
త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం
రాజమండ్రి సిటీ : శివరాత్రి సందర్భం గా గోదావరిలో పుణ్యస్నానాలకు వెళ్లిన పలువురు మహిళలు ప్రయాణిస్తున్న పడవ బోల్తాపడింది. ఈ ప్రాంతంలో తక్కువ లోతు ఉండడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. రాజమండ్రి రూరల్ ప్రాంతం నామవరానికి చెందిన సుమారు 50 మంది పుణ్యస్నానాలు చేసేందుకు గౌతమఘాట్‌కు చేరుకున్నారు. అక్కడ నీరు అపరిశుభ్రంగా ఉండడంతో గోదావరి మధ్యలోని కేతావారి లంకలో దిగి స్నానం చేయాలని భావించారు. చేపలు వేటాడే ఇంజన్ నావ ను మనిషికి రూ.25 చొప్పున మాట్లాడుకుని వారు బయలుదేరారు. లంకలో దిగి స్నానాలు చేసిన అనంతరం తిరిగి వస్తుండగా పడవ బోల్తాపడింది. అయితే పడవ బోల్తా పడిన ప్రదేశం దిబ్బ కావడంతో పెద్దలోతు లేదని, అందుకే అందరూ సురక్షితంగా బయటపడ్డారని చెబుతున్నారు.
ఇదే ప్రమాదం 4 మీటర్ల ముందు జరిగి ఉంటే ఘోరప్రమాదం జరిగేదంటున్నారు. పడవ చిన్నది కావడం, నడిపే వ్యక్తి అనుభవలేమి వల్ల ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ప్రారంభంలోనే ఇంజన్ వేగం పెంచడంతో పడవ బోల్తా పడిందని మహిళలు తెలిపారు. గోదావరిలో ప్రయాణికులను తరలించేందుకు అనుమతులు లేనప్పటికీ భక్తుల ప్రాణాలతో చెలగామాడుతూ పడవలు నడపడాన్ని నిరోధించకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన తరువాత చర్యలు చేపట్టే కన్నా ముందే శ్రద్ధ వహిస్తే ఇబ్బందులుండవని పలువురు అభిప్రాయపడ్డారు. టూటౌన్ ఎస్సై శంకర్ సంఘటన స్థలానికి చేరుకుని భక్తులను మరో పడవపై ఒడ్డుకు చేర్చే చర్యలు చేపట్టారు.