![accident in jogulamba jogulamba.. many died - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/8/gadwal-accident.jpg.webp?itok=KRLcoVAm)
సాక్షి, గద్వాల: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో 28 మంది గాయపడ్డారు. పత్తి జిన్నింగ్ మిల్లులో రాత్రి షిఫ్టులో పనిచేసి వస్తున్న కూలీల బొలెరో వాహనం బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం పారుచర్ల వద్ద చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. గద్వాల పట్టణంలోని శ్రీ విజయలక్ష్మి మిల్లులో ధరూరు మండలం చిన్నపాడు, యములోనిపల్లి గ్రామాలకు చెందిన 35 మంది కూలీలు పనులకు వెళ్లారు. ఆదివారం నైట్ షిఫ్ట్‌లో పనిచేసి సోమవారం తెల్లవారుజామున బొలెరో వాహనంలో తిరుగు పయనమయ్యారు. యాజమాన్యమే వాహనం సమకూర్చగా.. ఒకేసారి అందరినీ పంపించాలనే ఉద్దేశంతో 35 మందిని ఎక్కించారు.
ఇక 10 నిమిషాలు అయితే సొంతూరుకు చేరుకునే క్రమంలో గద్వాల మండలం గోనుపాడు శివారులోని పారుచర్ల స్టేజీ సమీపంలో తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో వాహనం బోల్తా పడింది. డ్రైవర్ సైతం కూలీలతో పాటే రాత్రి పనిచేసి ఉండటం.. ఆయన డ్రైవింగ్ చేసే క్రమంలో అలసటకు గురై నిద్రలోకి జారుకోవడంతో మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి బోల్తా పడిందని కూలీలు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో చిన్నపాడు గ్రామానికి చెందిన కమ్మరి లోహిత్(35), కమ్మరి గీతమ్మ (35), కోట్ల వెంకటన్న (40), కొత్తబావి వెంకటన్న(35) యమ్మినోనిపల్లికి చెందిన అరుణ(18) అక్కడికక్కడే మృతి చెందారు. 28 మందికి గాయాలయ్యాయి. వీరిలో 14 మందిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు.
ఘటనా స్థలం వద్ద మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. ఎస్పీ విజయ్‌కుమార్, డీఎస్పీ సురేందర్‌రావు ఘటనా స్థలం వద్ద పరిస్థితిని సమీక్షించారు. కాగా, మిల్లు యజమాని నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని, పరిహారం చెల్లించే వరకు మృతదేహాలను కదిలించమని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఎస్పీ నచ్చజెప్పడంతో వారు శాంతించారు.
Comments
Please login to add a commentAdd a comment