ఎక్కడ నుంచి తెస్తారు.. ఎప్పుడు తెస్తారు?
హైదరాబాద్: రైతులు, డ్వాక్రా రుణాలు, చేనేత రుణాలన్నీ రూ.లక్ష కోట్లకు పైగా ఉంటే చంద్రబాబు రూ.30 వేల కోట్ల రుణాలే మాఫీ చేస్తాననడం మోసపూరితమని పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. అన్ని రకాల రుణాలను మాఫీచేస్తానన్న బాబు ఇప్పుడు షరతులు విధించడం దివాళాకోరుతనమని దుయ్యబట్టారు.
ఎర్రచందనం, ఇసుక అమ్మినా, గనులు తాకట్టు పెట్టినా ప్రభుత్వ అవసరానికి సరిపడా నిధులు రావని అన్నారు. ఇన్ని వేల కోట్ల రూపాయల నిధులను చంద్రబాబు ఎక్కడ నుంచి తెస్తారో, ఎప్పుడు తెస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొంతనలేని ప్రకటనలతో ఈ ప్రభుత్వం రైతులను ఆందోళనకు గురిచేస్తుందని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు రుణాల మాఫీపై చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయకపోతే వారం, పదిరోజుల్లో పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని సత్తిబాబు హెచ్చరించారు.