
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
కడప కోటిరెడ్డిసర్కిల్/అగ్రికల్చర్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందకపోవడానికి సీఎం చంద్రబాబునాయుడే ప్రధాన అడ్డంకి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. శుక్రవారం కడప నగరంలోని కందుల ఎస్టేట్‌లో రాయలసీమస్థాయి శక్తికేంద్రాల ప్రముఖ్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిందన్నారు. ఈ విషయాన్ని నిర్భయంగా చెప్పే దమ్ము,ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ పరిశ్రమ వచ్చిం దంటే అది ప్రధాని మోదీ చలువేనని అన్నారు. రాయలసీమ జిల్లాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కూడా చొరవ తీసుకున్నట్లు చెప్పారు. ప్రాజెక్టులకు కోట్లరూపాయలు ఇచ్చి పూర్తిచేయమని కేంద్రం చెబితే ఆ నిధులను తన అనుయాయులైన కాం ట్రాక్టర్‌లకు ఇచ్చుకుని కమీషన్ నొక్కేశారన్నారు. నీరు –చెట్టు పేరుతో చెరువులను చెరపట్టి దోపిడీకి తెరతీశారన్నారు వైఎస్‌ఆర్ జిల్లా కేంద్రమైన కడప నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలోని ప్రజలు నిజాయితీ పరిపాలన అందించాలని అధికారమిస్తే సీఎం చంద్రబాబు ఆ అధికారాన్ని స్వప్రయోజనాలకు వాడుకున్నారని నిప్పులు చెరిగారు. 2014న సీఎంగా ప్రమాణ స్వీకారం రోజున కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూస్ గోయల్ ఈ రాష్ట్రానికి 24 గంటలు కరెంటు ఇస్తున్నట్లు ప్రకటించారని అన్నారు. దాన్ని కూడా తామే ఇస్తున్నట్లు సీఎం చెప్పుకోవడం దారుణమన్నారు. రాయలసీమ వెనుకబాటు తనానికి చంద్రబాబు తీరే కారణమన్నారు. రూ.75 వేల కోట్ల విలువ చేసే మట్టిని అమ్ముకుని టీడీపీ నాయకులు సొమ్ము చేసుకున్నారన్నారు. ఇలా ఒకటేమిటి అన్ని పథకాల్లోను అవినీతిని పారించారని దుమ్మెత్తి పోశారు. కడప ఉక్కుఫ్యాక్టరీ స్థాపన కోసం వనరులకు సంబంధించి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరగా అందుకు ఎలాంటి సహకారం, సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. అఖిల భారత మహిళా మోర్చా ఇన్‌చార్జి దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో పాలక ప్రభుత్వం రైతులను, డ్వాక్రా మహిళలను, నిరుద్యోగ యువతను మోసం చేసిందని ఆరోపించారు.ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని అన్నారు.
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ మాట్లాడుతూ బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పడే పరిస్థితి లేదన్నారు. ఎందుకంటే ఉత్తరప్రదేశలోని అఖిలేష్, మాయావతి ఇప్పటికే కూటమి నాయకుడిగా చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబును ముందు మీ పీఠం గురించి ఆలోచించి రమ్మనట్లు ఢిల్లీలో చెప్పుకుంటున్నారన్నారు. తొమ్మిది సంవత్సరాల్లో హైదరబాద్‌ను నేనే కట్టానని చెబుతున్న సీఎం చంద్రబాబు మరి ఐదేళ్లలో అమరావతిలో రాజధానిని ఎందుకు కట్టలేకపోయారో? ప్రజలకు సమాధానం చెప్పాల న్నారు. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వాల్లో ఏపీలోని టీడీపీ సర్కార్ నాలుగో స్థానంలో ఉందని సాక్షాత్తు ఢిల్లీలోని సీడీఎఫ్ నివేదిక ఇచ్చిందన్నారు. కర్నూలు ఇన్‌చార్జి కపిలేశ్వరయ్య మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి నిధులు ఇస్తే వాటిని టీడీపీ నాయకులు అప్పనంగా భోం చేశారని దుమ్మెత్తిపోశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందుల రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ శక్తి కేంద్రాల ప్రముఖ్‌లు ఎన్నికల వరకు పెద్ద యజ్ఞం చేయాలన్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ్, రాష్ట్ర కార్యదర్శులు వంగల శశిభూషణ్‌రెడ్డి, సుంకర శ్రీనివాస్, అడపా నాగేంద్ర, చల్లపల్లి నరసింహారెడ్డి, భాను ప్రకాష్‌రెడ్డి, నీలకంఠ,బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు నాగోతు రమేష్‌నాయుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్, కర్నూలు, అనంతపురం చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల పార్టీ అధ్యక్షులు హరీష్, అంకాల్‌రెడ్డి, చంద్రారెడ్డి, పుప్పాల శ్రీనాధ్‌రెడ్డి,బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బత్తల పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment