విశాఖ సిటీ: కొందరికి పదిమందిలో మాట్లాడాలంటే భయం వెంటాడుతుంది. వారి అర చేతులు చెమటలతో తడిసిపోతాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. కొత్త ప్రదేశాలకు వెళ్లినా, వేదిక పైకెక్కి మాట్లాడాలన్నా వారిలో ఎక్కడి లేని ఆందోళన. ఈ బిడియం వల్లనే చాలా మంది యువత ఇంటర్వ్యూలను ఎదుర్కోలేక ఉద్యోగాల వేటలో విఫలమైపోతున్నారు. అలాంటి వారిలో ఈ స్టేజ్ ఫియర్ పోగొట్టేందుకు బుక్ హాలిక్ సంస్థ బ్లైండ్ ఫోల్డ్ మీట్ ఏర్పాటు చేసింది.
బిడియస్తులకు వినూత్న వేదిక
ప్రతి వారిలోనూ కాస్తో కూస్తో భయం ఉంటుంది. అయితే కొందరిలో ఈ ఆందోళన తీవ్ర స్థాయిలో ఉంటుంది. బయటకు గంభీరంగా కనిపించినా పది మందిలో మాట్లాడాలన్నా, వారికి ఎక్కడా లేని బిడియం ఆవహిస్తుంది. ఈ కారణంగా చాలా మంది భవిష్యత్‌ని కోల్పోతున్నారు. పది మందిలో మాట్లాడకపోవడమంటే మన ఆత్మ విశ్వాసాన్ని క్షీణించుకునేలా చేసుకోవడమే అంటున్నారు బుక్‌హాలిక్ ప్రతినిధులు. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడండి.. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు మాట్లాడండి.. వేదికపై నిలబడి పదిమందితో మీ అనుభవాలు పంచుకోండి.. ఎందుకంటే ప్రయత్నం చేస్తే భయం పోతుంది. భయాన్ని వేరు చేసి దాన్ని పోగొట్టుకునేందుకు మేము వేదిక కల్పిస్తామంటూ వినూత్న పద్ధతిలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ యువకులు. దానిపేరే బ్లైండ్ ఫోల్డ్ మీట్ అప్.
చూసీ చూడనట్లుగానే
స్టేజ్ ఫియర్ వల్ల చాలా మంది అవకాశం వచ్చినా గొంతు పెగల్లేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటారు. ఎదురుగా జనాన్ని చూస్తే ఒక్క పదం కూడా బయటికి చెప్పేందుకు భయపడుతుంటారు. అలాంటి వారిలో భయం పోగొట్టేందుకు పుస్తకమే ఆయుధంగా బుక్‌హాలిక్ స్టార్టప్ కంపెనీ ప్రతినిధులు కార్యక్రమం నిర్వహించారు. జీవితాన్ని ప్రభావితం చేసిన పుస్తకం గురించి చెబుతూనే.. జీవితంలో ఎదురైన అనుభవాల్ని వివరించాలి. స్టేజ్ ఫియర్ ఉన్నవారికి మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించారు. వారు మొదటిసారిగా స్టేజ్‌పై భయ పడతారనే ఉద్దేశంతో వారిని అలవాటు చేసేందుకు కళ్లకు గంతలు కట్టి మాట్లాడించడమే ఈ మీట్ కార్యక్రమం. ప్రస్తుతం పరిగెత్తే ప్రపంచంలో ఏ ఒక్క విషయంలోనైనా వెనకడుగు వేస్తే ఇక రేసులో ముందుకు వెళ్లడం కష్టమని హెచ్చరిస్తూ.. బిడియాన్ని బయటకు పంపించేలా చేస్తున్న ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. ఆదివారం సాయంత్రం అక్కయ్యపాలెంలో నిర్వహించిన ఈ మీట్‌లో సుమారు 30 మంది పాల్గొన్నారు.
ముందు కళ్లకు గంతలు లేకుండా స్టేజ్‌పైకి తీసుకెళ్లారు. చుట్టూ ఉన్న యువతను చూసి భయపడిన వారు.. గంతలు కట్టాక అనర్గళంగా వేదికపై నిలబడే మాట్లాడుతూ అందరి ప్రశంసలూ అందుకున్నారు. అలా ఎలాంటి స్టేజ్ ఫియర్ లేకుండా మొదటిసారి ప్రసంగించడంతో వారిలోనూ కొత్త ఉత్సాహం ఉరకలేసింది. ఒక మంచి పుస్తకం మన విజ్ఞాన వికాసానికి సహాయపడుతుంది... పుస్తకమంటే అక్షరాలున్న పేజీలు కాదు.. పుస్తకమంటే జీవితం.. ఓ అనుభవం కాబట్టి.. ఈ బ్లైండ్ ఫోల్డ్ మీట్‌లో పుస్తకం గురించి ప్రసంగంతో ప్రారంభించామని బుక్‌హాలిక్ ప్రతినిధులు సంవేద్ తదితరులు తెలిపారు. సరికొత్త ఆలోచన అమలు చేస్తే ఏ రంగంలోనైనా విజయం వరిస్తుందని తెలుసుకున్నామనీ, ఈ మీట్‌తో ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నామని కార్యక్రమంలో పాల్గొన్న యువత అభిప్రాయం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment