిగా నిలుస్తున్నారన్న మాట.