
ఏవీ సుబ్బారెడ్డి ఆస్తులపై మంత్రి అఖిలప్రియ ఆరా?
- ఆధార్ నంబర్ల ద్వారా వివరాల సేకరణ
- సిమెంట్ కంపెనీలో ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టుపై కన్ను!
- అది తమకే ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్న వైనం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డి ఆస్తులపై మంత్రి భూమా అఖిలప్రియ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆస్తుల మొత్తం చిట్టాను సేకరించే పనిలో ఆమె నిమగ్నమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏవీతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డు నంబర్ల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్లు ఆ పార్టీకే చెందిన కొందరు నేతలు చెబుతున్నారు. భూమాకు, ఏవీకి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉండేది. వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో ఏనాడూ పొరపొచ్చాలు రాలేదు. ఒకరికి తెలియకుండా మరొకరు వ్యవహారాలు చక్కదిద్దిన పరిస్థితి కూడా ఏనాడూ లేదు.
భూమా నాగిరెడ్డి.. కుటుంబ సభ్యులకైనా కొన్ని విషయాలు చెప్పేవారు కాదేమోగానీ, ఏవీకి తెలియకుండా ఏమీ చేయరనే పేరుంది. భూమా మరణించిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఏవీ ఒంటరివారై పోయారనే అభిప్రాయముంది. భూమా నాగిరెడ్డి హయాంలో ఏవీ.. ఒక సిమెంటు కంపెనీలో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టు సంపాదించారు. ఈ కాంట్రాక్టు ద్వారా ప్రతినెలా రూ.10 లక్షల వరకూ ఆదాయం వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ కాంట్రాక్టు తమకే ఇవ్వాలని మంత్రి అఖిలప్రియ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. మొత్తమ్మీద వీరిద్దరి మధ్య నెలకొన్న తగాదా చిలికిచిలికి గాలివానలా మారి ఆస్తుల పంచాయితీ వరకూ వెళ్లినట్టు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏవీ సుబ్బారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు నంబర్లను మంత్రి అఖిలప్రియ సంపాదించినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రతి పనికీ ఆధార్ కార్డు తప్పనిసరి అయ్యింది. కొత్త వాహనం, స్థలం, ఇల్లు.. కొనాలంటే ఆధార్ తప్పనిసరి. ఎస్‌ఆర్‌డీఎస్ అనే సాఫ్ట్‌వేర్ ద్వారా ఆధార్ నంబరు ఆధారంగా ఆస్తుల వివరాలను తీసుకునే వెసులుబాటు ఉంది.
ప్రస్తుతం మంత్రి అఖిలప్రియ ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా ఏవీ ఆస్తుల చిట్టాను సంపాదించే పనిలో పడినట్టు సమాచారం. చాలా రోజులుగా సదరు మంత్రి అఖిలప్రియ, ఏవీల మధ్య సత్సంబంధాలు లేవు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి కాదు కదా.. ఏ గడ్డీ వేయకపోయినా భగ్గుమంటోంది. ఉప ఎన్నిక ప్రచారంలో కూడా ఇద్దరూ కలసి పాల్గొన్న సందర్భాలు లేవు. ఏవీ ఆస్తులన్నీ తమవే అని మంత్రి అఖిల భావిస్తుండటమే ఈ ఆరాకు కారణమని టీడీపీకి చెందిన ఓ నాయకుడు ‘సాక్షి’కి తెలిపారు. తాజా పరిణామాలను గమనిస్తే ఇది నిజమేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.