పరిస్థితులు చూస్తుంటే జిల్లాలో టీడీపీ మొత్తానికే ఖాళీ అయ్యేట్లు కనిపిస్తోంది... ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ బీజేపీతో జతకట్టే అవకాశాలపై జోరుగా ప్రచారం
జరుగుతోంది.. మరోవైపు అదే బీజేపీ రాష్ట్ర నాయకత్వం జిల్లా టీడీపీ నేతలకు గాలం
వేస్తోంది.. ఒక ఎంపీ స్థానం, ఆరు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని వ్యూహరచన
చేస్తున్న కమలనాథులు తమ ‘ఆపరేషన్ ఆకర్ష్’ను జిల్లా నాయకులతో సంబంధం
లేకుండానే మొదలు పెట్టారు...!!
సాక్షిప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ సెంటిమెంట్.. మోడీ గాలిని సద్వినియోగం చేసుకునేందుకు బీజేపీ నాయకులు ముందస్తు కసరత్తు మొదలుపెట్టారు. జిల్లా బీజేపీ నాయకులతో ఏమాత్రం సంబంధం లేకుండా, వారికి ఎలాంటి సమాచారమూ ఇవ్వకుండానే పార్టీ రాష్ట్ర నాయకులు వ్యూహరచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి ఆ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగి విజయం సాధించే అవకాశాలు దాదాపు శూన్యం.
తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌తో పనిచేసిన పార్టీల్లో తామూ ఉండడం, తమ నాయకురాలు సుష్మాస్వరాజ్‌తో గత ఏడాది జిల్లాలో భారీ బహిరంగసభను నిర్వహించి విజయవంతం చేసుకోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. టీఆర్‌ఎస్ తర్వాత తెలంగాణ క్రెడిట్ తీసుకునే అవకాశం తమకే ఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయంతో ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఆరునెలల గడువే మిగిలి ఉండడంతో ఇప్పటి నుంచే పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో ఉన్న కమలనాథులు ఒకప్పటి తమ మిత్రపక్షమైన టీడీపీనే టార్గెట్ చేస్తున్నారు. జిల్లాలో బీజేపీ తరఫున ఆయా నియోజకవర్గాల్లో పోటీ పడగల స్థాయిగల నాయకులు ఇద్దరు ముగ్గురుకంటే ఎక్కువ సంఖ్యలో లేరు. దీంతో ఇతర పార్టీల నుంచి ఒకింత పేరు, గుర్తింపు, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్న వారిని తమ పార్టీలోకి ఆకర్షించే పనిలో ఉన్నారు.
ఈ సారి ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో, అదే పార్టీ నేతలను లాగేసే పనిలో బీజేపీ ఉండడం చర్చనీయాంశం అవుతోంది. పార్టీలోని విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ఈసారి ఎన్నికల్లో బీజేపీ భువనగిరి లోక్‌సభ స్థానం, ఆలేరు, సూర్యాపేట, కోదాడ, దేవరకొండ, మునుగోడు, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలన్న ప్రాథమిక నిర్ణయానికి వచ్చింది. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి ఎన్.ఇంద్రసేనారెడ్డి హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్నారని, అది కుదరని పక్షంలో భువనగిరి పార్లమెంట్ లేదా నల్లగొండ పార్లమెంట్ స్థానం బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక, బీజేపీకి చెందిన నాయకులు కాసం వెంకటేశ్వర్లు ఆలేరు నుంచి, పార్టీ రాష్ట్ర కోశాధికారి మనోహర్‌రెడ్డి మునుగోడు నుంచి పోటీ చేయాలని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంతకు మించి నాయకులు లేకపోవడంతో బీజేపీ ఇతర పార్టీల వారికి గాలం వేస్తోంది. టీడీపీతో పొత్తు ఖరారయితే ఆరు సీట్లు కోరి కనీసం నాలుగుచోట్ల పోటీ చేయాలన్న ఆలోచన వీరిది. నల్లగొండ పార్లమెంట్ స్థానంలో వెదిరె రాంరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఇక, నల్లగొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని, ఆ పార్టీ మాజీలు, ప్రస్తుతం టీడీపీ నేతలు బోయపల్లి కష్ణారెడ్డి, మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌లను సంప్రదించినట్లు సమాచారం.
వీరు కాని పక్షంలో ఇదే స్థానంలో మరో టీఆర్‌ఎస్ నాయకుడి గురించి వాకబు చేసి, ఇప్పటికే సమాచారం చేరవేశారని వినికిడి. కోదాడలో టీడీపీ నేత బొల్లం మలయ్యయాదవ్‌ను ఈ విషయమై కదిలించినట్లు చెబుతున్నారు. సూర్యాపేట నుంచి టీడీపీకే చెందిన ఓ మాజీ నాయకుడిని, దేవరకొండ నుంచి టీఆర్‌ఎస్ మాజీ నేత, మాజీ మంత్రి రవీంద్రనాయక్‌ను పార్టీలోకి ఆహ్వానించి పోటీకి పెట్టాలని చూస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి టీడీపీకి గండికొట్టే పనిలో బీజేపీ ఉన్నట్లు వారి ప్రయత్నాలు తేటతెల్లం చేస్తున్నాయి.
కమలనాథుల.. కదన వ్యూహం
Published Wed, Oct 16 2013 4:28 AM | Last Updated on Sun, Apr 7 2019 3:34 PM
Advertisement
Advertisement