ప్రమాదానికి గురైన పడవను తీరానికి తీసుకొస్తున్న దృశ్యం
2015 జూలై 14...
గోదావరి పుష్కరాలు ప్రారంభమైన రోజు.. అంతా కోలాహలం.. సీఎం రాకతో భక్తులపై ఆంక్షలు, ఒక్కసారిగా తోపులాట.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా పుష్కరస్నానం చేసిన రాజమండ్రి పుష్కరఘాట్‌లో తొక్కిసలాట జరిగి 29 మంది దుర్మరణం. పలువురికి గాయాలు.
2017 నవంబర్ 12
ఈసారి కృష్ణా తీరం.. ఉండవల్లిలో నది చెంతన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండే చోటుకు అది కూత వేటు దూరం. సీఎం నివాసానికి ఆవలి తీరంలో పడవ బోల్తా పడిన ప్రమాదంలో 21 మంది మృత్యువాత. సామాన్యుల సంచారంపై సవాలక్ష ఆంక్షలు, నిత్యం పోలీస్ పహారా ఉండే ఇక్కడ ఎలాంటి అనుమతి లేకుండా అక్రమ బోట్లను నడుపుతున్నారంటే ప్రభుత్వ పెద్దల అండదండలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. గోదావరి పుష్కరాల దుర్ఘటనపై చర్యలు లేకుండా కమిటీతో సరిపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అదేవిధంగా కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రమాదానికి గురైన పడవను అధికారులు ముందే అడ్డుకున్నారంటూ ఓ వీడియోను ప్రచారంలోకి తెస్తోంది. ఇన్నేళ్లుగా జనం ప్రాణాలను బలిపెట్టి ఎలా తిరగనిచ్చారో చెప్పకుండా భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా నివారిస్తామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు.
సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా నదిలో పవిత్ర సంగమం ప్రాంతానికి చేరువలో పడవ బోల్తా పడిన ఘటనలో 21 మంది దుర్మరణం చెందటం వెనక రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం దాగుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా నది సాక్షిగా ప్రైవేట్ బోటింగ్ మాఫియా మూడేళ్లుగా యథేచ్ఛగా కొనసాగేందుకు ప్రభుత్వ పెద్దల స్థాయి నుంచే నిర్వాహకులకు సహకారం అందింది. బోటింగ్ దందా వెనుక కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులు ఉన్నట్లు తెలిసినా నోరు మెదపలేని దుస్థితి అధికార యంత్రాంగానిది. తమ అవినీతి, వైఫల్యాలను కప్పిపుచ్చి ప్రమాద తీవ్రతను తగ్గించి చూపేందుకు ప్రభుత్వం సామాజిక మాధ్యమాల వేదికగా అసత్య ప్రచారానికి తెరతీసింది. ఏకంగా పర్యాటకులదే తప్పు అనే రీతిలో అనైతిక ప్రచారానికి దిగజారుతోంది. పున్నమి ఘాట్ వద్ద అధికారులు వద్దని చెబుతున్నా పర్యాటకులు వినిపించుకోకుండా బోటు ఎక్కారంటూ మంత్రి అఖిలప్రియ పేర్కొనడం గమనార్హం.
ప్రభుత్వ అండతో బోటింగ్ మాఫియా
కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన టీడీపీ మంత్రుల బినామీలే బోటింగ్ మాఫియాను శాసిస్తున్నారు. జనం ప్రాణాలతో చెలగాటమాడుతూ కోట్లు ఆర్జిస్తున్నారు. నిబంధనల ప్రకారం బోట్లకు జలవనరులు, రెవెన్యూ, అగ్ని మాపకశాఖల నుంచి అనుమతి ఉండాలి. బోటు పరిమాణం, డిజైన్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో జలవనరుల శాఖ చూడాలి. నదిలో రూట్‌మ్యాప్ సర్వే చేయాలి. వాటిపై సంతృప్తి చెందితేనే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తుంది. ఇక జలక్రీడలు, సాహస క్రీడలకు అనుమతించాలంటే మరిన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అగ్ని మాపక పరికరాలు సరిగా ఉన్నాయో లేదో చూడాలి. సీసీ కెమెరాలు, ప్రయాణికుల భద్రత ఎలా ఉందన్నది రెవెన్యూ శాఖ చూడాలి.
లైఫ్ జాకెట్లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పరిశీలించి ఆ మూడు శాఖలు అనుమతిస్తేనే పర్యాటక శాఖ లైసెన్సు ఇవ్వాలి. కానీ అవేమీ లేకుండానే బోట్లను నదిలో తిప్పుతున్నా పర్యాటక శాఖ అభ్యంతరం చెప్పలేదు. కృష్ణా నదిలో చిన్నా పెద్దా కలిపి దాదాపు 300బోట్లు ఉన్నాయి. వాటిలో 90శాతానికిపైగా బోట్లకు ఎలాంటి అనుమతి లేదు. నదీ జలాల్లో సాహస క్రీడలను కూడా నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇద్దరు మంత్రులు బినామీలు కావడంతో అక్రమ బోటింగ్ కార్యకలాపాలపై అధికారులు ఉదాసీనంగా ఉండిపోయారు.
ఆపరేటర్లు మంత్రికి సన్నిహితులు
అక్రమ బోటింగ్ కార్యకలాపాలకు జలవనరుల శాఖదే ప్రధాన బాధ్యత. విజిలెన్స్ శాఖ సీజ్‌చేసి అప్పగించిన బోట్లను జలవనరుల శాఖ విడిచిపెట్టేసింది. కృష్ణా నదిలో అనుమతి లేని బోట్లు తిరుగుతున్నా ఏనాడు పట్టించుకోలేదు. బోటు ఆపరేటర్లు మంత్రి దేవినేని ఉమాకు సన్నిహితులు కావడంతోనే చూసీచూడనట్లు వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్యాటక శాఖలో కొందరు అధికారులు కూడా ఈ బోటింగ్ మాఫియాలో భాగస్వాములుగా ఉన్నారని స్పష్టమవుతోంది. 2014 నుంచి చాలా రోజుల పాటు పర్యాటక శాఖను స్వయంగా సీఎం చంద్రబాబే దాదాపు మూడేళ్ల పాటు పర్యవేక్షించటం గమనార్హం.
కప్పిపుచ్చేందుకు యత్నాలు
పడవ ప్రమాదం వెనుక తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం మల్ల గుల్లాలు పడుతోంది. ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినప్పటికీ బోటు ఆపరేటర్లను అరెస్టు చేయలేదు. తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి సరిపుచ్చుతోంది. బోటు నడుపుతున్న సారంగి ఏమయ్యాడనే కోణంలో ఇంతవరకు పోలీసులు దర్యాప్తు చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. అతడు ఉద్దేశపూర్వకంగానే పరారయ్యేలా సహకరించారని స్పష్టమవుతోంది. గతంలో లారీ డ్రైవర్‌గా ఉన్న అతడిని బోటు డ్రైవర్‌గా నియమించారని తెలుస్తోంది.
వీడియోపై అనుమానాలు..
ప్రమాదానికి గురైన బోటును అధికారులు ఆదివారం ఉదయం దుర్గాఘాట్‌లో అడ్డుకున్నారంటూ ప్రభుత్వం ఓ వీడియోను ప్రచారంలోకి తెచ్చింది. పర్యాటక శాఖ మంత్రి అఖిల ప్రియ స్వయంగా ఆ విషయాన్ని ప్రస్తావించారు. ‘అనుమతిలేని బోటును ఆదివారం ఉదయం దుర్గా ఘాట్‌కు ఆపరేటర్ తీసుకువస్తే మా అధికారులు అడ్డుకున్నారు. కానీ ఆ ఆపరేటర్ వారికి తెలియకుండా సాయంత్రం పున్నమి ఘాట్‌కు తీసుకువచ్చి పర్యాటకులను ఎక్కించుకున్నారు. దాంతోనే ప్రమాదం జరిగింది.
పున్నమి ఘాట్ వద్ద అధికారులు వద్దని చెబుతున్నా పర్యాటకులు వినిపించుకోకుండా బోటు ఎక్కారు’ అని అఖిలప్రియ పేర్కొన్నారు. అనంతరం పర్యాటక శాఖ సీసీ టీవీలో రికార్డు అయిన వీడియోను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారంలోకి తెచ్చింది. అయితే అది ఎప్పటిదో పాత వీడియో అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇద్దరు ప్రయాణించే ఓ స్పీడ్ బోటును ఓ అధికారి జట్టీ వద్ద తాడుతో కడుతున్నట్లుగా ఉంది. అసలు అనుమతి లేని పడవ ప్రయాణికులతో తిరుగుతుంటే దుర్గాఘాట్ వద్దే సీజ్ చేయకుండా పున్నమిఘాట్ వరకు ఎందుకు రానిచ్చారన్న ప్రశ్నకు జవాబు లేదు.
Comments
Please login to add a commentAdd a comment