దేవరగట్టు జాతరలో బాలుడి మృతి
కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల యుద్ధం రక్తసిక్తమైంది. మాల మల్లేశ్వర స్వామి మూలవిరాట్టును దక్కించుకోడానికి కర్రలతో చేసుకున్న ఈ యుద్ధంలో పదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇంకా చాలామందికి తలలు పగిలాయి. మొత్తం 37 మంది భక్తులు తీవ్రంగా గాయపడినట్లు ఆదోని డీఎస్పీ శివరాంరెడ్డి చెప్పారు. మహేశ్ అనే పదేళ్ల బాలుడు ఈ ఘర్షణలో మరణించాడు. వాస్తవానికి ఉత్సవం చూడటానికి వచ్చిన మహేశ్.. అక్కడ జరిగిన తొక్కిసలాటలో నలిగిపోయి మరణించినట్లు పోలీసులు చెప్పారు. హొలగుండ మండలం దేవరగట్టులో ప్రతియేటా ఈ జాతర జరుగుతుంటుంది. దీనికి లక్షలాది మంది భక్తులు వస్తారు.
ఈసారి కూడా ఈ ఉత్సవంలో ఊహించినట్టుగానే చాలామంది గాయపడ్డారు. ప్రసిద్ధ మాల మల్లేశ్వరస్వామి సమక్షాన ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి మూలవిరాట్‌ను దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. మేమేంటే మేమంటూ ఒకరిపై మరొకరు కర్రలతో కలబడ్డారు. భారీగా పోలీసుల్ని మోహరించినా.. వాళ్లు ప్రేక్షతపాత్రకే పరిమితం కావల్సి వచ్చింది. శనివారం తెల్లవారేవరకూ ఈ కర్రల యుద్ధం కొనసాగింది. పది గ్రామాల ప్రజలు బన్నీ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి మూలవిరాట్ కోసం ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. దాంతో పోలీసులు లాఠీఛార్జ్తో పాటు బాష్పవాయువు ఉపయోగించారు.