♦ నీరు–ప్రగతిలో 20–22 శాతం అవినీతి
♦ పీఎంను జగన్ కలవడంపై టీడీపీ నాయకులు విమర్శలు మానుకోవాలి
♦ బీఈడీ, డీఈడీ కాలేజీల అక్రమాలపై ప్రత్యేక నిఘా
♦ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ కృష్ణారెడ్డి
ఒంగోలు: మిత్రధర్మం అంటే జరుగుతున్న అవినీతిని చూస్తూ ఊరుకోవడం కాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిత్రధర్మం ఉల్లంఘిస్తున్నామని టీడీపీ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. మోదీ అంటే పార్టీ నాయకుడు కాదని, సాక్షాత్తు దేశ ప్రధాని అయినపుడు ఆయనను ప్రతిపక్ష నేత కలుసుకోవడంపై రాద్దాంతం చేయడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు.
చివరకు ఎంఎల్‌ఏలు సైతం ఈ వ్యవహారంపై మాట్లాడడం వారి విజ్ఞతకే వదిలివేస్తున్నామన్నారు. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నీరు–ప్రగతిలో ఏకంగా 20–22 శాతం కమీషన్లకు అధికారులు పాల్పడుతున్నారని, ఇక కాంట్రాక్టర్ వాటా తదితరాలు కలుపుకుంటే మొత్తం అవినీతి మయంగానే కనిపిస్తుందన్నారు. జిల్లాలో జరుగుతున్న ఈ అవినీతిని తాము గుర్తించి రాష్ట్ర పార్టీ దృష్టికి, కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత బీజేపీ నాయకులపై ఉందన్నారు.
అవినీతి, అక్రమాలపై నిఘా..
జిల్లాలోని అనేక బీఈడీ, డీఈడీ కాలేజీల్లో అక్రమాలు రాజ్యమేలుతున్నాయని, ఒకే వ్యక్తి ఒకే స్థలంలో అనేక కాలేజీలు నిర్వహిస్తూ చివరకు కనీసం విద్యార్థులు కూడా లేకుండా కాలేజీలను నిర్వహిస్తున్నారంటూ తమకు ఫిర్యాదులు వస్తున్నాయని కృష్ణారెడ్డి అన్నారు. ఒక్కో వ్యక్తి బినామీ పేర్లతో పదులకొద్డీ కాలేజీలు నిర్వహిస్తున్నారని, అదే విధంగా ఒకే స్థలాన్ని చూపించి కూడా అనేక కాలేజీలకు గుర్తింపులు పొందుతున్నారన్నారు. అవినీతికి అలవాటుపడిన అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని, ఈ క్రమంలో వాటి నిగ్గుతేల్చేందుకు భారతీయ జనతా పార్టీ ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలో మొత్తం 112 బీఈడీ, 141 డీఈడీ కాలేజీలు ఉన్నాయని, అన్ని కాలేజీలను తప్పకుండా పరిశీలించి సమగ్ర నివేదికను యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్‌కు, రాష్ట్ర గవర్నర్‌కు, కేంద్ర మానవ వనరుల శాఖామంత్రికి ఫిర్యాదు చేయనున్నామన్నారు.
ఒడిస్సా, ఉత్తరప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రకాశం జిల్లాలో సీట్లు పొందడం, ఆపై పరీక్షల సమయంలో మాత్రమే వారు హాజరుకావడం చూస్తుంటే విద్య వ్యాపారంగా మారి ఎంతగా దిగజారిపోయిందో అర్థం అవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా ఇన్‌ఛార్జి కందుకూరి సత్యన్నారాయణ మాట్లాడుతూ మిత్రధర్మం అంటున్న తెలుగుదేశం పార్టీ కనీసం కేంద్రం విడుదల చేస్తున్న పథకాలకు సైతం తన పేర్లు పెట్టుకోవడం తప్ప ఏనాడు బీజేపీతో చర్చించకపోవడం బాధాకరమన్నారు.
కనీసం నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో కూడా తమ పార్టీతో చర్చించకపోవడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ప్రధానిని కలవడంపై తెలుగుదేశం నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు వారి కుత్సిత బుద్దికి నిదర్శనమన్నారు. టీడీపీలో ఉన్న ఈ ఆలోచనా విధానం వల్లే నేడు రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. ఇప్పటికైనా మిత్రధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని జరుగుతున్న లోపాలను సవరించుకోవడానికి యత్నించాలే తప్ప బీజేపీని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకుంటే సహించేదిలేదని స్పష్టంచేశారు. ఈనెల 25న విజయవాడలో అమిత్‌షా ఆధ్వర్యంలో జరిగే బహిరంగసభకు జిల్లా నుంచి కనీసంగా 6 వేల మంది బూత్ కమిటీ సభ్యులు తరలివెళ్లనున్నట్లు తెలిపారు. సమావేశంలో బీజేపీ నాయకులు బి.మీనాకుమారి, విన్నకోట సురేష్, ఖలీపాతుల్లాభాషా తదితరులు పాల్గొన్నారు.
మిత్రధర్మం అంటే అవినీతిని సహించడం కాదు
Published Mon, May 15 2017 3:32 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement