విభజించు..పాలించు..(డివైడ్ అండ్ రూల్) సిద్ధాంతం బ్రిటిష్ పాలకులదైతే.. రాష్ట్ర సర్కారుది విడదీసి..సేకరించు సిద్ధాంతంలా కనిపిస్తోంది. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి భూ సేకరణకు ప్రభుత్వం ఇదే విధానాన్ని అవలంబిస్తోంది. రైతులనుంచి ఒకేసారి వ్యతిరేకత రాకుండా, వారినే విడదీస్తూ తన పని తాను చక్కబెడుతోంది. భూ సేకరణకు ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను ఒకేసారి ప్రకటించిన యంత్రాంగం..ఫైనల్ నోటిఫికేషన్‌ను మాత్రం విడతల వారీగా ఇస్తుండడం గమనార్హం. రైతులను ఇబ్బందు లకు గురిచేయొద్దని కోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం అధికారులు పట్టించుకోవడం లేదు. ఓ వైపు సర్వే చేస్తూనే మరో వైపు ఫైనల్ నోటిఫికేషన్లు ఇస్తుండడంతో బాధిత గ్రామాల రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
విజయనగరం కంటోన్మెంట్: భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుపై కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం మాత్రం జోరుగా వ్యవహారాలు చక్కబెడుతోంది. ఓ వైపు సర్వేలు, మరో వైపు ఆర్ ఆర్ ప్యాకేజీ ప్రకటన, డీ పట్టా దారులకు చెల్లింపులు, అభ్యంతరాలకు జవాబులు రిజిస్టర్ పోస్టుల ద్వారా పంపించడంతో పాటు ఇప్పుడు ఫైనల్ నోటిఫికేషన్లను ఒకే సారి కాకుండా కొద్ది పాటి ఎకరాలతో ఇస్తున్నారు. ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను ప్రచురించిన తరువాత సంవత్సరంలోగా ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది.
లేకుంటే భూసేకరణ చట్టం నిబంధనలు ఒప్పుకోవు. ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటికే దాదాపు ఆరు నెలల పైచిలుకు సమయం అయిపోవడంతో సమయం దగ్గర పడుతున్నదని భావిస్తున్న యంత్రాంగం ఎయిర్‌పోర్టు భూ సేకరణ కార్యక్రమాన్ని రైతులతో చెప్పకుండానే వేగవంతం చేస్తోంది. మీ అనుమతి లేకుండా భూ సేకరణ చేపట్టబోమని రైతులు, ప్రజలతో నిత్యం చెబుతున్న అధికారులు ఆచరణలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
గత ఏడాది ఆగస్టు 31న ఇచ్చిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ సందర్భంగా సేకరించిన సుమారు 2,800 పై చిలుకు అభ్యంతరాలకు ఇప్పటికే ఏదో ఒక సమాధానాన్ని ఇచ్చి..మమ అనిపించి.. ఇప్పుడు ఫైనల్ నోటిఫికేషన్‌ను ముక్కలు ముక్కలుగా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఒక దఫా ఫైనల్‌నోటిఫికేషన్ ఇచ్చిన యంత్రాంగం పలు విడతల్లో నోటిఫికేషన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. దీనికోసం జిల్లా కేంద్రంలోని భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు భూ సేకరణ కార్యాలయం పనులు జోరుగా చేపడుతోంది.
డీ పట్టాదారులకు చెల్లింపులు
ఎయిర్‌పోర్టు పరిధిలో గుర్తించిన డిపట్టా భూములకు ఇప్పటికే దాదాపు రూ.32.62 కోట్లు చెల్లించారు. మొత్తం మూడు యూనిట్ల భూ సేకరణలో కౌలువాడ, రావాడ యూనిట్లో 40 మంది రైతులకు రూ. 8 కోట్లు చెల్లించారు. గూడెపు వలస యూనిట్లో 32 ఎకరాలకు 21 మందికి సుమారు రూ. 4.62 కోట్లు చెల్లించారు. మరో యూనిట్లో ఉన్న ముంజేరు, కొంగవాని పాలెం, కంచేరు పాలెం, కంచేరు, సవరవిల్లి, ఎ.రావివలస గ్రామాల్లోని 122 మందికి రూ. 20 కోట్లు చెల్లించారు. మిగిలిన వారికి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. డిపట్టా భూములకు సంబంధించి ఫైనల్‌నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. జిరాయితీకి తప్పనిసరిగా ఇవ్వాల్సిన నోటిఫికేషన్లను వరుసపెట్టి ఇచ్చేందుకు చర్యలు తీసుకోవడం గమనార్హం.
ఆ గ్రామాల్లోనే మీ ఇంటికి మీ భూమి
జిల్లా వ్యాప్తంగా మీ ఇంటికి మీ భూమి కార్యక్రమానికి ఇచ్చిన దరఖాస్తులు పెద్దగా పట్టించుకోని అధికారులు భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించి గుర్తించిన గ్రామాల్లో రికార్డులను సరిచేసి కొత్త పాసుపుస్తకాలను ఇస్తున్నారు. రైతులతో మీ ఇష్టప్రకారమే జరుగుతుందని, బలవంతంగా భూములు తీసుకోమని చెబుతున్న యంత్రాంగం వారి ఇళ్లకు వెళ్లి మరీ పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నారు.
విడతల వారీగానే ఫైనల్ నోటిఫికేషన్లు
భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించి విడతలుగానే ఫైనల్ నోటిఫికేషన్లు ఇస్తాం. ఇప్పటికే ఒక విడత నోటిఫికేషన్ ఇచ్చాం. రైతులను ఇబ్బంది పెట్టకుండానే భూ సేకరణ చేస్తాం. ఆర్ ఆర్ ప్యాకేజీ కూడా ప్రకటించాం.
ఎస్ శ్రీనివాసమూర్తి, ఆర్డీఓ, విజయనగరం
కట్..కట్..కట్..!
Published Sat, Feb 13 2016 11:57 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement