బొబ్బర్లంక(ఆత్రేయపురం), న్యూస్‌లైన్ : తెల్లవారగానే ఆ మత్స్యకారుడు వల చేతపట్టుకుని.. పడవపై గోదావరిలో చేపల వేటకు వెళ్తాడు. సాయంత్రం వరకు వలతో వేటాడిన చేపలే అతడి సంపాదన. కుటుంబానికి జీవనాధారమైన ఆ వలే తుదకు అతడిని పొట్టనబెట్టుకుంది. గోదావరిలో సహచరులతో కలిసి చేపలను వేటాడేందుకు వెళ్లిన అతడు పడవ మునిగిన సంఘటనలో మరణించాడు. ఇంతకాలం అతడి కడుపు నింపిన వలే.. చేతికి చిక్కుకోవడంతో గోదారిలోనే అతడి బతుకు తెల్లారిపోయింది.
మండలంలోని బొబ్బర్లంక గ్రామానికి చెందిన మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లి.. గోదావరిలో పడవ మునగడంతో మరణించాడు. గురువారం ఉదయం పిచ్చుకలంక వద్ద గోదావరిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. బొబ్బర్లంకలోని జల్లి వారి పేటకు చెందిన చిట్టా సత్యనారాయణ(45) గోదావరిలో చేపల వేట చేస్తుంటాడు. ఎప్పటిలాగే గురువారం ఉదయం చిట్టా సత్యనారాయణతో పాటు అతడి తమ్ముడు చిట్టా జాన్, మరో వ్యక్తి వీరవల్లి సత్యనారాయణ పడవలో చేపల వేటకు వెళ్లారు. బొబ్బర్లంక శివారు పిచ్చుకలంక వద్దకు చేరుకునే సరికి పడవలో నీరు చేరి మునిగిపోయింది. అపాయాన్ని గమనించిన చిట్టా జాన్, వీరవల్లి సత్యనారాయణ గోదావరిలోకి దూకి, ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. పడవ నుంచి దూకే సమయంలో చిట్టా సత్యనారాయణ చేతికి వల చిక్కుకుంది. దానిని విడిపించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
అప్పటికే పడవ మునిగిపోవడంతో, అందులోనే చిట్టా సత్యనారాయణ జల సమాధి అయ్యాడు. ప్రాణాలతో బయటపడ్డ జాన్, సత్యనారాయణ వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని వలలు విసిరి చిట్టా సత్యనారాయణ మృతదేహాన్ని పట్టుకుని, ఒడ్డుకు చేర్చారు. సంఘటన స్థలానికి చేరుకున ్న మృతుడి భార్య దీవెన, బంధువులు రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. ఎస్సై కేవీఎస్ సత్యనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. మృతుడు సత్యనారాయణకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబానికి జీవనాధారమైన సత్యనారాయణ మృతిచెందడంతో తమకు దిక్కెవరంటూ భార్య విలపించింది. అందరితో కలివిడిగా ఉండే సత్యనారాయణ మృతితో జల్లివారిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పిచుకల్లంక వద్ద గోదావరిలో మునిగిన పడవ
Published Fri, Sep 13 2013 4:00 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM
Advertisement
Advertisement