
వైఎస్ కుటుంబంపై అభాండాలతో టీడీపీ నీచ రాజకీయాలు
తిరుపతి: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై అభాండాలు వేస్తూ టీడీపీ ప్రభుత్వం నీచరాజకీయాలు చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం తిరుపతిలో ఆ మహానేత ఐదవ వర్థంతి వేడుకలు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆ మహానేత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన సంక్షేమ ఫలాలు ఏ ఒక్కరికీ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ విధంగా చెప్పాలంటే వైఎస్ఆర్ మరణాంతరం రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టి... దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అన్ని వర్గాలను అక్కున చేర్చుకుంది వైఎస్ ఒక్కరే అని భూమన గుర్తు చేశారు. పేదవాడి ఆరోగ్యం కోసం, రైతుల అభ్యున్నతి కోసం, విద్యార్థుల ఉన్నతి కోసం వైఎస్ఆర్ పరితపించిన తీరును ఈ సందర్బంగా భూమన విశదీకరించారు. అందుకే ఈ రోజు వాడవాడలా వైఎస్ విగ్రహాలకు ప్రజలు పూజలు చేసి నివాళులు అర్పిస్తున్నారని భూమన అన్నారు.