సాక్షి, అమరావతి: కరోనా సంక్షోభ సమయంలోనూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగిస్తుండటం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రభుత్వం ఓ వైపు కరోనా వ్యాప్తిని సమర్థంగా కట్టడి చేస్తూ మరోవైపు అన్ని వర్గాలను ఆదుకుంటోందన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
► ఇప్పటివరకు దాదాపు 9 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడవ స్థానంలో ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికార యంత్రాంగానికి మార్గనిర్దేశం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుంటే ఏపీలోనే పెరుగుతున్నాయని చంద్రబాబు కళ్లున్న కబోదిలా విమర్శలు చేస్తున్నారు.
► విశాఖపట్నంలో ఎల్‌జీ పాలిమర్స్ బాధితులను పరామర్శిస్తానని అనుమతి తీసుకుని హైదరాబాద్ నుంచి వచ్చిన చంద్రబాబు విజయవాడలో పార్టీ మహానాడులో పాల్గొన్నారు. కానీ బాధితులను పరామర్శించ లేదు. అచ్చెన్నాయుడు కుటుంబాన్ని కలిసేందుకు శ్రీకాకుళం వరకు వెళ్లిన లోకేశ్ ఆ దారిలోనే ఉన్న ఎల్‌జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించలేదు.
► 108, 104 సేవలను చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో పూర్తిగా బ్రేక్‌డౌన్ చేశారు. కానీ ప్రభుత్వం బుధవారం ఒకేసారి 1,088 కొత్త వాహనాలను ప్రారంభిస్తోంది. దీనిపైనా చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. రూ.200కోట్లతో అంబులెన్స్‌లు కొంటే రూ.307 కోట్లు కుంభకోణం అని విమర్శించడం విడ్డూరంగా ఉంది.
► చంద్రబాబు ఐదేళ్లలో ఒక్క పేదవానికి ఇల్లు ఇవ్వలేకపోయారు. వైఎస్సార్ జయంతి రోజున ప్రభుత్వం ఒకేసారి 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనుంది.
► పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం తమ అవినీతికి ఏటీఎంలా మార్చుకుందని స్వయానా ప్రధానమంత్రి నరేంద్రమోదీనే చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరగకపోతే రివర్స్ టెండరింగ్‌లో మరో కంపెనీ తక్కువకు ఎలా కోట్ చేస్తుంది?
► అచ్చెన్నాయుడు అరెస్టు అక్రమం అని అంటున్న చంద్రబాబు అసలు ఈఎస్‌ఐ కొనుగోళ్లలో అవినీతి జరగలేదని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అచ్చెన్నాయుడిలా.. లోకేశ్ లెటర్లు ఇచ్చిఉంటే ఆయన పరిస్థితి కూడా అదే అవుతుంది.
► లాక్‌డౌన్ సమయంలోనూ రైతులు, వ్యవసాయ కూలీలు, వలస కూలీలను అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటోంది. చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలకు ముఖ్యమంత్రి రెండో విడత ప్రోత్సాహకాలను కూడా విడుదల చేశారు. కానీ చంద్రబాబు 2014–19వరకు పరిశ్రమలకు ప్రోత్సాహకాలను చెల్లించనే లేదు. 40ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఘనత ఇదీ. 2014నాటికి ప్రభుత్వ బకాయిలు రూ.32వేలు కోట్లు, లోటు బడ్జెట్ రూ.16వేల కోట్లు ఉండేది. కానీ 2019లో చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయేనాటికి ప్రభుత్వ బకాయిలు రూ.60వేల కోట్లు, అప్పులు రూ.2.45కోట్లకు చేరుకున్నాయి. చంద్రబాబు గొప్పగా చెప్పుకునే గుడ్ గవర్నెన్స్ అంటే ఇదేనా?
► స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 63శాతం రిజర్వేషన్ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తే చంద్రబాబు తన మనుషులను కోర్టులకు పంపి అడ్డుకున్నారు.
ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే సీఎం వైఎస్ జగన్ ధ్యేయం
Published Wed, Jul 1 2020 4:03 AM | Last Updated on Wed, Jul 1 2020 7:55 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment