
విశాఖలో జగన్ బహిరంగ సభ: బొత్స
అనకాపల్లి టౌన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకత, విభజన చట్టంలో ఉన్న అంశాల్ని ప్రజలకు వివరించేందు కు ఈ నెల 6న విశాఖపట్నం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘జై ఆంధ్ర ప్రదేశ్’ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇందులో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తారన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రానికి హోదా అవసరాన్ని వివరించడంతోపాటు టీడీపీ పాలనలో అవినీతి, సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల నిర్వీర్యం తదితర అంశాలను జగన్ వివరిస్తారని బొత్స తెలిపారు. ఇక్కడి రూరల్ జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి హోదా ఇస్తే పరిశ్రమలు వచ్చి యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు, సమన్వయకర్తలు బొడ్డేడ ప్రసాద్, తిప్పల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.