
గరుగుబిల్లి (కురుపాం): మండలంలోని దళాయివలసకు చెందిన ఇప్పాకుల ఉమాకార్తీక అదే గ్రామానికి చెందిన బలగ శంకరరావు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కొద్ది నెలల కిందట వీరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దీంతో శంకరరావు పెళ్లి చేసుకోనని కార్తీకకు తేల్చి చెప్పాడు. దీంతో ఈ ఏడాది సెప్టెంబరు 1న గరుగుబిల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. స్టేషన్‌లో అధికారులు, పెద్దల సమక్షంలో ఆరు నెలల్లోగా కార్తీకను పెళ్లి చేసుకుంటానని శంకరరావు ఒప్పుకున్నాడు. తరువాత ఇంటికొచ్చి పెళ్లి చేసుకోనని చస్తే...చావని శంకరరావు కార్తీకను నిందిస్తూ మాట్లాడాడు. దీంతో కార్తీక సెప్టెంబరు 11న చీమల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. గుర్తించిన తల్లిదండ్రులు ఆమెను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందించారు. దీంతో ప్రాణాలతో బయటపడింది. అనంతరం పార్వతీపురం సీఐ ఎదుట మరోసారి దీనికి సంబంధించి పంచాయతీ జరిగింది.
ఈ సమయంలో పోలీసుస్టేషన్‌లో కాకుండా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని శంకరరావు మళ్లీ అంగీకరించాడు. ఈ మేరకు రావుపల్లిలో ముహుర్తాలు కూడా తీసుకొని వధువు ఇంట్లో అక్టోబరు 5న పెళ్లి చేసుకునేందుకు అంగీకరించారు. దీంతో వధువు ఇంట్లో పచ్చని పందిరి వేసి ఇంటిని అలంకరించి వివాహ భోజనాలు కూడా గురువారం నిర్వహించారు. అంతా అయిన తరువాత వరుడు కనిపించకుండా పోవడంతో వివాహం నిలిచిపోయింది. దీంతో గొల్లుమన్న కార్తీక తనకు శంకరరావుతో వివాహం జరిపించాలని కోరుతుంది. ఇదిలా ఉండగా వారం రోజులుగా వరుడు శంకరరావు గ్రామంలో లేని విషయం వెలుగులోకి వచ్చింది. ఎక్కడ ఉన్నాడో కూడా తెలియలేదు. ఇదే విషయమై వరుడు తల్లిదండ్రులు నిశ్చితార్ధానికి ముహుర్తం తీసుకున్నామే తప్ప వివాహానికి కాదని చెబుతున్నారని కార్తీక బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రేమించాడు...పెళ్లి చేసుకుంటానని పోలీసుల సమక్షంలోనే అంగీకరించాడు. దీంతో వధువు తల్లిదండ్రులు నమ్మి వివాహ పత్రికలు వేయించారు. బంధువులు, స్నేహితులకు భోజనాలు కూడా పెట్టేశారు. తీరా వివాహం జరిగే వేళకు వరుడు కనిపించకుండా పోయాడు. దీంతో పచ్చని పందిట్లో పెళ్లి వేడుక జరగాల్సిన ఆ ఇంట్లో విషాదం నెలకొంది. వధువు తెలిపిన వివరాల్లోకి వెళ్తే...
వరుడు వస్తే పెళ్లి చేస్తాం...
పెళ్లి విషయమై ఎస్‌ఐ హరిబాబునాయుడు వద్ద సాక్షి ప్రస్తావించగా పోలీసు ఉన్నతాధికారులు సమక్షంలో శంకరరావు పెళ్లికి కొంత సమయం కావాలని కోరాడని తెలిపారు. సంక్రాంతి తరువాత పెళ్లి చేసుకొంటానని అంగీకరించినట్టు చెప్పారు. ఇరు పక్షాల వారు కూడా దీన్ని అంగీకరించినట్టు తెలిపారు. ప్రస్తుతం వరుడు శంకరరావు పరారీలో ఉన్నాడని, ఆరా తీస్తున్నామని, వధువుకు న్యాయం చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment