‘బొమ్మ’ పడుద్ది! | bommarillu organisation ready to put IP | Sakshi
Sakshi News home page

‘బొమ్మ’ పడుద్ది!

Published Mon, Jan 6 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM

‘బొమ్మ’  పడుద్ది!

‘బొమ్మ’ పడుద్ది!

 వంద కోట్లతో బోర్డు తిప్పేసేందుకు సిద్ధంగా ఉన్న బొమ్మరిల్లు సంస్థ
     రాజకీయ నిధుల కోసం రియల్ వసూళ్లు  చెక్కుల బౌన్స్‌తో విశాఖ కార్యాలయం ఎదుట
     డిపాజిటర్ల ఆందోళన  చింతలపూడి టీడీపీ టికెట్ రేసులో సంస్థ వ్యవస్థాపకుడు రాజా
 
 విశాఖపట్నం, సాక్షి ప్రతినిధి: పూటకో ఫైనాన్స్ కంపెనీ, రోజుకో రియల్‌ఎస్టేట్ కంపెనీ బోర్డు తిప్పేస్తున్నాయి. విశాఖ కేంద్రంగా పనిచేసిన సిమ్స్, రాగా, స్పార్క్ తదితర కంపెనీలు ఇటీవల జనం నెత్తిన రూ.700 కోట్లకు పైగా శఠగోపం పెట్టిన సంగతి తెలిసిందే. ఆ జాబితాలో టీడీపీ నేత రాయల రాజారావు స్థాపించిన, ప్రస్తుతం తెరవెనుక ఉండి తతంగం నడిపిస్తున్న ‘బొమ్మరిల్లు’ సంస్థ కూడా చేరనుందని తెలుస్తోంది. తమ సొమ్మును రాజకీయాల్లో పెట్టుబడి పెట్టి ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారని ఆరోపిస్తూ బొమ్మరిల్లు బాధితులు తరుచూ సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతున్నారు. వివరాలు.. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి శాసనసభ నియోజకవర్గం సమన్వకర్తగా వ్యవహరిస్తున్న రాజా 2011లో విశాఖ కేంద్రంగా బొమ్మరిల్లు ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ సంస్థను ప్రారంభించారు. రోజుకు రూ.10నుంచి ఆపైన ఎంత చెల్లిస్తే దానికి ఏడాది తర్వాత దాదాపు 40శాతం వడ్డీతో ఆ సొమ్ము తిరిగి చెల్లిస్తామని  ప్రచారంచేశారు.
 
  ఏజెంట్లను నియమించి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారు. సినీతారలను తమ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌లుగా నియమించి జనాన్ని ఆకర్షించారు. ఈ రకంగా వసూలైన సుమారు రూ.100కోట్లతో అనేక చోట్ల భూములు కొనుగోలు చేసి వెంచర్లు వేశారు. విశాఖ జిల్లాలోనే ఐదువేల మంది బొమ్మరిల్లులో డిపాజిట్లు చేశారు.
 
 రాజకీయ అరంగేట్రం కోసం: ఖాతాదారులకు డిపాజిట్లు తిరిగి ఇచ్చే సమయం దగ్గరపడుతున్న సమయంలో రాజా అసలు రంగు బయటపడింది. బొమ్మరిల్లు సొమ్మును రాజకీయ అరంగేంట్రం కోసం వాడుకునేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నుంచి టీడీపీ టికెట్ సంపాదించేందుకు సుమారు 8 నెలల కిందట వ్యూహాత్మకంగా బొమ్మరిల్లు సంస్థ నుంచి తప్పుకున్నారు. తనకు కావాల్సిన ముగ్గురు వ్యక్తులను డెరైక్టర్లుగా నియమించి తదుపరి కార్యకలాపాలు నిర్వహించేలా అధికారిక కార్యక్రమాలు పూర్తిచేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు విశాఖ జిల్లాకు చెందిన అధికార పార్టీ శాసనసభ్యుడి బంధువు మల్ల సత్యనారాయణ ఈ సంస్థలో డెరైక్టర్‌గా నియమించారు. అయితే ఆ తరువాత తలెత్తిన పరిణామాలతో సత్యనారాయణ డెరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నారని తెలిసింది. రాష్ట్రంలోని కార్యాలయా లు ఒక్కొక్కటిగా మూతపడడం, సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడంతో అటు డిపాజిట్‌దారులు, ఇటు ఏజెంట్లలో కలవరం మొదలైంది. దీంతో పెద్దఎత్తున విశాఖ రామాటాకీస్ సంస్థ ప్రధాన కార్యాలయానికి తరలివచ్చిన ఏజెంట్లు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేయసాగారు. ఇదే సమయం లో కాలపరిమితి ముగిసిన డిపాజిట్లకుగాను సంస్థ అందించిన చెక్‌లు బౌన్స్ అయ్యాయి. దీంతో డిపాజిటర్లు సైతం కార్యాలయానికి వచ్చి ఆందోళనకు దిగడం ప్రారంభించారు. తిరుపతిలో రూ.30 కోట్లకు బొమ్మరిల్లు సంస్థ మోసం చేసినట్లు చెబుతున్నారు. చిత్తూరు జిల్లా వాయలపాడు, హైదరాబాద్‌లోని మాదాపూర్, శ్రీకాకుళం జిల్లా రణస్థలం పోలీస్‌స్టేషన్లలో బాధితులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
 
 పశ్చిమలో ‘బొమ్మరిల్లు’ మూలాలు
 ఏలూరు: రాయల రాజారావు మూలాలు పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డి గూడెంలో ఆర్టీసీ కండక్టర్. ఉద్యోగం నుంచి సస్పెండ్ అయిన ఆయన లింగపాలెంలో మందుల షాపు పెట్టి దానినీ తీసేశారు. కామవరపుకోట మండలం ఎ.గోకవరానికి చెందిన ఓ మహిళను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టాక విడిపోయాడు. అనంతరం జలపావారిగూడెంకుచెందిన మహిళను పెళ్లి చేసుకుని ఆమెతోనూ విడిపోయాడు. ఎర్రగుంటపల్లికి చెందిన ఓ వ్యక్తితో కలిసి ‘నీట్‌ఫుల్’అనే నెట్‌వర్క్ పేరుతో దాదాపు 4 వేల మంది నుంచి రూ.40లక్షలు వసూలు చేసి బోర్డు తిప్పేసినట్లు స్థానికులు చెబుతున్నారు. చింతలపూడి నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్న ఆయన పార్టీ ఫండ్‌గా సుమారు రూ.30 కోట్లు సమర్పించారని ఆరోపణలున్నాయి.
 
 
 నాకు సంబంధం లేదు:  రాజా
 ‘బొమ్మరిల్లు సంస్థ నుంచి ఎప్పుడో తప్పుకున్నా. హైదరాబాద్, కొత్తవలస, కోదాడ, ఎస్.కోటతో పాటు అనేక ప్రాంతాల్లో సంస్థకు భూములున్నాయి. వీటన్నింటినీ టేకోవర్ చేసి సంస్థను నిర్వహించేలా ముగ్గురు డెరైక్టర్లకు అధికారికంగా అప్పగించామన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి బొమ్మరిల్లు నిధులు మళ్లించుకున్నానని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు’ అని రాజా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement