సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘అనంత’ ఫ్యాక్షన్‌తో రెండు తరాలు అంతమైనా ‘రక్తచరిత్ర’ మాత్రం ఆగలేదు. పరిటాల శ్రీరాములు హత్యతో ఆరంభమైన ఈ ఫ్యాక్షన్ 2011 జనవరి 3న జరిగిన మద్దెల చెరువు సూర్యనారాయణరెడ్డి(సూరీ) హత్యతోముగిసిందని ‘అనంత’ వాసులు భావించారు. కానీ సూరి హత్య జరిగిన రెండునెలల లోపే సూరి అనుచరుడు తగరకుంట కొండారెడ్డి హత్య జరిగింది. దీంతో ఒక్కసారిగా మళ్లీ ‘అనంత’ ఫ్యాక్షన్ జడలు విప్పుకున్నట్లయింది. దీంతో పరిటాల ప్రత్యర్థులంతా అప్పట్లో వణికిపోయారు. ఆపై ‘అనంత’లో అక్కడక్కడా రాజకీయ హత్యలు జరుగుతూనే వచ్చాయి. ఈ క్రమంలో సూరి హత్య కేసుకు సంబంధించి మంగళవారం తీర్పు వెలువడటంతో ఇక్కడి ఫ్యాక్షన్‌పై విస్తృత చర్చ నడుస్తోంది. అసలు ఈ ఫ్యాక్షన్ ఎలా మొదలైంది? ఇప్పటికైనా ముగిసినట్లేనా? లేదంటే భవిష్యత్తులో మరిన్ని హత్యలు జరుగుతాయా? అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ‘అనంత’ ఫ్యాక్షన్‌పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
ఆరంభం ఇలా...
కొన్నేళ్ల కిందటి నుండి 1968 దాకా పరిటాల శ్రీరాములు, మద్దెలచెర్వు నారాయణరెడ్డి ఇద్దరూ స్నేహితులు. అయితే 1968లో జరిగిన ఓ సంఘటన ఇరు కుటుంబాల మధ్య చిచ్చును రేపింది. శుత్రుత్వాన్ని రగిల్చింది. అప్పట్లో పరిటాల శ్రీరాములు పీపుల్స్‌వార్‌లో చేరారు. దీంతో నారాయణ రెడ్డికి, పరిటాల కుటుంబానికి అభిప్రాయ భేదాలతో పాటు ఆధిపత్య పోరు ఆరంభమైంది. ఈక్రమంలో 1975లో పరిటాల శ్రీరాములును ప్రత్యర్థులు నరికి చంపారు. ఇదే ‘అనంత’ ఫ్యాక్షన్‌లో తొలి హత్య. ఈ హత్యతో వారి రెండు కుటుంబాల ఆధిపత్యపోరు జిల్లా అంతటికి సోకింది. శ్రీరాములు హత్య తర్వాత నాలుగేళ్ల పాటు అంతర్గత విభేదాలు అణిగిఉన్నాయి. ఆ తర్వాత 1979లో శ్రీరాములు పెద్ద కుమారుడు పరిటాల హరిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. పరిటాల శ్రీరాములు హత్య, పరిటాల హరి ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా 1983లో మాజీ ఎమ్మెల్యే మద్దెలచెర్వు నారాయణరెడ్డిని అనంతపురంలోని అన్నపూర్ణ లాడ్జి వద్ద పరిటాల శ్రీరాములు వర్గీయులు చంపేశారు. నారాయణరెడ్డిని వెంటాడి, వేటాడి కిరాతకంగా నరికి చంపిన సంఘటన నేటికీ జిల్లా వాసులు మరవలేదు.
ఒక తరం అంతం... మలి తరం ఆరంభం
పరిటాల శ్రీరాములు, పరిటాల హరి, మద్దెలచెర్వు నారాయణరెడ్డి హత్యలతో ఒక తరం పెద్దలు బలయ్యారు. అప్పటికి నారాయణరెడ్డి కుమారులు సూర్యనారాయణరెడ్డి, రఘునాథరెడ్డిలు చిన్నపిల్లలు. ఈ క్రమంలో ఆ కుటుంబానికి సమీప బంధువైన సానే చెన్నారెడ్డి అండగా నిలిచారు. 1989లో పెనుకొండ నియోజకవర్గం నుంచి సానే చెన్నారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో పరిటాల రవీంద్ర అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటల్లో కొండపల్లి సీతారామయ్య వర్గంలో దళసభ్యులుగా ఉన్న పోతుల సురేష్‌కు రవి పరిచయమయ్యారు. వీరితో చమన్ కలిశారు. పరిటాల రవి, పోతలు సురేశ్, చమన్‌ల త్రయం వీరి వైరీ వర్గీయులను హతమార్చేందుకు పథకం రచన చేశారు. దీంతో జిల్లాలో తిరిగి ఫ్యాక్షన్ జడలు విప్పుకుంది. ఈ క్రమంలో పెనుగొండ ఎమ్మెల్యే సానె చెన్నారెడ్డిని 1991 మే 7న ఆయన స్వగృహంలోనే కాల్చి చంపారు. దీంతో నరమేథం ఆరంభమైంది. చెన్నారెడ్డి వర్గీయులను వారు తుదముట్టించారు. ఈ క్రమంలోనే పరిటాల రవి వర్గం టీవీ బాంబు కుట్రపన్నింది. 1993 అక్టోబరు 24న, మద్దెలచెర్వు సూరి ఇంట్లో టీవీ బాంబును పెట్టి పేల్చివేసింది. ఈ ఘటనలో మద్దెలచెర్వు సూరి తల్లి సాకమ్మ, సోదరుడు రఘునాథరెడ్డి, సోదరి పద్మావతి, చంద్రశేఖర్(7), నారాయణప్పలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సానె చెన్నారెడ్డి కుమారులు ఓబురెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమణా రెడ్డి కూడా శత్రువుల చేతిలో హతమయ్యారు.
ఆర్వోసీతో ఊచకోత
పీపుల్స్‌వార్ నుండి బయటకు వచ్చిన పోతుల సురేష్ రీఆర్గనైజింగ్ కమిటీ(ఆర్వోసీ)ను ప్రారంభించారు. ఆర్వోసీ అండతో పరిటాల రవి తన శత్రువర్గాన్ని ఊచకోత కోశారు. క్రమంలో సూరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆపై 1997 నవంబర్ 19న హైదరాబాదులో పరిటాల రవిని హత మార్చేందుకు కారు బాంబు ప్రయోగించారు. ఈ ఘటనలో పరిటాల రవి తృటిలో తప్పించుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మద్దెలచెర్వు సూరి 13 ఏళ్లు జైలుశిక్షను అనుభవించారు. ఆ తర్వాత 2005 జనవరి 24న జిల్లా టీడీపీ కార్యాలయం ఎదుట పరిటాల రవిని ప్రత్యర్థులు కాల్చి చంపారు. ఆ తర్వాత రవి సతీమణి పరిటాల సునీత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2005 నుండి ఎలాంటి గొడవలు లేకుండా జిల్లా ప్రశాంతంగా ఉంది. 2009 డిసెంబరు 29న జైలు నుండి విడుదలైన సూరీ కూడా తాను ఫ్యాక్షన్ చేసే స్థితిలో లేనని, ప్రశాంత జీవితం గడపాలనుకుంటున్నానని పదేపదే వెల్లడించారు. ఈ క్రమంలో ఆర్వోసీ నేత పోతుల సురేశ్ 2010 అక్టోబరు 17న కోర్టుకు లొంగిపోయారు. 2011 జనవరి 3న మద్దెల చెర్వు సూరీని హైదరాబాద్‌లో కాల్చి చంపారు. పరిటాల రవి, సూరి హత్యలతో రెండో తరం అంతమైంది. ఇలా పరిటాల శ్రీరాములు నుంచి మద్దెల చెరువు సూరీ హత్య వరకూ ఈ రెండు కుటుంబాల మధ్య రేగిన ఫ్యాక్షన్ చిచ్చులో 973మంది బలైన ట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇలా రెండు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ పోరులో వందలమంది ప్రాణాలు కోల్పోవడం బహుశా రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమమేమో!!
సూత్రధారులతో పాటుపాత్ర ధారులనూశిక్షించాలంటున్న భానుమతి
సూరి హత్య తర్వాత భాను కిరణ్ కొన్ని నెలలు కన్పించకుండా వెళ్లిపోయారు. భానునే సూరిని హత్య చేశారని అప్పట్లో పోలీసులు, సూరి అనుచరులు భావించారు. అయితే పరిటాల రవి పెద్దకుమారుడు పరిటాల శ్రీరామ్, విజయవాడకు చెందిన టీడీపీ నేత వల్లభనేని వంశీలే తన భర్త హత్యకు కారకులని సూరీ సతీమణి గంగుల భానుమతి ఆరోపించారు. ఆపై మంగళవారం తన భర్త హత్య కేసు తుదితీర్పు అనంతరం కూడా పరిటాల కుటుంబంపై భానుమతి ఆరోపణలు చేశారు. భానుకు యావజ్జీవశిక్ష విధించడంపై తాను అసంతృప్తిగా ఉన్నానని, ఉరిశిక్ష విధించాలని అన్నారు. అలాగే పాత్ర దారులతో పాటు కుట్రదారులకు కూడా శిక్ష పడాలన్నారు. అంటే పరిటాల కుటుంబీకుల పాత్ర కూడా ఉందని, వారికి శిక్షపడాలని చెప్పకనే చెప్పారు. దీంతో సూరీ హత్యతో పరిటాల కుటుంబీకుల పాత్ర ఉందనే భానుమతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఇప్పటికైనా ‘అనంత’ ఫ్యాక్షన్‌కు ముగింపు పలకాలని, ఇప్పటి వరకూ సాగిన దారుణకాండ చాలని, అంతా ప్రశాంత జీవితాన్ని కోరుకోవాలని జిల్లా వాసులు కాంక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment