PV Krishna Reddy
-
ఐపీవో యోచనలో మేఘా ఇంజనీరింగ్
శ్రీనగర్ నుంచి సాక్షి ప్రతినిధి ఎన్. పార్థసారథి: ఇన్ఫ్రా రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్) పబ్లిక్ ఇష్యూకి రావాలనే యోచనలో ఉంది. అలాగే మరిన్ని కొత్త టెక్నాలజీలను కూడా దేశీయంగా అందుబాటులోకి తేవడంపై దృష్టి పెడుతోంది. ఎంఈఐఎల్ ఎండీ పి.వి. కృష్ణారెడ్డి ఈ విషయాలు తెలిపారు. అయితే, ఎప్పట్లోగా ఐపీవోకి రానున్నది, ఎంత మేర నిధులు సమీకరించనున్నది ఆయన వెల్లడించలేదు. మరోవైపు, హైడ్రోజన్ సంబంధ టెక్నాలజీకి సంబంధించి ఒక ఇటాలియన్ సంస్థతో కలిసి పనిచేస్తున్నామని కృష్ణారెడ్డి చెప్పారు. ఇటీవలే అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకున్నామని వివరించారు. కొత్త తరహా సాంకేతికతలపై సుమారు రూ. 15–20 వేల కోట్ల దాకా ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ‘మేము ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులు, ఆటోల్లాంటివి తయారు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా 1,000కి పైగా ఎలక్ట్రిక్ బస్సులు నిర్వహిస్తున్నాం. అలాగే ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ రిగ్గుల తయారీ, ఎక్స్‌ప్రెస్ వేస్, విద్యుత్ పంపిణీ తదితర రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాం‘ అని కృష్ణారెడ్డి వివరించారు. అటు ఆఫ్రికా, దక్షిణ అమెరికా తదితర ఖండాల్లో 18 పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామన్నారు. డిజిన్వెస్ట్‌మెంట్ సంస్థలపై ఆసక్తి.. కేంద్ర పభుత్వం పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా వాటాలు విక్రయిస్తున్న సంస్థలను దక్కించుకోవడంపై కసరత్తు చేస్తున్నట్లు కృష్ణారెడ్డి చెప్పారు. బీఈఎంఎల్, షిప్పింగ్ కార్పొరేషన్, నీలాచల్ ఇస్పాత్ వంటి సంస్థల విషయంలో అర్హత కూడా సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. కొనుగోళ్లకు సంబంధించి అవసరాన్ని బట్టి ఏడాది, రెండేళ్ల వ్యవధిలో రూ. 15,000–20,000 కోట్ల దాకా నిధులు సమీకరించుకోవాలని భావిస్తున్నట్లు చెప్పా రు. విదేశాల నుంచి సమీకరించే నిధులను భారత్‌లోనే ఇన్వెస్ట్ చేస్తామని, విదేశాల్లో ఇన్వెస్ట్ చేసే యోచనేదీ తమకు లేదని కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. డెడ్‌లైన్ కన్నా ముందే జోజిలా టన్నెల్ పూర్తి.. శ్రీనగర్–లేహ్ మధ్యలో నిర్మిస్తున్న వ్యూహాత్మక జోజిలా టన్నెల్ ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువు కన్నా ముందే పూర్తి చేస్తామని కృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధితో స్థానికంగా ఉపాధి కల్పనకు, పర్యాటక రంగానికి ఊతం లభించగలదని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో టన్నెల్ ప్రాజెక్టుల అనుభవంతో, కాంపిటీటివ్‌గా బిడ్ చేసి జోజిలా ప్రాజెక్టు దక్కించుకున్నామని ఆయన వివరించారు. ప్రస్తుతం తమ సంస్థలో 35,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారని, వివిధ ప్రాజెక్టుల్లో మూడు లక్షల మంది దాకా పనిచేస్తున్నారని కృష్ణారెడ్డి వివరించారు. తమ ప్రాజెక్టుల అవసరాలకు సంబంధించి చిన్న, మధ్య తరహా సంస్థలతో కూడా కలిసి పనిచేస్తుండటం ద్వారా వాటికి కూడా తోడ్పాటు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని కృష్ణారెడ్డి చెప్పారు. చదవండి: ఒలెక్ట్రాకు మరో 150 బస్‌ల ఆర్డర్ -
ఏపీ: ‘మేఘా’ భారీ విరాళం
సాక్షి, అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న చర్యలను పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు సాయంగా పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వయంగా అందజేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా కృష్ణారెడ్డి ప్రశంసించారు. యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రభుత్వం యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసి కరోనా మహమ్మారిని కట్టడి చేస్తోందన్నారు. మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైన వెంటనే అప్రమత్తం కావడంతో పాటు లాక్డౌన్ ప్రకటించడంతో వైరస్ తీవ్రత తగ్గిందని వివరించారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తమ వంతు సాయం అందించాలన్న ఉద్దేశంతో విరాళం అందజేసినట్లు తెలిపారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా రూ.5 కోట్ల విరాళాన్ని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. సిద్దార్థ విద్యా సంస్థల ఔదార్యం సిద్దార్థ విద్యా సంస్థల యాజమాన్యం, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ రూ. 1.30 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, దేవినేని అవినాష్ సమక్షంలో సిద్దార్థ విద్యాసంస్థల కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, కోశాధికారి సూరెడ్డి వెంకటేశ్వరరావు శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ రూ. 20 లక్షల విరాళం కరోనా వ్యతిరేక పోరాటానికి మద్దతుగా సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రూ. 20 లక్షల విరాళం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రూ. 10 లక్షల చొప్పున విరాళం అందించాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు అండగా నిలిచేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. (సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ) -
అన్నీతానైన ‘మేఘా’ కృష్ణారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కన్నెపల్లిలోని మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రంలో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి, డెరైక్టర్ బి.శ్రీనివాసరెడ్డి అన్నీ తామై వ్యవహరించారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్‌లకు కన్నెపల్లి పంప్‌హౌస్ ఫోర్ బే, నీటి నిల్వ, నీటిని పంప్ చేసే విధానం, దాని నిర్మాణం తదితర విశిష్టతల గురించి వివరించారు. మోటార్ల పనితీరుపై వారి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం పంప్ హౌస్‌లో మోటార్స్ ఏర్పాటు చేసిన దిగువ ప్రాంతానికి గవర్నర్, ఇద్దరు సీఎంలను తీసుకెళ్లి మోటార్ల పనితీరు, వాటి సామర్థ్యం తదితర అంశాలను వివరించారు. ఆపై పంప్‌హౌస్ ఎగువ భాగానికి వచ్చి.. మోటర్లను కంప్యూటర్ ద్వారా సీఎం ఆన్ చేశారు. అక్కడి నుంచి డిశ్చార్జ్ పాయింట్ వద్దకు వెళ్లి నీరు ఉబికివస్తున్న తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పంప్‌హౌస్‌ను వేగంగా నిర్మించడంపై మేఘా ఇంజనీర్లను సీఎం అభినందించారు. -
మిత్రధర్మం అంటే అవినీతిని సహించడం కాదు
♦ నీరు–ప్రగతిలో 20–22 శాతం అవినీతి ♦ పీఎంను జగన్ కలవడంపై టీడీపీ నాయకులు విమర్శలు మానుకోవాలి ♦ బీఈడీ, డీఈడీ కాలేజీల అక్రమాలపై ప్రత్యేక నిఘా ♦ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ కృష్ణారెడ్డి ఒంగోలు: మిత్రధర్మం అంటే జరుగుతున్న అవినీతిని చూస్తూ ఊరుకోవడం కాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిత్రధర్మం ఉల్లంఘిస్తున్నామని టీడీపీ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. మోదీ అంటే పార్టీ నాయకుడు కాదని, సాక్షాత్తు దేశ ప్రధాని అయినపుడు ఆయనను ప్రతిపక్ష నేత కలుసుకోవడంపై రాద్దాంతం చేయడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. చివరకు ఎంఎల్ఏలు సైతం ఈ వ్యవహారంపై మాట్లాడడం వారి విజ్ఞతకే వదిలివేస్తున్నామన్నారు. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నీరు–ప్రగతిలో ఏకంగా 20–22 శాతం కమీషన్లకు అధికారులు పాల్పడుతున్నారని, ఇక కాంట్రాక్టర్ వాటా తదితరాలు కలుపుకుంటే మొత్తం అవినీతి మయంగానే కనిపిస్తుందన్నారు. జిల్లాలో జరుగుతున్న ఈ అవినీతిని తాము గుర్తించి రాష్ట్ర పార్టీ దృష్టికి, కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత బీజేపీ నాయకులపై ఉందన్నారు. అవినీతి, అక్రమాలపై నిఘా.. జిల్లాలోని అనేక బీఈడీ, డీఈడీ కాలేజీల్లో అక్రమాలు రాజ్యమేలుతున్నాయని, ఒకే వ్యక్తి ఒకే స్థలంలో అనేక కాలేజీలు నిర్వహిస్తూ చివరకు కనీసం విద్యార్థులు కూడా లేకుండా కాలేజీలను నిర్వహిస్తున్నారంటూ తమకు ఫిర్యాదులు వస్తున్నాయని కృష్ణారెడ్డి అన్నారు. ఒక్కో వ్యక్తి బినామీ పేర్లతో పదులకొద్డీ కాలేజీలు నిర్వహిస్తున్నారని, అదే విధంగా ఒకే స్థలాన్ని చూపించి కూడా అనేక కాలేజీలకు గుర్తింపులు పొందుతున్నారన్నారు. అవినీతికి అలవాటుపడిన అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని, ఈ క్రమంలో వాటి నిగ్గుతేల్చేందుకు భారతీయ జనతా పార్టీ ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలో మొత్తం 112 బీఈడీ, 141 డీఈడీ కాలేజీలు ఉన్నాయని, అన్ని కాలేజీలను తప్పకుండా పరిశీలించి సమగ్ర నివేదికను యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్‌కు, రాష్ట్ర గవర్నర్‌కు, కేంద్ర మానవ వనరుల శాఖామంత్రికి ఫిర్యాదు చేయనున్నామన్నారు. ఒడిస్సా, ఉత్తరప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రకాశం జిల్లాలో సీట్లు పొందడం, ఆపై పరీక్షల సమయంలో మాత్రమే వారు హాజరుకావడం చూస్తుంటే విద్య వ్యాపారంగా మారి ఎంతగా దిగజారిపోయిందో అర్థం అవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా ఇన్‌ఛార్జి కందుకూరి సత్యన్నారాయణ మాట్లాడుతూ మిత్రధర్మం అంటున్న తెలుగుదేశం పార్టీ కనీసం కేంద్రం విడుదల చేస్తున్న పథకాలకు సైతం తన పేర్లు పెట్టుకోవడం తప్ప ఏనాడు బీజేపీతో చర్చించకపోవడం బాధాకరమన్నారు. కనీసం నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో కూడా తమ పార్టీతో చర్చించకపోవడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ప్రధానిని కలవడంపై తెలుగుదేశం నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు వారి కుత్సిత బుద్దికి నిదర్శనమన్నారు. టీడీపీలో ఉన్న ఈ ఆలోచనా విధానం వల్లే నేడు రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. ఇప్పటికైనా మిత్రధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని జరుగుతున్న లోపాలను సవరించుకోవడానికి యత్నించాలే తప్ప బీజేపీని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకుంటే సహించేదిలేదని స్పష్టంచేశారు. ఈనెల 25న విజయవాడలో అమిత్‌షా ఆధ్వర్యంలో జరిగే బహిరంగసభకు జిల్లా నుంచి కనీసంగా 6 వేల మంది బూత్ కమిటీ సభ్యులు తరలివెళ్లనున్నట్లు తెలిపారు. సమావేశంలో బీజేపీ నాయకులు బి.మీనాకుమారి, విన్నకోట సురేష్, ఖలీపాతుల్లాభాషా తదితరులు పాల్గొన్నారు.