ఆ భూముల్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటే? : బీజేపీ
బీజేపీ నేత సోము వీర్రాజు ప్రతిస్పందన
సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో టీడీపీ మంత్రులు, నాయకులు కొన్న భూములకు డబ్బులు చెల్లించి ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటే ఎలా ఉంటుందని బీజేపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు మీడియాను ప్రశ్నించారు. యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డితో కలసి మంగళవారమిక్కడ ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు కొన్న భూములపై బీజేపీ వైఖరి గురించి ఈ సందర్భంగా మీడి యా అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు వీర్రాజు తొలుత నిరాకరించారు. కొంటే తప్పేంటి? అని ముఖ్యమంత్రే చెప్పారుగా అంటూ జవాబు దాటేశారు. దీంతో సీఎం ప్రకటనను బీజేపీ సమర్థిస్తుందా అని విలేకరులు పదేపదే ప్రశ్నించడంతో.. ఆ భూములు కొన్నవారికి కొంత డబ్బులిచ్చి ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటే ఎలా ఉంటుందో చెప్పండంటూ మీడియాను ఆయన ఎదురు ప్రశ్నించారు.
2019 నాటికి రాష్ట్రంలోనూ బలమైన శక్తిగా బీజేపీ
ఏపీలో బీజేపీ 2019 నాటికి బలమైన శక్తిగా అవతరించబోతుందని సోము వీర్రాజు చెప్పారు. రాజమహేంద్రవరంలో తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బహిరంగసభ సూపర్ సక్సెస్ అయిందని, ఈ ఉత్సాహంతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మరిన్ని సభలను నిర్వహించాలని ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు.
నీరు-చెట్టుకు వాడుతుంది కేంద్రం డబ్బుల్నే..
రాష్ట్రప్రభుత్వం ఏడాదికి రూ.2 వేల కోట్లు ఖర్చుపెట్టి అమలు చేస్తున్న నీరు-చెట్టు కార్యక్రమం, వెయ్యి కోట్లు పెట్టి అమలు చేస్తున్న పంట సంజీవని(నీటి గుంతలు) కార్యక్రమాలకు కేంద్రప్రభుత్వం అందజేసే ఉపాధి హామీ డబ్బుల్నే ఖర్చు పెడుతున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వేజోన్ ఏర్పాటు, పోలవరం విషయంలో కొన్ని ఇబ్బందులున్నందున అమలులో ఆలస్యమవుతున్నదన్నారు. అయితే వాటిని బీజేపీ తప్పక అమలు చేస్తుందన్నారు.