కమల దళపతిపై ‘ఎల్లో’ మార్క్!
* బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలో టీడీపీ జోక్యం
* అనుకూల నేతను ఎంపిక చేసేలా తెరవెనుక మంత్రాంగం
* సోము వీర్రాజుకు చెక్ పెట్టే యత్నాలు
* ఆయనకు అవకాశం ఇస్తే తమకు ఇబ్బందికరమని ఆందోళన
* దగ్గుబాటి పురందేశ్వరికి పదవి దక్కకుండా అడ్డుచక్రం
* కంభంపాటినే కొనసాగించాలంటూ బీజేపీలోని ఓ వర్గం ఒత్తిడి
* రేసులో వీర్రాజు, పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, శ్యామ్‌కిశోర్
* ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక నెలాఖరులో పూర్తి
సాక్షి, విజయవాడ బ్యూరో: ఏపీ బీజేపీ అధ్యక్షుడి ఎంపికలో పసుపు ముద్ర ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
రాష్ట్రంలో తమ పార్టీ అధినేత ఎంపిక వ్యవహారంలో టీడీపీ జోక్యం చేసుకుంటుండడం బీజేపీ నాయకులకు మింగుడుపడడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బంధం (దోస్తీ) నేపథ్యంలో టీడీపీకి అనుకూలమైన నేతను అధ్యక్షుడిగా ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఏపీలో బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను రెండు పర్యాయాలు వాయిదా వేసిన పార్టీ అధిష్టానం ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని భావిస్తోంది.
ఈ నెల 20న జిల్లాల పార్టీ అధ్యక్షుల ఎన్నిక, నెలాఖరులోగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికను పూర్తి చేసేలా కసరత్తు జరుగుతోంది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పాత్ర కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పైరవీలు ఊపందుకున్నాయి.
ఎవరికివారే ముమ్మర యత్నాలు
ఏపీ బీజేపీ అధినేతగా విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు మూడేళ్ల పదవీకాలం పూర్తికాకపోవడంతో ఆయననే కొనసాగించాలని పార్టీలోని ఓ వర్గం పట్టుబడుతోంది. అయితే, హరిబాబు కేంద్ర మంత్రి పదవిపై గురిపెట్టినట్లు సమాచారం. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఇన్‌చార్జి, కర్ణాటక బీజేపీ ఇన్‌చార్జి దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్‌కిషోర్‌లు రేసులో కొనసాగుతున్నారు. అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు ఎవరికివారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
కన్నాపై ఓ వర్గం వ్యతిరేకత!
ప్రస్తుత పరిస్థితుల్లో కాపు సామాజికవర్గానికి చెందిన సోము వీర్రాజుకు అధ్యక్ష పదవి ఇవ్వాలనే ఒక వర్గం ప్రతిపాదనకు బీజేపీలోని టీడీపీ అనుకూల శక్తులు చెక్‌పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కేంద్ర నిధుల విషయంలో అధికార టీడీపీపై దూకుడు పెంచిన వీర్రాజుకు రాష్ట్ర పార్టీ పగ్గాలు ఇస్తే పసుపు దళానికి ఇబ్బందికరం అవుతుందని ఆందోళన చెందుతున్నాయి. దగ్గుబాటి పురందేశ్వరికి ఇప్పటికే రెండు కీలక బాధ్యతలను అప్పగించారన్న సాకు చెప్పి ఆమెకు రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కకుండా అడ్డుతగిలేలా చంద్రబాబు అనుకూల వర్గం మంత్రాంగం నెరపుతోంది.
కాంగ్రెస్‌లో ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా, పదహారేళ్లపాటు మంత్రిగా పనిచేసి బీజేపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణకు కాపు కార్డు కలిసి వచ్చినా బీజేపీలోని ఒకవర్గం వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. వీరితోపాటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్‌కిషోర్, గుంటూరుకు చెందిన సీనియర్ నేత యడ్లపాటి రఘునాథబాబు... వెంకయ్యనాయుడు ఆశీస్సులతో తమ ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు
తెలుస్తోంది.
20న జిల్లా అధ్యక్ష ఎన్నికలు
రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వం కలిగినవారి సంఖ్య 6.50 లక్షల నుంచి 28 లక్షలకు పెరిగింది. క్రియాశీలక సభ్యుల సంఖ్య 7 వేల నుంచి 25 వేలకు చేరింది. ప్రస్తుతం ఎన్నికయ్యే జిల్లా, రాష్ట్ర కమిటీలు మూడేళ్లపాటు పార్టీ పదవుల్లో కొనసాగనున్నాయి. ఈ నెల 19న పార్టీ జిల్లా అధ్యక్ష పదవులకు నామినేషన్లు, 20న ఎన్నిక నిర్వహించాలని బీజేపీ అధిష్టానం ఆదేశించింది.
ఇప్పటికే పలు జిల్లాల్లో లోపాయికారిగా అధ్యక్ష పదవి ఎంపిక పూర్తయ్యింది. ఎంపికైన వారి పేర్లను ఈ నెల 20న అధికారికంగా ప్రకటించనున్నారు. పార్టీ నిబంధన ప్రకారం ఇప్పటికే రెండు పర్యాయాలు అధ్యక్ష పదవి చేపట్టిన వారికి మూడో పర్యాయం అవకాశం లేకపోవడంతో పలు జిల్లాల్లో కొత్త వ్యక్తులు బీజేపీ సారథులుగా పగ్గాలు చేపట్టనున్నారు. జిల్లాల్లో అధ్యక్ష ఎన్నికలను పూర్తిచేసి ఈ నెలాఖరున పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.