
పేలుడు జరిగిన ప్రదేశాన్ని చూపుతున్న రైతులు
చీడికాడ(మాడుగుల): అర్జునగిరిలో అడవిపందుల వేటకోసం పొలంలో అమర్చిన నాటుబాంబు పేలింది. ఈ ప్రమాదం నుంచి రైతులు త్రుటిలో తప్పించుకోగా, పెంపుడుకుక్క మృతి చెందింది. దీనికి సంబంధించి స్థానిక రైతులు అందించిన వివరాలిలా ఉన్నాయి.గ్రామానికి చెందిన అప్పన్నబంద ఇస్తువా కళ్లాలకు సమీపంలో గల గరువుల్లోకి సోమవారం సాయంత్రం రైతులు గెంజి అక్కులు,పెంటకోట చిన్నారి,శ్రీనులు... పశువులను మేతకు తోలుకెళ్లారు. వీరితో పాటు చిన్నారి పెంచుకుంటున్న కుక్క వెళ్లింది.
పెంటకోట సూరిబాబుకు చెందిన చెరకుతోట నరికి వేసిన గరువు గట్టు పక్కన అడవి పందుల వేటకోసం అమర్చిన నాటుబాంబును కుక్క నోటకరిచింది. వెంటనే అది పెద్ద శబ్దంతో పేలింది. దీంతో కుక్క ఎరిగిపడింది. సమీపంలో ఉన్న రైతులు ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు. వారు వెంటనే వెళ్లి పరిశీలించగా కుక్క తలభాగం తునాతునకలైంది. అప్పటి వరకు అదే గరువులో చిన్నారి మనమరాలైన మేఘన,ఆశిన్ తిరిగారు.వీరితో పాటు పశువులు ఉన్నాయి.అదృష్టం కొద్దీ ఆబాంబును వీరు తొక్కలేదని రైతులు తెలిపారు.
అడవి పందుల వేట కోసమే..: అడవి పందులను వేటాడడానికే వేటగాళ్లు బాంబులను అమర్చారని రైతులు ఆరోపించారు. పక్క గ్రామమైన తురువోలుకు చెందిన నలుగురు అడవిపంది వేటగాళ్లు వారం రోజుల కిందట ఎక్కడో హతమార్చిన రెండు పందులను తెచ్చి ఈ కళ్లాల వద్దే మాంసం విక్రయాలు సాగించారన్నారు. అప్పడే వారిని హెచ్చరించామన్నారు.అయినా పట్టించుకోకుండా తమ పొలాల్లోనే బాంబులు అమర్చారన్నారు. ఆ నలుగురు వేటగాళ్లను మంగళవారం పంచాయతీకి రప్పించి ప్రశ్నంచామన్నారు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారన్నారు.దీనిపై పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేయనున్నట్టు రైతులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment