సంక్షోభంలో ఇటుక పరిశ్రమ | Bricks Industry Loss In West Godavari | Sakshi
Sakshi News home page

సంక్షోభంలో ఇటుక పరిశ్రమ

Published Sat, Sep 1 2018 7:22 AM | Last Updated on Sat, Sep 1 2018 7:22 AM

Bricks Industry Loss In West Godavari - Sakshi

పశ్చిమగోదావరి, పెరవలి: తయారైన ఇటుకలు అమ్ముడవ్వక కొత్త ఇటుక తీయడానికి వాతావరణం అనుకూలించకపోవడంతో ఇటుక పరిశ్రమలపై ఆధారపడిన వందలాది కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. కూలీలకు పనులు లేక బట్టీ యజమానులకు ఇటుకలు అమ్ముడవ్వక నానా అగచాట్లు పడుతున్నారు.  ఇటుకకు డిమాండ్‌ లేకపోవటంతో తీత తీసిన ఇటుకలు అమ్ముడవ్వక యజమానులు గగ్గోలు పెడుతున్నారు. దీనికితోడు నిర్వహణ భారం పెరిగిపోవడంతో ఈపరిశ్రమ నిర్వహణదారులు బట్టీలను నిర్వహించాలో మానాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

జిల్లాలో 40 వేల మందికి జీవనాధారం
జిల్లాలో ఈ పరిశ్రమలపై 4,500 కుటుంబాలు వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుండగా, 40 వేల మంది ఈపరిశ్రమలపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. ఏటా ఇటుక తీత పనులు సెప్టెంబర్‌లో మొదలుపెట్టి నవంబర్‌లో ఇటుక ఆవలు కాల్చడానికి సిద్ధం చేస్తారు. పెరవలి మండలంలో 120 ఇటుక పరిశ్రమలు ఉండగా ఉండ్రాజవరం మండలంలో 80, నిడదవోలులో 120, పెనుగొండలో 95, ఇరగవరం మండలంలో 85 పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో ఈపరిశ్రమలు సుమారుగా 4 వేల వరకు ఉన్నాయి.

ప్రభుత్వ ప్రోత్సాహం కరువు
గత ఏడాదిగా ఇటుక బట్టీ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కోవడంతో నిర్వాహకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ఏడాది మార్చి వరకు ఒడుదుడుకులు ఎదుర్కొన్నా ఏప్రిల్, మే నెలల్లో ఇటుక ధర రూ.7500 పలికింది. ప్రస్తుతం రూ.6500 ఆవ వద్ద ఉంది. దీనితో అప్పటి వరకు నష్టాల్లో ఉన్న పరిశ్రమ లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుతం వర్షాకాలం అవ్వడంతో గృహ నిర్మాణాలు వేగం లేక ఇటుకల విక్రయం మందగించిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇటుక పరిశ్రమదారులకు ప్రోత్సాహం ఇవ్వడం లేదంటున్నారు నిర్వాహకులు. బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వకపోవడంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి నానా అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు.

పెరిగిన ముడిసరుకుల ధరలు
ఇటుక తయారీకి వినియోగించే ముడి సరుకుల ధరలు పెరగడంతో ఇటుక ధరలు పెంచాల్సి వచ్చిందని యజమానులు చెబుచున్నారు. గత ఏడాది బొగ్గు టన్ను రూ.4 వేలు ఉండగా ప్రస్తుతం రూ.5 వేలకు చేరుకుందని,  పుల్లలు(టన్ను) రూ.1800లు ఉండగా నేడు రూ.2500 అయ్యాయని, బొండు 5 టన్నులు గత ఏడాది రూ.5 వేలు ఉండగా ప్రస్తుతం రూ.10 వేలు పలుకుతోందని తెలిపారు. ఊక రూ.2100 నుంచి రూ.3 వేలకు చేరుకుందని చెప్పారు. ప్రస్తుతం 1000 ఇటుక రూ.6500 ధర పలుకుతోందన్నారు. ప్రస్తుత ధరలు నిలకడగా ఉంటేనే నష్టాలు రాకుండా ఉంటాయని చెబుతున్నారు.

రూ.2 లక్షలు నష్టం వచ్చింది
ప్రకృతి వైపరీత్యాలతో ఈఏడాది మేలో కురిసిన వర్షాలకు రూ.రెండు లక్షలు నష్టం వచ్చింది. ఆ తరువాత ధర పెరగటంతో నష్టాలు పూడ్చుకున్నాం. ప్రస్తుతం ధరలు తగ్గినా కొనుగోలు లేకపోవటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం.–మోపిదేవి సోమేశ్వరరావు,ఇటుకబట్టీ యజమాని, మల్లేశ్వరం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement