కడప కార్పొరేషన్: ఈ నాలుగేళ్లలో విచ్చలవిడి అవినీతితో దోచుకున్న సొమ్మును ఎన్నికల్లో ఎదజల్లి గెలవాలన్నదే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకులు పార్థసారథి తెలిపారు. శనివారం కడప నగరంలోని జయరాజా గార్డెన్‌లో కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గాల బూత్ కన్వీనర్లకు నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ బలోపేతానికి, ఎన్నికల్లో గెలుపొందడానికి శిక్షణ తరగతులు నిర్వహించడం ముఖ్యమన్నారు.
గ్రామ, మండల, జిల్లా నాయకత్వాలతోపాటు బూత్ కమిటీలు కూడా చాలా ముఖ్యమని చెప్పారు. బూత్ కమిటీలు ప్రజలకు ఎంత చేరువైతే పార్టీకి అంత లాభం కలుగుతుందని చెప్పారు. అధికార టీడీపీ వైఎ‹స్‌ఆర్‌సీపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగిస్తోందని, బూత్ కమిటీ సభ్యులు ఈ విషయాన్ని గుర్తెరిగి తొలగించిన ఓట్లతోపాటు, కొత్త ఓట్లను చేర్పించాలన్నారు. 2014లో వైఎస్‌ఆర్‌సీపీ ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదని, మన పార్టీ ఓటమి వల్ల నష్టపోయింది ప్రజలేనని తెలిపారు. చంద్రబాబు రాయలసీమ వాసులను రౌడీలు,
గూండాలుగా, సంఘ వ్యతిరేక శక్తులుగా చిత్రీకరిస్తూ కోస్తా ప్రజలను అభద్రతాభావానికి గురి చేస్తున్నారని, తద్వారా తన పార్టీకి మేలు చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎడారిగా ఉన్న రాయలసీమకు కృష్ణాజలాలు ఇవ్వాలనే సంకల్పం దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేని తెలిపారు. పులివెందులకు నీళ్లిచ్చామని మంత్రులు దేవినేని ఉమా, ఆదినారాయణరెడ్డి చెప్పడం పట్ల విరుచుకుపడ్డారు. వారికి సిగ్గూ, లజ్జా ఉంటే ప్రాజెక్టులకు ఎవరెంత ఖర్చు చేశారో వివరించడానికి కడప సెంటర్‌లో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. బలహీన వర్గాలు వారి కాళ్లపై వారు నిలబడేటట్లు చంద్రబాబు చేయడని, వారు అభివృద్ధి్ద చెందడం ఆయనకు ఇష్టం లేదన్నారు. వైఎస్ ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్ల వల్లే మైనార్టీలు అభివృద్ధి చెందారని తెలిపారు.
మోదీ ప్రభుత్వంపై విశ్వాసం లేకే అవిశ్వాసం:విశ్వేశ్వర్‌రెడ్డి
మోదీ ప్రభుత్వంపై విశ్వాసం లేకనే కేంద్రంపై అవిశ్వాసం ప్రవేశపెట్టామని, తమ ఎంపీలు రాజీనామాలు చేశారని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. బీజేపీపై ఇంతకంటే పెద్ద పోరాటం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. పార్టీ పునాదిని పటిష్టం చేయాల్సిన బాధ్యత బూత్ కన్వీనర్లు, సభ్యులపైనే ఉందని, కింది స్థాయిలో ఆర్గనైజేషన్ లేకపోవడంవల్లే 2014లో ఓటమి పాలయ్యామని తెలిపారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలన దేశంలోనే ఆదర్శవంతమైనదని, బాబు పాలనంతా వైఫల్యాలమయమేనన్నారు. నాలుగేళ్లపాటు బీజేపీతో సంసారం చేసి, మంత్రి పదవులు అనుభవించిన టీడీపీ వైఎస్‌ఆర్‌సీపీపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీతో చిత్తశుద్దితో పోరాటం చేసింది తమ పార్టీయేనన్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు.
ప్రతి బూత్‌లో మెజార్టీ తేవడమే లక్ష్యంగా పనిచేయాలి: వైఎస్ అవినాష్‌రెడ్డి
ప్రతి పోలింగ్ బూత్‌లో వైఎస్‌ఆర్‌సీపీకి మెజార్టీ తేవడమే లక్ష్యంగా బూత్ కన్వీనర్లు పనిచేయాలని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరుపుకోనందువల్లే 2014లో పార్టీ ఓటమిపాలైందని, 2019లో ఆ తప్పు పునరావృతం కాకూడదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, జన్మభూమి కమిటీల అరాచకాలు, స్థానిక సంస్థలు నిర్వీర్యమైన వైనం, నీరు–చెట్టులో అవినీతిని ప్రజలకు వివరించాలన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి, పుత్తా నరసింహారెడ్డి పోటాపోటీగా ఇసుక అక్రమంగా తరలించి వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.
వైఎస్ చలువల్లే పుత్తా, ఆది నాయకులుగా ఎదిగారు– సురేష్‌బాబు
దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చలువ వల్లే మంత్రి ఆదినారాయణ రెడ్డి, పుత్తా నరసింహారెడ్డి నాయకులుగా ఎదిగారని వైఎస్‌ఆర్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు అన్నారు. ఎన్నికల్లో బూత్ కమిటీల పాత్ర చాలా కీలకమన్నారు. ఈ నాలుగేళ్లలో చంద్రబాబు చేయని తప్పుల్లేవని, చెప్పని అబద్దాలు లేవని అన్నారు. వైఎస్‌ఆర్ పథకాలే మన పార్టీకి శ్రీరామ రక్ష అన్నారు.దేశంలో ఏ ప్రతిపక్ష నాయకుడు చేయనన్ని ఉద్యమాలు వైఎస్ జగన్ చేశారని తెలిపారు.
ప్రతి కార్యకర్తను ఆర్థికంగా బలోపేతం చేస్తాం: రవీంద్రనాథ్‌రెడ్డి
వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పడితే ప్రతి కార్యకర్తను ఆర్థికంగా బలోపేతం చేస్తామని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 98.6 శాతం ప్రజలు రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు. అర్జునుడికి చిలక మాత్రమే కనిపించినట్లుగా బూత్ కన్వీనర్లకు తమ బూత్‌లోని వెయ్యి ఓట్లే కనిపించాలని అన్నారు.
ఓటర్లను చైతన్యం చేయాలి: డా. సుధీర్‌రెడ్డి
ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలకు లొంగకుండా ఓటర్లను చైతన్యం చేయాల్సిన బాధ్యత బూత్ కన్వీనర్లపై ఉందని జమ్మలమడుగు సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి అన్నారు. 1825 రోజులకు అంటే ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయని, ఓటుకు రూ.2వేలు ఇచ్చినా రోజుకు రూపాయి పదిపైసలు అవుతుందన్నారు. రూపాయి పది పైసలకు ఓటును అమ్ముకోవద్దని సూచించారు. బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ వస్తే 70 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇప్పించుకుంటామని తెలిపారు. ఎవరి సత్తా ఏమిటో ఎన్నికల్లోనే తెలుస్తుందని మంత్రి ఆదినారాయణరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
బూత్ కమిటీ సభ్యుల శ్రమను పార్టీ విస్మరించదు:దుగ్గాయపల్లె
బూత్ కమిటీ కన్వీన ర్లు, సభ్యుల శ్రమను, త్యాగాలను వైఎస్‌ఆర్‌సీపీ విస్మరించదని కమలాపురం సమన్వయకర్త దుగ్గాయçపల్లె మల్లికార్జునరెడ్డి అన్నారు. బూత్ లెవెల్లో పార్టీకి మెజార్టీ తీసుకురావాలసిన బాధ్యత బూత్ కన్వీనర్లదేనన్నారు. అంతకుముందు నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించి, వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వందేమాతరం గీతంతో శిక్షణతరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో కడప శాసనసభ్యులు ఎస్‌బి అంజద్‌బాషా, ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా మధుసూధన్‌రెడ్డి, పార్టీ నాయకులు హర్షవర్ధన్‌రెడ్డి, అఫ్జల్‌ఖాన్ పాల్గొన్నారు.
ప్రభుత్వం వచ్చాక ప్రతి పథకంలోనూ బూత్ కన్వీనర్ల పాత్ర: సజ్జల రామకృష్ణారెడ్డి
వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రతి పథకం అమలులోనూ బూత్ కన్వీనర్ల పాత్ర ఉంటుందని వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి, పార్టీ ప్రాంతీయ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పార్టీని సంస్థాగతంగా, శాస్త్రీయంగా అభివృద్ధి చేస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని, అందుకే రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ఎన్నికల్లో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గరు కలిసి పోటీ చేస్తే టీడీపీకి 5లక్షల 30వేల ఓట్లు ఎక్కువ వచ్చాయని, వైఎస్‌ఆర్‌సీపీకి విజయం అంచు వరకు వచ్చి జారిపోయిందని చెప్పారు. కర్ణాటకలో బీజేపీ కంటే కాంగ్రెస్‌కు 7లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినప్పటికీ సీట్లు తక్కువ వచ్చాయని, బీజేపీ సూక్ష్మ స్థాయిలో కార్యకర్తలను దించి ఎన్నికలు ఎదుర్కొవడం వల్లే సీట్ల వారి సంఖ్య పెరిగిందని వివరించారు. వైఎస్ జగన్ అరుదైన లక్షణాలు ఉన్న వ్యక్తి అని తెలిపారు. తండ్రికి ఏమాత్రం తీసిపోని తనయుడని, ప్రజల కోసం ఆయనకంటే ఒక అడుగు ముందుకే వేస్తారని తెలిపారు. చంద్రబాబు జిత్తులమారి అని, అవినీతి, దోపిడీ, మోసాలే ఆయన నైజమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment