రాయలసీమను ఎడారి చేసే కుట్ర
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటిని ఎడాపెడా వాడేయడం ద్వారా రాయలసీమను ఎడారి చేసేందుకు కుట్ర జరుగుతోందని వైఎస్సార్‌సీపీ కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ పరిస్థితికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌లే కారణమని విమర్శించారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 800 అడుగులకు పడిపోయిందన్నారు. జలాశయాల నీటిని తాగు, సాగునీటి అవ సరాలు తీరాక, విద్యుత్ ఉత్పాదనకు వినియోగించాల్సి ఉంటే ఇద్దరు ముఖ్యమంత్రులూ దీన్ని విస్మరించి సీమకు ద్రోహం తలపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పాదన చేస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందని విమర్శించారు. రిజర్వాయర్‌లో కనీసం 854 అడుగులైనా నీళ్లు లేకుంటే సీమకు నీరివ్వడం సాధ్యం కాదన్నారు. బాబుకు రాయలసీమపై ప్రేమ లేదని, ఆయనదంతా కపట ప్రేమేనని విమర్శిం చారు. పట్టిసీమ నుంచి రాయలసీమకు నీళ్లిస్తామంటున్న వ్యక్తి ఆ ప్రాంతానికి నీటిని తీసుకువెళ్లేందుకు అవకాశం ఉన్న హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులకు భారీగా నిధులెందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. సీమ అభివృద్ధి కోసమే తాను అనంతపురంలో పుట్టిన రోజు పండుగ చేసుకున్నానని సీఎం చెబితే చాలదని, ఆచరణలో చిత్తశుద్ధి ప్రదర్శించాలన్నారు.
పుట్టినరోజులు, బారసాలలు నిర్వహించుకుంటే సీమ అభివృద్ధి జరుగుతుందా? అని ఆయన ఎద్దేవాచేశారు. రాయలసీమలో వచ్చే ఆదాయంతో రాజధాని నిర్మాణాన్ని నిర్మించడంపై మోహన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. రాయలసీమలో లభించే ఎర్రచందనం వేలం ద్వారా రూ.3,000 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం చెబుతోందని, ఆ మొత్తాన్ని రాజధానికి కాకుండా తమ ప్రాంత సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.