విజయనగరం మున్సిపాలిటీ/అర్బన్: సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా బంగారం, వెండి ఆభరణాల వర్తకుల సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న సమ్మెకు తాత్కాలిక విరమణ ప్రకటించారు. 12 రోజులుగా సమ్మెలో ఉన్న వారు శుక్రవారం నుంచి దుకాణాలు తెరిచేందుకు నిర్ణయించారు. ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యూవలరీ ఫెడరేషన్(జెజెఎఫ్) పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 10 వరకు సమ్మె కొనసాగుతున్నప్పటికీ ఏపీ బులియన్ మార్కెట్ నిర్ణయం మేరకు సమ్మెకు తాత్కాలిక విరమణ ప్రకటించినట్లు జిల్లా బంగారం, వెండి ఆభరణాల వర్తకుల సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు విజయ్‌కుమార్, ఎన్.వి.మాధవకృష్ణలు తెలిపారు. వ్యాపారులకు, వినియోగదారులకు భారంగా పరిణమించే 1 శాతం సెంట్రల్ ఎక్సైజ్ సుంకం తగ్గించే వరకు పోరాటం సాగిస్తామని వెల్లడించారు.
నిలిచిపోయిన రూ. 30కోట్ల లావాదేవీలు
జిల్లా వ్యాప్తంగా 229 బంగారం, వెండి ఆభరణాల దుకాణాలు ఉండగా వాటిలో సగటున రోజుకు రూ. 2.5 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. ఈ లెక్కన గత 12 రోజుల్లో సుమారు రూ. 30 కోట్ల మేర లావాదేవీలు నిలిచిపోయాయి. అంతేగాకుండా ఈ దుకాణాల్లో ఉపాధి పొందుతున్న సుమారు 1000 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.
వాణిజ్య బంద్ సంపూర్ణం
బంగారం, వెండి వర్తకుల ఆందోళనకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు గురువారం చేపట్టిన బంద్ సంపూర్ణమయింది. వాణిజ్య మండలి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపునకు జిల్లాలోని వివిధ పట్టణాల పరిధిలోని వ్యాపారులు బంద్ పాటించారు. ఈ బంద్‌వల్ల రూ. 25 కోట్లమేర వ్యాపార లావాదేవీలు స్తంభించాయి. జిల్లా కేంద్రంలో వాణిజ్యమండలి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ వాణిజ్యపన్నులశాఖ ఇటీవల జారీ చేసిన నిబంధనలపై వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బంగారు వర్తకుల ఆందోళనకు తమ సంఘీభావం ఉంటుందని తెలిపారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ ఎం.ఎం.నాయక్‌కు అందజేశారు. కలెక్టర్‌ను కలసిన వారిలో విజయనగరం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ఎం.వి.చలం, కార్యదర్శి పి.కృష్ణ, కోశాధికారి ఎం.శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కె.ప్రకాష్, మేకాకాశీ విశ్వేశ్వరుడు, ఆరిశెట్టి శ్రీనివాస్, రేపాక రామారావు, ముచ్చిరామలింగ, ఎలక్ట్ ప్రెసిడెంట్ పీ.ఎస్.సీ.నాగేశ్వరరావు, సహకార్యదర్శి కె.నరసింహం, కె.శ్రీనివాస్, జి.బ్రహ్మాజీ, పూర్వాధ్యక్షులు వి.చంద్రశేఖరరావు, క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.ఎల్‌నరసింహారావు, పూర్వాధ్యక్షులు పి.వి.రామారావు, ఫర్నిచర్ డీలర్స్ అధ్యక్షుడు ఏ.నరసింగరావు, వివిధ ట్రేడర్ల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
సమ్మెకు విరామం
Published Fri, Mar 18 2016 1:10 AM | Last Updated on Sun, Sep 3 2017 7:59 PM
Advertisement
Advertisement