bolero accident
-
అల్లూరి జిల్లా: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పాడేరు ఘాట్‌రోడ్డులో ఓ బొలేరో వాహనం లోయలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. పాడేరు ఘాట్ రోడ్ ఏసుప్రభు కార్నర్ సమీప మలుపులో బుధవారం రాత్రి సమయంలో ఓ బొలెరో వాహనం లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక, వీరంతా ఒడిశాకి చెందిన వలస కూలీలుగా గుర్తించారు. మృతిచెందిన వారిలో ఒక బాలిక కూడా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బొలేరో వాహనంలో 30 మంది ఉన్నట్టు సమాచారం. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. -
దైవ దర్శనానికి వెళ్తూ జీపు బోల్తా.. ఆరుగురు యాత్రికులు మృతి
బెళగావి: దైవ దర్శనానికి వెళ్తూ అనంతలోకాలకు చేరుకున్నారు యాత్రికులు. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులు హనుమవ్వ(25), దీప(31), సవిత(17), సుప్రీత(11), ఇందిరవ్వ(24), మారుతి(42)గా గుర్తించారు పోలీసులు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికల సాయంతో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. హులంద గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సౌందత్తి యల్లమ్మ దేవాలయానికి వెళ్తున్నారు. బొలెరో గూడ్స్ వాహనంలో మొత్తం 23 మంది యాత్రికులు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలోనే మూల మలుపు వద్ద వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో మర్రి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: కోవిడ్ అలర్ట్: బెంగాల్లో నలుగురికి చైనా వేరియంట్ బీఎఫ్7 -
రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి
జైపూర్ : రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బొలెరో వాహనాన్ని ట్రక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే 11 మంది దుర్మరణం చెందారు. అలాగే ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఆరుగురు మహిళలు, నాలుగురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను జోధ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బలోత్రా ఫలోడి రహదారిపై శనివారం ఈ ప్రమాదం సంభవించింది. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో దెబ్బతిన్న వాహనాలను పక్కకు తీసి.. శిథిలాల నుంచి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. (కార్తీక్ హత్య కేసు విచారణ వేగవంతం) వేగంగా దూసుకొచ్చిన ట్రక్.. జీపును బలంగా ఢీకొట్టడంతో జీపు మీదకు వాహనం చొచ్చుకెళ్లింది. అతి వేగమే ప్రమాదానికి కారణమయ్యి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం ట్వీట్ చేశారు. ‘జోధ్‌పూర్‌లో జరిగిన ప్రమాదం గురించి తెలిసి చాలా బాధపడ్డాను. తమ వాళ్లను కోల్పోయిన వారికి నా ప్రగాడ సానుభూతి తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’. అంటూ ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేశారు. (‘అమ్మా.. అలసటగా ఉందమ్మా.. నిద్రపోతాను’) -
బతుకు జీవుడా..
విజయనగరం, గుమ్మలక్ష్మీపురం: వారంతా గిరిశిఖర గ్రామాల్లో నివశించే గిరిజనులు. పండించిన ఫలసాయాలు, సేకరించిన అటవీ ఉత్పత్తులను మైదాన ప్రాంతంలో జరిగిన సంతలో విక్రయించి.. వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి గ్రామాలకు తిరుగుముఖం పట్టారు. ఈ క్రమంలో వాహనంలో వస్తుండగా బ్రేకులు ఫెయిలై బోల్తాపడడంతో 20 మంది గాయపడగా... ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే... గుమ్మలక్ష్మీపురం మండలంలోని తోట, గోరటి గ్రామాలకు చెందిన గిరిజనులు గుమ్మలక్ష్మీపురంలో బుధవారం జరిగిన సంతకు వెళ్లి అటవీ ఉత్పత్తులు విక్రయించి తమకు కావాల్సిన సరకులు కొనుగోలు చేశారు. తిరిగి స్వగ్రామాలకు వెళ్లేందుకు పెదఖర్జ గ్రామానికి చెందిన పాండుసాహు మురళికి చెందిన బొలేరో పికప్ ( ఏపీ 35వై 3745) వాహనం ఎక్కారు. సరిగ్గా పెదఖర్జ పంచాయతీ చప్పగూడ గ్రామం దాటిన తర్వాత ఘాట్‌రోడ్డు నాలుగో మలుపు వద్ద వాహనం బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో వాహనం వెనక్కి వెళ్లిపోతుండడంతో గిరిజనులు హాహాకారాలు చేశారు. పది మీటర్ల వరకు వెనక్కి వచ్చిన వాహనం బోల్తా పడి ఓ రాయిని ఆనుకుని నిలిచింది. వెంటనే ప్రయాణికులు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ప్రమాదంలో తోట గ్రామానికి చెందిన బిడ్డిక లచ్యయ్య, బిడ్డిక రామారావు, మండంగి గీత, బిడ్డిక ఇందు, బిడ్డిక చిన్నమ్మి, నిమ్మక లుద్దు, బిడ్డిక జిన్న, నిమ్మక వీర, బిడ్డిక పద్మావతి.. గోరటి గ్రామానికి చెందిన బిడ్డిక గణపతి, మండంగి దివ్య, నిమ్మక శ్రీరాం, తోయక దమయంతి, బిడ్డిక ప్రసాద్, బిడ్డిక సాంతమ్మ, బిడ్డిక కుద్ద, తోయక మహేష్, తదితర 20 మంది గాయపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న సమీప గ్రామస్తులు ఎల్విన్‌పేట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ బమ్మిడి శ్రీనివాసరావుతో పాటు ఇతర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, క్షత్రగాత్రులను హుటాహుటిన భద్రగిరి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించిన తర్వాత తీవ్రంగా గాయపడిన బిడ్డిక లచ్చయ్య, బిడ్డిక రామారావు, మండంగి గీతలను మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఎల్విన్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెను ప్రమాదమే తప్పింది. గోరటి ఘాట్‌రోడ్డులో బొలేరో పికప్ వాహనం బోల్తాపడి రోడ్డు అంచున గల రాయిని తాకుతూ నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. రాయి అడ్డులేకపోతే సుమారు 300 అడుగుల లోతులో ఉన్న లోయలో వాహనం పడిపోయేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘాట్‌రోడ్డు కావడంతో ఆర్టీసీ బస్సులు వెళ్లకపోవడంతో గిరిజనులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించక తప్పడం లేదు. గతేడాది డిసెంబర్ 8న కూడా ఇదే స్థలంలో బ్రేకులు ఫెయిలై ఆటో లోయలో పడిపోవడంతో పార్వతీపురానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి మృతి చెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. -
పెనువిషాదం : వైఎస్సార్సీపీ నేతల పరామర్శ
అతివేగం మూడు గ్రామాల్లో పెనువిషాదం నింపింది. రెండు బొలెరో వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. ఈ ఘోర ప్రమాదంతో పెనుకొండ ప్రాంతం ఉలిక్కిపడింది. మృతులు, క్షతగాత్రుల బంధువులు, కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగణం మిన్నంటింది. పెనుకొండ/పెనుకొడ రూరల్/ రొద్దం: ఘోర ప్రమాదంతో పెనుకొండ ప్రాంతం శోకసంద్రంలో మునిగిపోయింది. రొద్దం మండలం లక్సానుపల్లి, ఎల్.తిమ్మాపురం గ్రామాలకు చెందిన దాదాపు 26 మంది శుక్రవారం ఉదయం టాప్‌లెస్ బొలెరో వాహనంలో అనంతపురం బయల్దేరారు. పెనుకొండ మండలం సత్తారుపల్లి వద్దకు రాగానే అరటిగెలల లోడుతో మడకశిరకు వెళుతున్న మరో బొలెరో వాహనం ఎదురుగా ఢీకొంది. టాప్‌లెస్ వాహనం బోల్తాపడటంతో ప్రాణనష్టం భారీగా సంభవించింది. ప్రమాదస్థలిలో ఆరుగురు, ఆస్పత్రిలో ఒకరు, మార్గమధ్యంలో మరొకరు మరణించారు. 15 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల ఆర్తనాదాలు, బంధువుల రోదనలతో ఆస్పత్రిలో విషాదఛాయలు అలుముకున్నాయి. డాక్టర్ రోహిల్ ఆధ్వర్యంలో వైద్యసేవలందించారు. మధ్యాహ్నం డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ దివాకర్‌బాబు పరిస్థితిని సమీక్షించి మెరుగైన వైద్యం కోసం కొంతమందిని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ఈ ప్రమాదంలో బొలెరో వాహనాల డ్రైవర్లు సురక్షితంగా బయటపడి సంఘటన స్థలం నుంచి పరారయ్యారు. రోడ్డు ప్రమాద విషయం తెలియగానే ఆర్డీఓ ఓబులేసు, ఎమ్మెల్యే బీకే పార్థసారథి, వైఎస్సార్సీపీ నాయకులు శ్రీకాంతరెడ్డి, న్యాయవాది భాస్కరరెడ్డి, మాజీ సర్పంచ్‌లు సుధాకరరెడ్డి, చలపతి, రాజ్‌గోపాల్‌రెడ్డి కొండల రాయుడు, వైశాలి జయప్ప, ఎంపీటీసీ రామ్మోహన్‌రెడ్డి, అనితా శ్రీనివాసరెడ్డి, ఎస్.బి.శీనా, నాయుడు తదితరులు పెనుకొండ ఆస్పత్రికి వెళ్లి మృతుల, క్షతగాత్రుల కుటుంబాలను పరామర్శించారు. చంద్రన్న బీమా కింద ఆర్థికసాయం అందించే విషయమై ఎమ్మెల్యే ఆరా తీశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు.. లక్సానుపల్లి, ఎల్.తిమ్మాపురం గ్రామాలకు చెందిన శ్రీనివాసులు, గంగప్ప, చంద్రశేఖర్, కొండప్ప, రామాంజినరెడ్డి, వెంకటరమణప్ప, గంగాధర్, గోవిందప్ప, ప్రభాకరరెడ్డి, లింగప్ప, దాసరిక్రిష్టప్ప, రామచంద్రప్ప, గోవిందశెట్టి, ఈ వెంకటరమణప్ప, ముద్దప్ప తదితరులు చికిత్స పొందుతున్నారు. వైఎస్సార్సీపీ నేతల పరామర్శ ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, అనంతపురం, హిందూపురం పార్లమెంటుల అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, మాలగుండ్ల శంకరనారాయణ, హిందూపురం పార్లమెంటు సమన్వయన్వయకర్త నదీమ్హమ్మద్, కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పి.వి.సిద్దారెడ్డి తదితరులు లక్సానుపల్లి, ఎల్.తిమ్మాపురం గ్రామాలకు చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. అంతకుముందు పెనుకొండ, అనంతపురం ఆస్పత్రులకూ వెళ్లి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మృతుల కుటంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. నేతల వెంట వైఎస్సార్సీపీ కన్వీనర్లు శ్రీకాంతరెడ్డి, వెంకటరత్నం, ఫక్రోధ్ధిన్, నారాయణరెడ్డి, జయరాం, తయూబ్, మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ నాగలూరు బాబు, బ్రహ్మసముద్రం శ్రీనివాసులు, మాజీ సర్పంచ్‌లు సుధాకరరెడ్డి, చలపతి, రాజ్గోపాలరెడ్డి, ఎంపీటీసీలు రామ్మోహన్‌రెడ్డి, అనితా శ్రీనివాçసరెడ్డి సింగిల్ విండో అధ్యక్షులు కరావులపల్లి బాబు, శంకరరెడ్డి, రొద్దం చంద్రశేఖర్, రమణ, ప్రభు, అశోక్, కలిపి శీనా, శివారెడ్డి తదితరులు ఉన్నారు. -
తెల్లారిన కూలీల బతుకులు
సాక్షి, గద్వాల: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో 28 మంది గాయపడ్డారు. పత్తి జిన్నింగ్ మిల్లులో రాత్రి షిఫ్టులో పనిచేసి వస్తున్న కూలీల బొలెరో వాహనం బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం పారుచర్ల వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గద్వాల పట్టణంలోని శ్రీ విజయలక్ష్మి మిల్లులో ధరూరు మండలం చిన్నపాడు, యములోనిపల్లి గ్రామాలకు చెందిన 35 మంది కూలీలు పనులకు వెళ్లారు. ఆదివారం నైట్ షిఫ్ట్‌లో పనిచేసి సోమవారం తెల్లవారుజామున బొలెరో వాహనంలో తిరుగు పయనమయ్యారు. యాజమాన్యమే వాహనం సమకూర్చగా.. ఒకేసారి అందరినీ పంపించాలనే ఉద్దేశంతో 35 మందిని ఎక్కించారు. ఇక 10 నిమిషాలు అయితే సొంతూరుకు చేరుకునే క్రమంలో గద్వాల మండలం గోనుపాడు శివారులోని పారుచర్ల స్టేజీ సమీపంలో తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో వాహనం బోల్తా పడింది. డ్రైవర్ సైతం కూలీలతో పాటే రాత్రి పనిచేసి ఉండటం.. ఆయన డ్రైవింగ్ చేసే క్రమంలో అలసటకు గురై నిద్రలోకి జారుకోవడంతో మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి బోల్తా పడిందని కూలీలు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో చిన్నపాడు గ్రామానికి చెందిన కమ్మరి లోహిత్(35), కమ్మరి గీతమ్మ (35), కోట్ల వెంకటన్న (40), కొత్తబావి వెంకటన్న(35) యమ్మినోనిపల్లికి చెందిన అరుణ(18) అక్కడికక్కడే మృతి చెందారు. 28 మందికి గాయాలయ్యాయి. వీరిలో 14 మందిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం వద్ద మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. ఎస్పీ విజయ్‌కుమార్, డీఎస్పీ సురేందర్‌రావు ఘటనా స్థలం వద్ద పరిస్థితిని సమీక్షించారు. కాగా, మిల్లు యజమాని నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని, పరిహారం చెల్లించే వరకు మృతదేహాలను కదిలించమని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఎస్పీ నచ్చజెప్పడంతో వారు శాంతించారు. -
అరకు లోయలో బొలేరో బోల్తా
సాక్షి, విజయనగరం : అరకు పర్యటనకు వెళ్లి వస్తున్న బొలేరో వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతగిరి నాలుగో టన్నల్ సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తామరపల్లి గ్రామానికి చెందిన వారు బొలేరో వాహనంలో అరకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో వాహనంలో ఉన్న 12 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం క్షతగాత్రులు శృంగవరపుకోట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
బొలెరో వాహనం బోల్తా..యువకుడి మృతి
కళ్యాణదుర్గం రూరల్ : పట్టణ సమీపంలోని బైపాస్‌రోడ్డులో బొలెరో వాహనం బోల్తా పడి అజయ్‌కుమార్(20) అనే యువకుడు మంగళవారం మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే.. పట్టణానికి చెందిన బోర్లు రామన్న కుమారుడు హర్షవర్ధన్, అజయ్‌కుమార్‌తో పాటు మరో నలుగురు కంబదూరు బైపాసు రోడ్డు నుంచి మల్లాపురం గ్రామం వైపు వెళ్తుండగా బొలెరో వాహనం టైర్లు పగలడంతో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న అజయ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా హర్షవర్ధన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శంకర్‌రెడ్డి తెలిపారు. -
అదుపు తప్పిన బొలెరో..
శ్రీకాకుళం: అతివేగంగా వచ్చి అదుపుతప్పిన ఓ బొలెరో వాహనం స్థానికుల్ని భయాందోళనకు గురిచేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఒడిశా నుంచి వైజాగ్ వైపు వెళుతున్న ఓ బొలెరో వాహనం లావేరు మండలం బుదుమూరు వద్ద అదుపుతప్పింది. దీంతో బొలెరో ఓ మహిళతో పాటు, పశువులను ఢీకొట్టింది. వాహనం మీదకు వస్తుండడంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. ఆ మహిళకు తీవ్ర గాయాలు కాగా, ఓ ఆవు మృత్యువాత పడింది. మరో మూడు ఆవులకు తీవ్ర గాయాలు అయ్యాయి. బొలెరోలో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా బయటపడ్డారు.