ఆదివారం విజయవాడలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. చిత్రంలో సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం 9.30 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. లెజిస్లేటివ్ రాజధానితోపాటు ఎగ్జిక్యూటివ్ రాజధాని, జ్యుడీషియల్ రాజధాని ఏర్పాటు బిల్లు, సీఆర్‌డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు బిల్లు మండలిలో నిలిచిపోయిన నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అలాగే శాసన మండలి రద్దుకు అనుకూలంగా కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతోపాటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, మచిలీపట్నం పోర్టు నిర్మాణాలపైనా కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అర్హులైన పేదలందరికీ ఉగాది పర్వదినం రోజున ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన భూముల సేకరణపైనా చర్చించనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశంలో.. బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాత తలెత్తిన పర్యవసానాలపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. ఏపీ శానస మండలిని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర సర్కారు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి, ఆమోదించనున్నట్లు అధికార వర్గాల సమాచారం.
మండలిని రద్దు చేయాలని ఎమ్మెల్యేల సూచన అభివృద్ధి–పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల విషయంలో నిబంధనలను పాటించలేదని, ఇది తప్పేనని, అయినా సెలెక్ట్ కమిటీకి పంపిస్తానని శాసన మండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజల నుంచి నేరుగా ఎన్నికైన సభ్యులు ఆమోదించిన బిల్లులను మండలిలో నిలిపివేయడంపై గురువారం అసెంబ్లీలో చర్చ జరిగింది. శాసన మండలిని రద్దు చేయాల్సిందిగా ఈ సందర్భంగా పలువురు సభ్యులు ప్రభుత్వానికి సూచించారు. ఈ అంశంపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు మేలు చేసే బిల్లులను అడ్డుకుంటున్న మండలి అవసరమా? అనేదానిపై సోమవారం విస్తృతంగా చర్చించి, నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు.
సాక్షి, అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే రాష్ట్ర మంత్రివర్గం మూడు రాజధానుల ఏర్పాటుకు చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఉద్ఘాటించారు. 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. గవర్నర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
వికేంద్రీకరణ చరిత్రాత్మక నిర్ణయం
‘రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అభివృద్ధి వికేంద్రీకరణకు రాజధాని విధులను మూడు ప్రాంతాలకు పంపిణీ చేసేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు నిర్ణయం మంచి పరిణామం. అమరావతిలో లెజిస్లేచర్(శాసన), కర్నూలులో జ్యూడిషియల్ (న్యాయ) రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య దూరం తగ్గి పాలన మరింత చేరువవుతుంది. నవరత్నాలతో రాష్ట్రంలో నవశకానికి ప్రభుత్వం నాంది పలికింది. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నవరత్నాలు తీసుకొచ్చింది. అందరికీ అభివృద్ధి వెలుగులు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. దీని ద్వారా 500 రకాల సేవలు అందుతున్నాయి. సచివాలయల ఏర్పాటుతో రాష్ట్రంలో 4 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. వైఎస్సార్ నవశకం ద్వారా నిజమైన లబ్ధిదారులకు వలంటీర్ల సాయంతో ప్రభుత్వ ఫలాలందేలా చర్యలు తీసుకుంది.
విద్యా, వ్యవసాయ రంగాల్లో సంక్షేమరాజ్యం
వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.13,500 ఇస్తోంది. ధరల స్థిరీకరణ కోసం రూ.3 వేల కోట్లతో నిధి ఏర్పాటు చేసింది. రైతులకు 9గంటల పాటు నిరంతర విద్యుత్ అందిస్తోంది. రాష్ట్రంలో జగనన్న అమ్మ ఒడితో 100% అక్షరాస్యతకు ప్రభుత్వం కృషిచేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతోంది. ఇదే సమయంలో తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్ చేసింది. మనబడి నాడు–నేడుతో 45 వేల పాఠశాలలు, 471 జూనియర్ కళాశాలలు, 171 డిగ్రీ కాలేజీల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. జగనన్న విద్యా కానుక ద్వారా విద్యార్థులకు 3 జతల యూనిఫాంలు, పుస్తకాలు, జగనన్న గోరుముద్ద పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తోంది. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా పేద పిల్లల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తోంది. జగనన్న వసతి కార్యక్రమం ద్వారా రూ.2,300 కోట్లతో హాస్టల్ ఫీజులు చెల్లిస్తోంది.
అమరవీరులకు ఇదే ఘన నివాళి
వెఎస్సార్ కంటి వెలుగు, వైఎస్సార్ పింఛన్ కానుక, వైఎస్సార్ నేతన్న నేస్తం, వైఎస్సార్ కాపు నేస్తం, లా నేస్తం, వైఎస్సార్ వాహన మిత్ర, వైఎస్సార్ మత్స్యకార భరోసా వంటి అనేక వినూత్న పథకాలతో ప్రభుత్వం చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలను ప్రసంగంలో గవర్నర్ సుదీర్ఘంగా వివరించారు. భారత రాజ్యాంగం అన్ని వర్గాల హక్కులకు రక్షణగా నిలిచిందని, దేశంకోసం త్యాగం చేసిన అమరవీరులకు ఇవే మా ఘనమైన నివాళి అని, రాష్ట్ర ప్రజలకు తన శుభాకాంక్షలని గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. రాష్ట్రంలోని సంక్షేమ పాలనపై వివరించారు. కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, కలెక్టర్ ఇంతియాజ్, విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, దేవులపల్లి అమర్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు.
మహిళల రక్షణకు దిశ చట్టం
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత మెరుగుపరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ పైలట్ ప్రాజెక్టుగా పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని రకాల వైద్య సేవలు అందజేస్తోంది. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం రుణాలు ఇస్తోంది. పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే కల్పించడంతోపాటు నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మహిళల రక్షణకు ప్రభుత్వం దిశ చట్టం తెచ్చింది. దిశ చట్టంలో నమోదైన కేసులను 21 రోజుల్లోనే దర్యాప్తు, విచారణ పూర్తి చేసి నేరస్తులకు శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో బాధితులు నేరుగా పోలీసులు, ప్రభుత్వ అధికారులను కలిసి సమస్యలు చెప్పుకునేలా ప్రభుత్వం చేపట్టిన స్పందన కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. బాధితులు ఎక్కడైనా ఫిర్యాదు చేసేలా జీరో ఎఫ్‌ఐఆర్ విధానం అమలుచేస్తోంది.
వేతనాల పెంపుతో పెద్ద మనసు చాటిన ప్రభుత్వం
ఏపీఎస్ ఆర్టీసీని ఈ ఏడాది జనవరి 1 నుంచి ప్రభుత్వంలో విలీనం చేసి 51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులకు భరోసా కల్పించింది. రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేలా రూ.1,150 కోట్లు విడుదల చేస్తామని భరోసా ఇచ్చిన ప్రభుత్వం తొలి దశలో రూ.264 కోట్లు విడుదల చేసి రూ.10 వేల లోపు డిపాజిట్లు కలిగిన 3,69,655 మందిని ఆదుకుంది. ఉద్యోగుల వేతనాల పెంపులోను ప్రభుత్వం పెద్ద మనసు చాటుకుంది. ఆశా వర్కర్లకు రూ.3 వేల నుంచి రూ.10వేలకు పెంచింది. హోంగార్డులకు రూ.18 వేల నుంచి 21 వేలకు పెంచింది. పారిశుద్ధ్య సిబ్బందికి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి, వెలుగు యానిమేటర్లకు, 108 అంబులెన్స్ డ్రైవర్లు, 104 సిబ్బందికి, మధ్యాహ్న భోజన పథకం సిబ్బందికి వేతనాలు పెంపుపై ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించింది.
Comments
Please login to add a commentAdd a comment