
తమ పెరట్లోనే రాజధాని ఉండాలంటే ఎట్లా ?
గుంటూరు: భూములు, నీటి లభ్యత ఉన్న చోటు రాష్ట్ర రాజధానిని తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆంధ్రప్రదేశ్ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం గుంటూరు జిల్లా మాదలలో మొక్కల నాటే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం బొజ్జల మాట్లాడుతూ... రాష్ట్ర రాజధాని ఏర్పాటు ఎక్కడే అనే విషయంపై ప్రభుత్వం ఇంకా ఓ కొలిక్కి రాలేదని చెప్పారు. తమ పెరట్లోనే రాజధాని ఉండాలనుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
తమకు దగ్గరలోనే రాష్ట్ర రాజధాని ఉండాలని వివిధ ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారని విలేకర్ల అడిగిన ప్రశ్న మంత్రి బొజ్జలపై విధంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానిగా విజయవాడను ప్రభుత్వం ప్రకటించింది. అలాగే విజయవాడలోనే రాజధాని అంటూ ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా ప్రకటించారు. అయితే విజయవాడలో రాజధాని ఏర్పాటుపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
విజయవాడ - గుంటూరు నగరాల మధ్య కేవలం 500 ఏకరాలు మాత్రమే ప్రభుత్వం స్థలం ఉందని... కర్నూలు జిల్లాలో అయితే వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని కృష్ణమూర్తి వెల్లడించారు. దాంతో ప్రతి ఒక్కరు తమ ప్రాంతానికి దగ్గరలోనే రాజధాని ఏర్పాటు చేయాలని వస్తున్న డిమాండ్పై బొజ్జల తీవ్ర అసంతృప్తి చేశారు.