‘నోరు జాగ్రత్త.. అందులో తప్పేముంది’
హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీపై టీడీపీ నేతలు విమర్శలు చేయడం సరికాదని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. ప్రధానిని వైఎస్ జగన్ కలవడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై టీడీపీ నేతలు రాద్ధాంతం చేయడం తగదని, ఆ విషయాన్ని వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు పలు రకాలు విమర్శలు చేస్తున్నారు. దీంతో మండిపడిన సోము వీర్రాజు టీడీపీ చెప్పినట్లు వినాల్సిన అవసరం తమకు (బీజేపీకి) లేదని అన్నారు. ఈ నెల 25న అమిత్ షా నేతలకు దిశా నిర్దేశం చేస్తారని అన్నారు. తాము త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని స్పష్టం చేశారు.