భూమా నాగిరెడ్డి కన్నుమూత | bhuma nagi reddy passed away | Sakshi
Sakshi News home page

భూమా నాగిరెడ్డి కన్నుమూత

Published Mon, Mar 13 2017 2:58 AM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM

bhuma nagi reddy passed away

- గుండెపోటుతో కుప్పకూలిన నంద్యాల ఎమ్మెల్యే
సాక్షి ప్రతినిధి, కర్నూలు/ నంద్యాల: కర్నూలు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి (54)ఆదివారం తీవ్ర గుండెపోటుతో కన్నుమూశారు. ఉదయం ఆళ్లగడ్డ నివాసంలో అల్పాహారం తీసుకున్న భూమా 8.30 గంటల సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనను కాపాడటానికి వైద్యులు రెండు గంటల పాటు శ్రమించినా ఫలితం లేకపోయింది.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఉదయం అమరావతిలో ఎమ్మెల్సీ ఎన్నికలపై నిర్వహించిన సమావేశంలో నంద్యాల, ఆళ్లగడ్డ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులతో కలసి భూమా పాల్గొన్నారు. భూమాకు మంత్రి పదవి అంశం సమావేశంలో చర్చకు వచ్చినట్టు, ఈ సందర్భంగా వాదోపవాదాలు చోటు చేసుకున్నట్టు తెలిసింది. అనంతరం అమరావతి నుంచి బయలుదేరి రాత్రి ఏడు గంటల సమయంలో ఆళ్లగడ్డకు చేరుకున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లతో మరోమారు భేటీ అయ్యారు. ఆ తర్వాత విశ్రాంతి తీసుకున్న భూమా ఆదివారం ఉదయం గుండెపోటుకు గురయ్యారు. కుటుంబసభ్యులు, కార్యకర్తలు వెంటనే స్థానిక డాక్టర్‌ రామలింగారెడ్డి ఆస్పత్రికి తరలించారు.

అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం 9.30 గంటల సమయంలో నంద్యాలలోని సురక్ష ఎమర్జెన్సీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. డాక్టర్‌ రవికృష్ణ సారథ్యంలో క్రిటికల్‌ కేర్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ హరినాథరెడ్డి, డాక్టర్‌ మధుసూదనరావు, కర్నూలు నుంచి వచ్చిన కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ మహమ్మద్‌ అలీలు సుమారు రెండు గంటల పాటు భూమాను కాపాడేందుకు ప్రయత్నించారు. ఒకానొక సమయంలో ఆయన్ను హెలికాప్టర్‌ ద్వారా హైదరాబాద్‌కు తరలించి వైద్యం అందించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. భూమా ఆరోగ్య పరిస్థితిపై చాలాసేపటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆస్పత్రి వద్ద స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. చివరకు భూమా మరణించినట్లు 11.30 గంటల సమయంలో వైద్యులతో కలసి భూమా బావమరిది, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రకటించారు.

గుండె ఆగిపోవడంతో...
గుండె పనిచేయడం ఆగిపోవడంతో (కార్డియాక్‌ అరెస్ట్‌) భూమా నాగిరెడ్డి మరణించారని డాక్టర్‌ హరినాథరెడ్డి తెలిపారు. భూమా హార్ట్‌బీట్‌ తీవ్రస్థాయిలో 250కి పైగా చేరిందని, బీపీ కూడా ఎక్కువై మెదడుకు రక్తప్రసారం నిలిచిపోయిందని చెప్పారు. దీని వల్ల ఆయనకు ఫిట్స్‌ వచ్చాయని, ఊపిరితిత్తులకు ట్యూబ్‌ ద్వారా ఆక్సిజన్‌ను పంపే ఏర్పాటుచేసి కొన ఊపిరితో తీసుకువచ్చారని తెలిపారు. వెంటనే వెంటిలేటర్‌పై పెట్టి ఇంజక్షన్లు వేసి తీవ్రంగా ప్రయత్నించినా భూమా గుండె స్పందించలేదని, దీంతో ఆయన మృతి చెందినట్లు నిర్ధారించామని తెలిపారు.

ప్రముఖుల సంతాపం.. నివాళులు
భూమా హఠాన్మరణంపై ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు కె.చంద్రశేఖర్‌రావు,  చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు,  ఏపీ శాసనమండలి చైర్మన్‌ ఎ.చక్రపాణి, ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి, మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కె. హరిబాబు, వామపక్ష పార్టీల నేతలు కె. నారాయణ, కె. రామకృష్ణ, పి. మధు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌  సంతాపం వ్యక్తం చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, వైఎస్సార్‌సీపీ నేతలు వైఎస్‌ వివేకానందరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి తదితరులు భూమా భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సోమవారం జరిగే అంత్యక్రియలకు ఏపీ సీఎం చంద్రబాబు హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

దుఃఖసాగరంలో కుటుంబసభ్యులు
భూమా మరణించారని తెలియగానే ఆయన కుటుంబసభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. భూమాను చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు ఆస్పత్రికి తరలివచ్చారు. భూమా భౌతికకాయాన్ని నంద్యాల పార్టీ కార్యాలయంలో కొద్దిసేపు ఉంచిన తర్వాత ఆళ్లగడ్డకు తరలించారు. సోమవారం ఆళ్లగడ్డలో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఎస్వీ మోహన్‌రెడ్డి తెలిపారు. భూమా నేత్రాలను హైదరాబాద్‌లోని ఎల్‌.వి.ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి దానం చేశారు. నాగిరెడ్డికి ఇద్దరు కుమార్తెలు అఖిలప్రియ (ఆళ్లగడ్డ ఎమ్మెల్యే), మౌనిక, కుమారుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి ఉన్నారు. భార్య శోభా నాగిరెడ్డి మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు.

మూడుసార్లు ఎంపీ.. మూడుసార్లు ఎమ్మెల్యే
భూమా బాలిరెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు 1964 జనవరి 8వ తేదీన భూమా జన్మించారు. బెంగళూరులో హోమియో వైద్యం చదువుతూ మధ్యలో ఆపేసి రాజకీయరంగ ప్రవేశం చేశారు. ముప్పై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. మూడుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. చివరిసారిగా 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన భూమా ఏడాది క్రితం కుమార్తెతో కలసి తెలుగుదేశం పార్టీలో చేరారు.

వైఎస్‌ జగన్‌ సంతాపం
సాక్షి, హైదరాబాద్‌: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. భూమా మరణ వార్త తెలియగానే ఆయన కుమార్తె, ఎమ్మెల్యే అఖిలప్రియకు జగన్‌ ఫోన్‌ చేశారు. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ కూడా ఫోన్‌లో అఖిలప్రియను పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement