పెనుకొండ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోడ్డు ప్రమాద బాధితుడిని పరామర్శిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు అనంత వెంకటరామిరెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి, వెన్నపూస గోపాల్‌రెడ్డి, నదీమ్ అహమ్మద్, డాక్టర్ పి.వి.సిద్ధారెడ్డి తదితరులు
అతివేగం మూడు గ్రామాల్లో పెనువిషాదం నింపింది. రెండు బొలెరో వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. ఈ ఘోర ప్రమాదంతో పెనుకొండ ప్రాంతం ఉలిక్కిపడింది. మృతులు, క్షతగాత్రుల బంధువులు, కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగణం మిన్నంటింది.
పెనుకొండ/పెనుకొడ రూరల్/ రొద్దం: ఘోర ప్రమాదంతో పెనుకొండ ప్రాంతం శోకసంద్రంలో మునిగిపోయింది. రొద్దం మండలం లక్సానుపల్లి, ఎల్.తిమ్మాపురం గ్రామాలకు చెందిన దాదాపు 26 మంది శుక్రవారం ఉదయం టాప్‌లెస్ బొలెరో వాహనంలో అనంతపురం బయల్దేరారు. పెనుకొండ మండలం సత్తారుపల్లి వద్దకు రాగానే అరటిగెలల లోడుతో మడకశిరకు వెళుతున్న మరో బొలెరో వాహనం ఎదురుగా ఢీకొంది. టాప్‌లెస్ వాహనం బోల్తాపడటంతో ప్రాణనష్టం భారీగా సంభవించింది. ప్రమాదస్థలిలో ఆరుగురు, ఆస్పత్రిలో ఒకరు, మార్గమధ్యంలో మరొకరు మరణించారు. 15 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల ఆర్తనాదాలు, బంధువుల రోదనలతో ఆస్పత్రిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
డాక్టర్ రోహిల్ ఆధ్వర్యంలో వైద్యసేవలందించారు. మధ్యాహ్నం డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ దివాకర్‌బాబు పరిస్థితిని సమీక్షించి మెరుగైన వైద్యం కోసం కొంతమందిని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ఈ ప్రమాదంలో బొలెరో వాహనాల డ్రైవర్లు సురక్షితంగా బయటపడి సంఘటన స్థలం నుంచి పరారయ్యారు. రోడ్డు ప్రమాద విషయం తెలియగానే ఆర్డీఓ ఓబులేసు, ఎమ్మెల్యే బీకే పార్థసారథి, వైఎస్సార్‌సీపీ నాయకులు శ్రీకాంతరెడ్డి, న్యాయవాది భాస్కరరెడ్డి, మాజీ సర్పంచ్‌లు సుధాకరరెడ్డి, చలపతి, రాజ్‌గోపాల్‌రెడ్డి కొండల రాయుడు, వైశాలి జయప్ప, ఎంపీటీసీ రామ్మోహన్‌రెడ్డి, అనితా శ్రీనివాసరెడ్డి, ఎస్.బి.శీనా, నాయుడు తదితరులు పెనుకొండ ఆస్పత్రికి వెళ్లి మృతుల, క్షతగాత్రుల కుటుంబాలను పరామర్శించారు. చంద్రన్న బీమా కింద ఆర్థికసాయం అందించే విషయమై ఎమ్మెల్యే ఆరా తీశారు.
ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు..
లక్సానుపల్లి, ఎల్.తిమ్మాపురం గ్రామాలకు చెందిన శ్రీనివాసులు, గంగప్ప, చంద్రశేఖర్, కొండప్ప, రామాంజినరెడ్డి, వెంకటరమణప్ప, గంగాధర్, గోవిందప్ప, ప్రభాకరరెడ్డి, లింగప్ప, దాసరిక్రిష్టప్ప, రామచంద్రప్ప, గోవిందశెట్టి, ఈ వెంకటరమణప్ప, ముద్దప్ప తదితరులు చికిత్స పొందుతున్నారు.
వైఎస్సార్‌సీపీ నేతల పరామర్శ
ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, అనంతపురం, హిందూపురం పార్లమెంటుల అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, మాలగుండ్ల శంకరనారాయణ, హిందూపురం పార్లమెంటు సమన్వయన్వయకర్త నదీమ్‌హమ్మద్, కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పి.వి.సిద్దారెడ్డి తదితరులు లక్సానుపల్లి, ఎల్.తిమ్మాపురం గ్రామాలకు చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. అంతకుముందు పెనుకొండ, అనంతపురం ఆస్పత్రులకూ వెళ్లి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మృతుల కుటంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. నేతల వెంట వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌లు శ్రీకాంతరెడ్డి, వెంకటరత్నం, ఫక్రోధ్ధిన్, నారాయణరెడ్డి, జయరాం, తయూబ్, మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ నాగలూరు బాబు, బ్రహ్మసముద్రం శ్రీనివాసులు, మాజీ సర్పంచ్‌లు సుధాకరరెడ్డి, చలపతి, రాజ్‌గోపాలరెడ్డి, ఎంపీటీసీలు రామ్మోహన్‌రెడ్డి, అనితా శ్రీనివాçసరెడ్డి సింగిల్ విండో అధ్యక్షులు కరావులపల్లి బాబు, శంకరరెడ్డి, రొద్దం చంద్రశేఖర్, రమణ, ప్రభు, అశోక్, కలిపి శీనా, శివారెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment