
సిమెంట్ ధరలపై బిల్డర్ల భగ్గు
- ఆరు రోజులపాటు నిర్మాణ పనుల నిలిపివేత
- రాజకీయ నేతలకు ముడుపులివ్వడం వల్లే ధరలు పెరిగాయి
- ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధుల ఆరోపణ
ఒంగోలు : సిమెంట్ ధరల అనూహ్య పెరుగుదలపై ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు భగ్గుమన్నారు. ధరల పెరుగుదలను నిరసిస్తూ ఆరు రోజుల పాటు భవనాల నిర్మాణాన్ని ఆపేస్తున్నామని పేర్కొన్నారు. స్థానిక ఎంసీఏ భవన్‌లో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐవీ వీరబాబు, కార్యదర్శి ఎం హరి ప్రేమనాథ్, కోశాధికారి ఎం రఘురామయ్య తదితరులు కార్యాచరణను ప్రకటించారు.
గత పది రోజుల వ్యవధిలో బస్తా సిమెంట్ ధరను రూ.200 రూ.350కు పెంచారని, ఇది నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ఒంగోలు నగరంలో 60 మంది తమ సంఘంలో సభ్యులుగా ఉన్నారని, 10 వేల మందికి పైగా కార్మికులు ఉపాధి పొందుతున్నారని వివరించారు. సిమె ంట్, ఇనుము ధరల భారీ పెరుగుదల వల్ల తాము నిర్మాణ పనులు నిలిపేయక తప్పడం లేదని చెప్పారు. తాము చేపట్టే ప్రతి పనిపైనా 30 శాతం నిధులను ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తున్నా.. నిర్మాణ రంగంపై ప్రభుత్వం చిన్నచూపు చూడటం బాధాకరమన్నారు.
సిమెంట్ కంపెనీలన్నీ తెలంగాణ లో ఉండటంతో.. వాటి యాజమాన్యాలు రాజకీయ నాయకులకు ముడుపులు ఇచ్చి ఇష్టారాజ్యంగా సిమెంట్ ధరలు పెంచేశాయని విమర్శించారు. ఇసుకపై ప్రభుత్వం నిర్ధిష్టమైన ప్రణాళిక విడుదల చేయకపోవడంతో పోలీసులు, మైనింగ్ అధికారులు ట్రాక్టర్ల వెంటపడి బిల్డర్లను వేధిస్తున్నారన్నారు.
ఇలా చేయడం సరికాదని, కలెక్టర్ జోక్యం చేసుకోవాలని కోరారు.
సోమవారం ఒంగోలులో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శనివారం వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ఆందోళనలో భవన నిర్మాణ కూలీల సంఘ ప్రతినిధులు, సిమెంట్ వ్యాపారులు పాల్గొనాలని కోరారు. సమావేశంలో బిల్డర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు దుంపా కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు జీ రాజేంద్ర, సభ్యులు జే రాకేష్‌రెడ్డి, ఎం తిరుమల తదితరులు పాల్గొన్నారు.