పాడుబడిన ఇంట్లో దాచిపెట్టిన నాటు బాంబులు పేలిన సంఘటన గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో గురువారం చోటు చేసుకుంది.
గుంటూరు: పాడుబడిన ఇంట్లో దాచిపెట్టిన నాటు బాంబులు పేలిన సంఘటన గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో గురువారం చోటు చేసుకుంది. పిడుగురాళ్ల రూరల్ సీఐ శ్రీధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పాపాయపాలెం గ్రామానికి చెందిన రిటైర్డు టీచర్ మద్దిగ రామిరెడ్డి ఇంట్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు దాచి పెట్టగా అవి ఎండ తీవ్రతకు పేలాయి. రామిరెడ్డి ప్రస్తుతం గుంటూరులో నివాసం ఉంటున్నారు. సంఘటన జరిగిన ఇంట్లో ప్రస్తుతం ఎవరూ నివాసం ఉండటంలేదు. అక్కడున్న ఆరు బాంబులను, పలు మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇంతకీ ఆ బాంబులు ఎవరివి?
గ్రామంలో ఏడాది నుంచి వర్గ విబేధాలతో గొడవలు, కొట్లాటలు జరుగుతున్నాయి. మద్దిగ రామిరెడ్డి గత ఏడాది హత్యకు గురైన సింగరెడ్డి వెంకటరామిరెడ్డి సమీప బంధువు కావడంతో ఆ బాంబులు తెలుగుదేశం పార్టీ వారివేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఆరోపిస్తున్నారు.
(బెల్లంకొండ)