
సాక్షి, ప్రకాశం: గతంలో చేపట్టిన కాంట్రాక్టులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తుంటే టీడీపీ వాళ్లు ఎందుకు అంతలా బాధపడుతున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. కాంట్రాక్టులలో తప్పు జరిగినప్పుడు వాటిని రద్దు చేయడంలో తప్పు లేదని, తప్పు జరగకుండా కావాలని రద్దు చేస్తే తప్పన్నారు. ఎలాంటి తప్పు చేయనప్పుడు కాంట్రాక్టర్లని టీడీపీ ఎందుకు వెనకేసుకొస్తోందని నిలదీశారు. టీడీపీ ఏమైనా కాంట్రాక్టర్ల పార్టీనా? అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏపీ అభివృద్ధిని పట్టించుకోలేదనీ, ఎన్నికల పేరుతో శంకుస్థాపనలంటూ హడావుడి చేసిందనీ విమర్శించారు. రామాయపట్నం పోర్టు విషయంలో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కేంద్రానికి లేఖ రాయకపోవడంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని తెలిపారు. ప్రకాశం జిల్లాలో సాగు, తాగునీటి సమస్యతో పాటు ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. జగన్ మోహన్ రెడ్డి అయినా ఈ జిల్లాను అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నానన్నారు. మరోవైపు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పలు ముఖ్యమైన బిల్లులకు ఆమోదం తెలిపిందని, ఆర్టికల్ 370ను రద్దు చేయడం వల్ల జమ్మూ కాశ్మీర్ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment