సాక్షి, హైదరాబాద్: భద్రాచలం తెలంగాణలో అంతర్భాగంగానే ఉండాలని తెలంగాణ మహిళా రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. టీఆర్‌ఎల్‌డీ అధ్యక్షురాలు కె.ఇందిరా దిలీప్‌కుమార్ అధ్యక్షతన హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఈ సమావేశంలో.. సంధ్య(పీవోడబ్ల్యూ), సొగరా బేగం(టీఆర్‌ఎల్‌డీ), అనితారెడ్డి, సంధ్య, సత్యలక్ష్మి (డాక్టర్స్ జేఏసీ), మల్లీశ్వరి (టీచర్స్ జేఏసీ), జూపాక సుభద్ర (రచయిత్రి), వాణి (విద్యుత్ జేఏసీ)తోపాటు ఎమ్మెల్సీలు కె.దిలీప్‌కుమార్, చుక్కా రామయ్య, ప్రొఫెసర్లు కేశవరావు జాదవ్, లక్ష్మణ్, తెలంగాణ రచయితల వేదిక చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌పై ఆంక్షలు పెట్టకుండా, భద్రాచలంతో కూడిన సంపూర్ణ తెలంగాణ ఇవ్వాలని సదస్సు తీర్మానించింది. ఈ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేసింది. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వాలని.. పెండింగ్‌లో ఉన్న అన్ని తెలంగాణ ప్రాజెక్టులను కేంద్ర నిధులతోనే పూర్తిచేయాలని కోరింది.